mt_logo

హైద‌రాబాద్ నుంచి గ‌ద్వాల్ దాకా… పచ్చదనం, ధాన్య‌పు రాశులు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ నుండి గద్వాల్ వరకు పచ్చని పొలాలు, ధాన్యపు రాశులేనని అన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం వనపర్తి జిల్లాను సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్… అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌న రాష్ట్ర‌, దేశ‌, ప్ర‌పంచ మ‌హిళ‌లంద‌రికీ కూడా తన త‌రుపున‌, మ‌న రాష్ట్రం త‌రుపున శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అన్నారు. య‌త్ర నార్యంతు ప్యూజంతే.. తత్ర ర‌మంత దేవ‌తా అని చెప్పి ఎక్క‌డ స్త్రీలు పూజించ‌బ‌డ‌త‌రో దేవ‌త‌లు సంచ‌రిస్తూ ఉంటార‌ని చెప్పారు. తెలంగాణ‌లో కూడా మ‌న పేదింటి బిడ్డ‌ల‌ను ఆదుకోవ‌డానికి అనేక కార్య‌క్ర‌మాల‌ను మ‌నం తీసుకుంటున్నామని, వాటి గురించి మల్లి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదన్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లా అయిత‌ద‌ని కూడా ఎవ్వ‌రూ క‌లగ‌న‌లేదని, అన్నీ క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయన్నారు. ఇంత‌కుముందే మెడిక‌ల్ కాలేజీకి కూడా శంకుస్థాప‌న చేసి వ‌స్తున్నాని, దాన్ని సుసాధ్యం చేసుకున్నందుకు మంత్రి నిరంజ‌న్ రెడ్డి, వ‌న‌ప‌ర్తి జిల్లా ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.
గ‌తంలో చాలా సార్లు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు వ‌చ్చి కండ్ల‌ల్లో క‌న్నీరు పెట్టుకొని వెళ్లా. ఏడ్చి ఏడ్చి ప్ర‌జ‌ల కండ్ల‌లో ఇంకిపోయిన నీళ్లు, ఎండిపోయిన బోరుబావులు.. ఇవి ఆనాటి బాధ‌లు. ఎన్నో ర‌కాల బెదిరింపులు.. అవ‌మానాలు.. కేసీఆర్ నిన్ను చంపేస్తం అని ఒక‌రు.. వ్య‌క్తిగతంగా న‌న్ను తిట్టినా.. ఓర్పుతో.. మీ దీవ‌న‌తో ప‌నిచేస్తే రాష్ట్రం వ‌చ్చింది. ఖ‌చ్చితంగా ఉద్య‌మ జెండా పాల‌న‌లో ఉంటేనే న్యాయం జ‌రుగుతుంద‌ని మీరు మాకు అధికారం ఇచ్చారు. ఒక్క‌సారి కాదు రెండు సార్లు ఇచ్చారు. తెలంగాణ రాక‌ముందు ఆనాడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఒక్క‌టంటే ఒక్క మెడిక‌ల్ కాలేజీ లేదు. నేడు ఐదు మెడిక‌ల్ కాలేజీలు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఉన్నాయి. ఆనాడు కావాల‌ని ప‌క్ష‌పాత వైఖ‌రితో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీ దద్ద‌మ్మ‌ల్లా ఉంటే.. ఇప్పుడు మొండిప‌ట్ట‌తో క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, భీమా పూర్తి చేసుకున్నాం. దాని వ‌ల్ల ఇప్పుడు వ‌న‌ప‌ర్తి జిల్లా సస్య‌శ్యామ‌లం అయింది. హైద‌రాబాద్ నుంచి గ‌ద్వాల్ దాకా ధాన్య‌పు రాశులు చూశా. అద్భుత‌మైన పంట‌ల‌తో నేడు పాల‌మూరు జిల్లా పాలు కారుతోంది. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం కూడా త్వ‌ర‌లో పూర్తి చేస్తే.. బ్ర‌హ్మాండ‌మైన వ‌జ్ర‌పు తునుక మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అవుతందన్నారు. తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు క‌రెంట్ లేదు.. మంచినీళ్లు లేవు.. సాగునీరు లేదు.. వ‌ల‌స‌లు.. భ‌యంక‌ర‌మైన బాధ‌లు.. ఆక‌లి చావులు..ఉండేవన్నారు. కానీ ఈరోజు నేను పేప‌ర్ల‌లో చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా. రాయ‌చూర్, కర్నూల్ నుంచి మ‌న‌కు కూలీలుగా వ‌స్తున్న‌రు. యావ‌త్ తెలంగాణ‌లో 11 రాష్ట్రాల నుంచి వ‌ల‌స కూలీలు వ‌చ్చి మ‌న ద‌గ్గ‌ర ఉత్ప‌త్తి అయ్యే ప‌నిలో వాళ్ల జీవితాన్ని గడుపుతున్నారు. 7 ఏళ్లు క‌డుపు గ‌ట్టుకొని అవినీతి ర‌హితంగా ప‌నిచేస్తే ఈ అభివృద్ధి సాధ్యం అయింది.. అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *