mt_logo

యూ ట్యూబ్‌లో కనువిందుచేస్తున్న రాష్ట్ర పర్యాటక వీడియో!!

తెలంగాణ.. కోటి రతనాల వీణ. శతకోటి అందాల జాణ. నిన్నటి దాకా ఆవిష్కరించని ఆ శతకోటి అందాలను పర్యాటక ప్రపంచానికి పరిచయం చేస్తోంది వెల్‌కమ్ టు తెలంగాణ. అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యంలోకి నడిపిస్తూ, కనువిందు చేసే కట్టడాల మధ్య తిప్పుతూ, శ్రమైక్య జీవన సౌందర్యాన్ని కళ్లకు కడుతూ.. ప్రతి వీక్షకుడినీ తెలంగాణలోకి నడిపిస్తోంది పర్యాటక శాఖ రూపొందించిన ఈ వీడియో.

ఈ నేల కట్టిన కోటలెన్నింటికో ఆదెరువు. పర్యాటకానికి పెట్టనికోటలాంటి అందాలకు నెలవు. ఆ రాచరిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రకృతి రమణీయతను, శ్రమైక్య జీవన సౌందర్యాన్ని ఏకకాలంలో చూపిస్తూ తెలంగాణ జీవితంలోని వైవిధ్యాన్ని, విశిష్టతను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తోంది వెల్‌కమ్ టు తెలంగాణ. తెలంగాణ ఆత్మ పల్లె.

ఆ పల్లె ఆత్మను ప్రతిబింబించే మన్నులా మిన్ను జాజు రంగులో ఆవిష్కృతమై ఈ వీడియో ప్రారంభమవుతుంది. అతిసూక్ష్మమైన ఓరుగల్లు శిల్ప సౌందర్యం, ఆనాటి ప్రాచీన చెరువుల అందాలు, ఆ చెరువుల్లో విహరించే జనాలు, తల్లిలాంటి పల్లె ఆసరా చేసుకున్న చెరువుని ఆదెరువగా చేసుకుని పైరుల్లో కనిపించే రైతుల్ని చూపిస్తూ, ఆకాశానికి ఎదిగిన తాడి తలదన్ని కల్లును తెచ్చే గీత కార్మికులు, సాయంకాలం ఆనందాల ఆటకు తంగేళ్లు పేర్చే ఆడబిడ్డలు, బతుకమ్మ ఆటల నుంచి బోనాల జాతరలా సాగిపోతూ మన కళలు, చేతివృత్తులు, ఆహార్యం, ఆనందం, ఆర్భాటాలు అన్నింటినీ ఏకకాలంలో చూసిస్తూ నడిపిస్తూ తీసుకుపోతూనే ఉంటుంది.

3 నిమిషాలు.. పది జిల్లాలు..
తెలంగాణలోకి అడుగుపెట్టే పర్యాటకులకు, పరిశోధకులకు గోల్కొండ కోట, ఓరుగల్లు కోటలే తొలి ప్రాధమ్యాలు. గ్లోరియస్ లెగసీ ఆఫ్ డైనాస్టీని పరిచయం చేస్తూనే సుపరిచితమైన కట్టడాల కంటే ప్రాచుర్యం పొందని ప్రాచీన వైభవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు వెల్‌కమ్ టు తెలంగాణ దర్శకుడు దూలం సత్యనారాయణ.

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ నగరంలో పూర్వం రాచరిక వైభవంతో అలరారిన గోల్కొండ కోట, నగరానికి చిహ్నమైన చార్మినార్ కనిపిస్తాయి. కానీ అంతటి ప్రసిద్ధమైన మక్కా మసీదు కనిపించదు. కుతుబ్‌షాహీ రాజు కుమార్తె నిర్మించిన ఖైరున్సిసా మసీదు కనిపిస్తుంది. నిజాం రాచరిక పాలనకు కేంద్రంగా విలసిల్లిన చౌ మహల్లా కనిపించని ఈ వీడియోలో ఫలక్‌నుమా ప్యాలస్ దర్శనమిస్తుంది. ఆవిష్కరించని అందాలను ఆవిష్కరించడం, ప్రాచుర్యం పొందని ప్రాచీన అద్భుతాలకు పదుగురికి తెలియజేయాలనుకోవడమే వెల్‌కమ్ టు తెలంగాణ బృందం ఆలోచన.

అందుకే కాకతీయుల కోటల నుంచి రామప్ప చెరువు చుట్టూ పంటపొలాలు చూపి, లక్నవరం చెరువులో విహరింపజేసి, ఆ వెంటనే రంగారెడ్డి జిల్లాలోని అనంతరగిరి అడవులకు నడిపిస్తుంది. పశువులు, పక్షులు, పచ్చని పొలాల మధ్య తిప్పుకుంటూనే, ఆదిలాబాద్ అడవుల్లోని కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో తిప్పుతూ, ఒక్కసారిగా కుంతాల జలపాతం ఎక్కించి, నీళ్లతోపాటు జాలువారుతూ మనల్నీ తనతోపాటు కిందికి తీసుకువస్తుంది.

