రాష్ట్రంలోని నిరుపేదలకు జీవో 58 కింద ఒక్కరోజే ఒక లక్షా 25వేల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలు క్రమబద్దీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,377 మందికి, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్ బీటీ నగర్ లో 7,000 మందికి సీఎం ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్ళపైకి బుల్డోజర్లు వచ్చేవని, ఇప్పుడు క్రమబద్ధీకరణ పట్టాలు తీసుకుని అధికారులే పేదల వద్దకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పు ఇదేనని, ఇప్పుడు చరిత్ర మారిందని, తెలంగాణ పేద ప్రజల గోస తెలిసిన బిడ్డలే ప్రభుత్వంలో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్ నగరంలో లక్షమందికి ఇచ్చిన భూమి పట్టాల విలువ పదివేల కోట్ల రూపాయలని, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో పేదల కళ్ళల్లో వెలుగు చూడటంతో తన జన్మ ధన్యమైందని సీఎం పేర్కొన్నారు. పేదలు బాగుంటేనే వచ్చిన తెలంగాణ సార్ధకమైనట్లని, ఎవ్వరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే భయపడేది లేదని, పేదలకు ఇళ్ళు కట్టించి తీరడం ఖాయమని తేల్చిచెప్పారు. బంజారాహిల్స్ వంటి ఏరియాల్లో ఉన్న ఇళ్ళ స్థలాల ధరలే ఈ ప్రాంతానికి ఉంటాయని, ఈరోజు నుండి యజమానులుగా మీ ఇంట్లో బాజాప్తాగా ఉండొచ్చని సీఎం అన్నారు. జీవో 58 కింద మొత్తం 3,36,000 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,25,000 మంది పేదలకు పట్టాలు ఇస్తున్నాం.. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.. వాటిని పరిశీలించిన తర్వాత అందరికీ వందశాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇప్పుడు పట్టాలు రానివారు చిన్నబుచ్చుకోవద్దు.. త్వరలో వీటన్నిటిని పరిశీలించి భూమి కొనుగోలు చేసి అందరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.