రాష్ట్రంలో రోడ్లు ఒక్కసారి వేస్తే చెక్కు చెదరొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రోడ్ల మరమ్మతుకు వారంలోగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ రెండోవారంలోగా టెండర్లు పూర్తికావాలన్నారు. రాష్ట్రంలో రోడ్లు రవాణా ఒత్తిడి వల్ల, కాలానుగుణంగా మరమ్మతులకు గురవుతున్నాయని, వాటిని గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా తీర్చిదిద్దాలని చెప్పారు.
ప్రగతిభవన్‌లో గురువారం రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో అభివృద్ధి పనుల పరిమాణం రోజురోజుకూ పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకొని, బాధ్యతల వికేంద్రీకరణ చేపట్టాలని సూచించారు.
ఇంజినీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా విభిన్నంగా ఆలోచన చేయాలన్నారు. వానలు, వరదల కారణంగా తెగిపోయిన రోడ్లకు, సాధారణ రోడ్ల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలాగే ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను తయారు చేసుకొని, రోడ్లను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లు ఎకడెకడ ఏ మూలన దెబ్బతిన్నాయనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజినీర్ల దగ్గర ఉండాలని చెప్పారు.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, దెబ్బతిన్న వాటిని వెంటనే మరమ్మతు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రోడ్ల నిరంతర పర్యవేక్షణ బాధ్యత ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలదేనని స్పష్టంచేశారు. ఆ దిశగా ఆయా శాఖల్లో పరిపాలన సంసరణలు అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవాలని సూచించారు.
ఇతర శాఖల మాదిరే ఆర్‌అండ్‌బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలన్నారు. ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్‌ఈ ఉండే విధంగా, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని చెప్పారు. పటిష్ఠంగా పనులు జరగాలంటే ఎస్‌ఈల సంఖ్య, ఈఈల సంఖ్య ఎంత ఉండాలో ఆలోచన చేయాలని సూచించారు. పని విభజన జరగాలన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ, పంచాయితీరాజ్‌శాఖలను పటిష్ఠం చేసుకొనేందుకు పలు మార్గాలను అనుసరించాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. శాఖల్లో బాధ్యతల పునర్విభజన, వానలకు, వరదలకు కొట్టుకుపోయిన రోడ్ల (ఎఫ్‌డీఆర్) మరమ్మతులు, నిర్వహణ, మరమ్మతులు తదితరాలకు కిందిస్థాయి ఇంజినీర్లు సత్వరం నిర్ణయం తీసుకొని పనులు చేపట్టేలా నిధుల కేటాయింపు వంటి మార్గాలను అవలంబించాలని దిశానిర్దేశం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచి, వారంలోగా కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు.
అందుకు సంబంధించిన కార్యాచరణపై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు దెబ్బతింటున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో రైతులు, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లను చైతన్యం చేయాలని సీఎం చెప్పారు. కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్నారు. పంచాయితీరాజ్ శాఖ ఇంజినీర్లు వారి శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.