mt_logo

కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే తెలంగాణను తెగనమ్ముతారు- హరీష్ రావు

కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే తెలంగాణను ఒకరు ఢిల్లీకి, ఒకరు గుంటూరుకు తెగనమ్ముకుంటారని, తెలంగాణ పాలిటి దుష్టశక్తులైన ఆ రెండు పార్టీలను సాగనంపి తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో పార్టీ ప్రచారం ప్రారంభించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుకు మాజీ మంత్రులే కారణమని, తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రజలు కోరుకున్నట్లుగా సంపూర్ణ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, సీమాంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని, అందుకే ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం కట్టడం సాధ్యం కాదని, ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం కుదరదని, నీళ్ళు, నిధులు, ఉద్యోగాల నియామకాల్లో దోపిడీ సాగదనే ఇలాంటి విమర్శలు కేసీఆర్ పై చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు సభలో చంద్రబాబు జై సమైక్యాంధ్ర అనగానే తెలంగాణ టీడీపీ నేతలు నోళ్ళు తెరిచారని, చంద్రబాబు నాలుకకర్చుకుని మళ్ళీ జై తెలంగాణ అన్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీకే సీఎం పదవి ఇస్తానని చెప్తున్న బాబు సీమాంధ్రలో కూడా బీసీకే సీఎం పదవి ఇవ్వాలని చెప్పారు. ఆయన హయాంలో 10వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఉద్యమించిన అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించారని, చేనేత కార్మికులు ఆకలిచావులకు గురయ్యారని, కరెంటు అడిగితే కాల్చి చంపారని,కల్లు నిషేధంతో 50 వేలమంది గీత కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *