mt_logo

తెలంగాణ తెచ్చింది గూండాలకోసం కాదు- ఈటెల

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది బడుగు, బలహీన వర్గాలకోసమేనని, గూండాలు, అరాచకవాదుల కోసం కాదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో మున్సిపల్ అభ్యర్థుల గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు జీ జగదీష్ రెడ్డితో కలిసి ఈటెల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఒకప్పుడు సూర్యాపేట ఉద్యమాలకు ఖిల్లాగా ఉండేదని, నేడు స్థానికంగా ఉన్న నేతల గూండాగిరికి అడ్డాగా మారిందని, టీఆర్ఎస్ అభ్యర్థులను, వారికోసం ప్రచారం చేసేవారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, మేము తలచుకుంటే ఆనవాళ్ళు లేకుండా పోతారు ఖబడ్దార్! అని హెచ్చరించారు. ఇంతకాలం, ఇన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించింది గూండాలు, స్వార్థ రాజకీయనేతలు, భూ కబ్జాదారులకోసం కాదని, ఆకలి, దప్పికల నుండి కాపాడి పేదల బతుకుల్లో సిరులు నింపడానికే అని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రోడ్లపై పడుకుని, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్ళిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉందని, అలాంటి వారితో పెట్టుకుంటే మాడిమసై పోవడం తప్పదన్నారు. ఏనాడూ తెలంగాణ కోసం ఉద్యమించని వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అలాంటి వారికి ఓటు వేయకుండా తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి బంగారు తెలంగాణ సాధించుకోవాలని ఈటెల పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *