mt_logo

సర్వ శక్తులు తెలంగాణ మంచికే వినియోగిస్తాం- సీఎం కేసీఆర్

బుధవారం గ్రాండ్ కాకతీయలో ఏర్పాటుచేసిన దివంగత ఉపముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ కేకే, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జేవీ నర్సింగరావు కుమారుడు నృపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవీ నర్సింగరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. జేవీ వంటి వ్యక్తులు మన మధ్య లేకపోయినా ప్రజల మనసులో జీవించే ఉంటారన్నారు. ప్రజానేతగా, విద్యావేత్తగా, న్యాయవాదిగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేశారు. అనేక ఒడిదుడుకులు, సవాళ్లు ఎదుర్కొంటూ ఆయన ముందుకు సాగారని, రాష్ట్రంలో తొలి విద్యుత్ బోర్డు చైర్మన్ గా ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని చెప్పారు. 1985లో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు జేవీ నర్సింగరావు తమ గ్రామానికి మొదటగా కరెంట్ తీసుకొచ్చారని చెప్పారని సీఎం గుర్తు చేశారు.

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఎందరెందరో నాయకులు ఉన్నతంగా వ్యవహరించి ఆదర్శప్రాయంగా నిలిచారని, అయితే ఆ విలువలు రానురాను తగ్గిపోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కొందరు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, రాజకీయాల్లో అసహన వైఖరి పెరిగిందని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు. తెలంగాణలో ఎందరో మహామహులు ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారి చరిత్రను మరుగున పడేశారని, ప్రత్యక రాష్ట్రం ఏర్పడడం వల్లే ఇక్కడి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపడమే కాకుండా మనవాళ్ళను గౌరవించుకునే అదృష్టం దక్కిందని కేసీఆర్ పేర్కొన్నారు. మన గడ్డమీద పుట్టిన పీవీ నరసింహారావు దెస ప్రధానిగా మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడంతో పాటు, దేశ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపాన్ని తీసుకొచ్చారన్నారు. అయినా ఆయనను ఉమ్మడి రాష్ట్రంలో విస్మరించారని, నాటి ప్రభుత్వాలు ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మహాకవి దాశరథి, కాళోజీ పేరిట కాళోజీ ఫౌండేషన్, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ పేరిట యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని, పీవీని దీర్ఘకాలంగా గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. ఎంతోమంది త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఎన్నో త్యాగాలతో దక్కించుకున్న ఈ రాష్ట్రంలో ఎలాంటి పొత్తులు లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడితే ప్రజలు నమ్మకంతో గెలిపించారన్నారు. తల పోయినా తప్పు చెయ్యం.. ఒకవేళ ఏదైనా అర్ధం కాకపోతే ముందుకు అడుగెయ్యం.. తప్పు చేసే అధికారం మాకు లేదని కేసీఆర్ అన్నారు. ప్రాణం పోయినా చెడువైపు వెళ్ళం.. సర్వశక్తులు తెలంగాణ మంచికే వినియోగిస్తాం.. ఎవరో ఏదో అన్నారని ఆదుర్దాతో ఆగమై పనిచేయనని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *