టీఆర్ఎస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో వీడనని, తెలంగాణ పునర్నిర్మాణంలో తానుకూడా భాగస్వామిని అవుతానని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీని వీడి తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. బుధవారం నాడు తనను కలిసిన విలేకరులతో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్టుపైనే పోటీ చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా అదేరోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వివేక్ రెండు గంటలపాటు సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.