నేలచేరిన జలపాతాల గలగలను వినిపిస్తూ ఆ వెంటనే ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని అలలపై తిప్పుతోంది. నీటి ఆవాసాలను ఆదెరువు చేసుకుని జీవనం సాగించిన ప్రాచీన మానవుడు పాండవుల గుట్టలోని రాతి కుడ్యాలపై సృజించిన చిత్రకళను చూపిస్తూ, కాకతీయ కళావైభవానికి ఈనాటి ప్రతీకలైన పెంబర్తి కళాకారుల్ని పరిచయం చేస్తోంది.

రంగుల కలబోతకు తమదైన ప్రత్యేకతను అనుసరిస్తూ ఇకత్ వర్ణాలతో అద్భుతాలు చేసే పోచంపల్లి చేనేత కళాకారుల్లోకి నడిపిస్తూ సంప్రదాయ కళల నుంచి ఆదిమకాలంలో పుట్టి, ఆదివాసీల వారసత్వంగా ఉన్న కొమ్ముకోయ కళాకారుల దగ్గరకు చేరుస్తుంది. దట్టమైన అడవుల్లో అందమైన వన్యప్రాణుల మధ్య విహరింపజేస్తుంది. పర్యాటకమంటే ఎత్తయిన కొండలో, లోతైన లోయలే కాదు. అడవులు, నదుల మధ్య సాగే ప్రయాణంలో దారికి ఇరువైపులా ఉండే పల్లె, ప్రజలు, చేను, చెలక, రైతు కూడా అంటుంది ఈ పర్యాటక ప్రయాణం.

మూడు నిమిషాల నిడివిలోనే పది జిల్లాల అందాలను, అద్భుత కట్టడాలను, జనజీవన సంస్కృతిని కళ్లకు కట్టింది వెల్‌కమ్ టు తెలంగాణ. ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా తెలంగాణ అందాలను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్‌లో లక్షలాది మందిని ఆకట్టుకుంది.

ఆకాశంలో పక్షిలా పదిజిల్లాలపై ఎగురుతూ సాగిపోయిన కెమెరా వీక్షకుల్ని కూడా తన భుజాలపై ఎత్తుకుని తిప్పుతూ తెలంగాణను చూపిన అనుభూతి కలిగిస్తోంది ఈ వీడియో. సాధారణ డాక్యుమెంటరీల్లో ఉన్నట్లుగా పరిచయం లేకపోవడం ఈ అనుభూతికి ఒక కారణమైతే, దర్శకుడు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ప్రతిభ మరో కారణం. Every place has a story for you. Every movement is an experiance for you. అంటున్న పర్యాటక శాఖ మాట అక్షరాలా నిజం. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యాలు. వెల్‌కమ్ టు తెలంగాణ.

అడవుల్లో పడుకున్నాం..
మాది మంచిర్యాల. నాకు డాక్యుమెంటరీలంటే చాలా ఇష్టం. ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు తీశాను. అమెరికా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో ఆ దేశంలోనే దర్శకత్వ కోర్స్ చేస్తున్నాను. ఏడాది క్రితం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులను సంప్రదించి బోనాలు డాక్యుమెంటరీ చేస్తానన్నాను. వారు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బతుకమ్మ చేయమన్నారు. పర్యాటక శాఖ హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పర్యాటకంపై చేశాను.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటకాన్ని ఆవిష్కరించే వీడియో చేయమన్నారు. ఇందుకోసం తెలంగాణను అధ్యయనం చేశాను. వారసత్వ కట్టడాలు, చారిత్రక విశేషం ఉన్న ప్రదేశాలతోపాటు ప్రకృతి అందాలు, జనజీవన సంస్కృతి, శాతవాహనుల నుంచి నిజాం రాజ్యాల వరకు అన్నింటినీ చూపించాలనుకున్నాను. ఆ విధంగానే అన్ని ప్రదేశాలకు తిరిగి షూటింగ్ పూర్తి చేశాం. మారుమూల పల్లెల్లో వసతులు లేకున్నా కష్టపడి టేకింగ్ చేశాం. అనుకున్న ప్లేస్‌లోనే టేకింగ్ చేయాలని కష్టపడి చేరుకున్నాం. అడవుల్లో పడుకున్నాం.

ఈ డాక్యుమెంటరీకి వినయ్, ప్రవీణ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సహకారం అందించారు. పవన్ శేష సంగీత సహకారం అందించారు. అడవుల్లో పడుకుని ఒక్కే ప్రదేశాన్ని 10 నుంచి 15 సార్లు టేకింగ్ చేశాం. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. ఇతర దేశాల వాళ్లు కూడా ప్రశంసించారు.
-దూలం సత్యనారాయణ, డైరెక్టర్, వెల్‌కమ్ టు తెలంగాణ

Dulam Satyanarayana
Filmmaker
Mobile : +91 78931 39070
email: dsnmatrix@gmail.com
www.vimeo.com/dulam

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *