mt_logo

బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేడు- సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. తర్వాత నల్గొండ పట్టణంలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇంటింటికి నీరు, కరెంటు ఇచ్చే రెండు గొప్ప ప్రాజెక్టులను నల్గొండ జిల్లాలోనే ప్రారంభించడం తనకు చాలా తృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం 2019 నాటికల్లా దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందని, రూ. 91,500 కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు.

దేశంలోనే అతి పెద్దదైన నాలుగువేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు అయిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు భూమిపూజ చేసి వచ్చాను.. ప్రతి ఇంటికి, గుడిసెకు, దూరంగా ఉన్న బస్తీకి కూడా రూ. 40వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశపెట్టామని కేసీఆర్ చెప్పారు. నల్గొండ జిల్ల నుండి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలడం కోసమే మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఏర్పాటుచేశామని, వచ్చే నాలుగేళ్ళలో కృష్ణా, గోదావరి నదీజలాలతో తెలంగాణ ఆడబిడ్డల కాళ్ళు తడుపుతామని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వాళ్ళను ప్రజలు నిలదీయాలన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ చంద్రబాబు అయ్యజాగీరు కాదు.. పక్క రాష్ట్రపోడు వచ్చి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీని గెలిపిస్తానంటే ఇక్కడ మేము చేతులు ముడుచుకుని కూర్చోవాలంట.. ఆంధ్రాలో మీటింగ్ పెట్టి నన్ను అన్యాయంగా ఏసీబీ కేసులో ఇరికించారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. పట్టపగలు దొరికిన దొంగ.. ఇవ్వాళ పెద్దగా మాట్లాడుతున్నాడు.. మా పనులు మేం చేసుకోవడానికే 24 గంటల సమయం సరిపోదు.. నిన్ను ఇరికించే ఖర్మ మాకెందుకు? హైదరాబాద్ మీద నీకెంత హక్కు ఉందో నాకూ అంతే హక్కు ఉందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. హైదరాబాద్ నీ అయ్య జాగీరు కాదు చంద్రబాబూ, ఇవ్వాళ హైదరాబాద్‌కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి.. హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్‌డిక్షన్ ఉంటుంది.. ఈ రాష్ట్ర డీజీపీకి ఉంటది.. నీ డీజీపీకి ఉండదు.. ఢిల్లీదాకా నీ బతుకేందో, నీ రాజకీయాలేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెల్సిపోయింది.. ఇవ్వాళ తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏదిపడితే అది చేస్తానంటే చూడటానికి సిద్ధంగా లేదని, నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *