mt_logo

డాటా సెంటర్ హబ్ గా అవతరిస్తోన్న తెలంగాణ 

ఇప్పటికే ఈ-కామర్స్‌, ఫార్మా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌..ఇక డాటా సెంటర్‌ మార్కెట్‌ గా అవతరిస్తున్నది. ప్రస్తుతం 30-40 మెగావాట్లుగా ఉన్న హైదరాబాద్‌ డాటా సెంటర్‌ సామర్థ్యం.. రానున్న రోజుల్లో 300 మెగావాట్లకు ఎగబాకే అవకాశం ఉన్నదని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్స్‌ సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ తాజా నివేదికలో వెల్లడించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో టాప్‌ డాటా సెంటర్‌ మార్కెట్‌గా (భారత్‌ నుంచి) హైదరాబాద్‌ ఉన్నదని నైట్ ఫ్రాంక్ వివరించింది. హైదరాబాద్ తర్వాత చెన్నై, న్యూఢిల్లీ కూడా డాటా సెంటర్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా పేర్కొంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఈ ఒక్కో నగరంలో డాటా సెంటర్‌ సామర్థ్యం 300 మెగావాట్ల చొప్పున పెరుగవచ్చని అంచనా వేసింది. అలాగే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఐదేండ్ల కిందట డాటా సెంటర్ల సామర్థ్యం 700 మెగావాట్లుగా ఉంటే ఇప్పుడు అది 3 వేల మెగావాట్లకు చేరుకున్నదని పేర్కొంది. రానున్న కాలంలో ఇది మరింత విస్తరిస్తుందని అంచనా వేసింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలతోనే..

డాటా సెంటర్ల ఏర్పాటు కోసం బహుళజాతి కంపెనీలకు అవసరమైన స్థలం, రాయితీలను తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కేటాయిస్తున్నది. హైదరాబాద్‌లో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి ట్రాన్స్‌కో, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రత్యేకంగా ఉప విద్యుత్తు కేంద్రాలను నిర్మించడం కూడా కలిసొచ్చింది. ఇక నగరంలో మానవ వనరులకు కొదువ లేదు. ఈ సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకొనే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర దిగ్గజ సంస్థలు ఇక్కడ డాటా సెంటర్లను ఇప్పటికే స్థాపించాయి. నిజానికి పెరుగుతున్న ఈ-కామర్స్‌, ఎడ్‌టెక్‌, డిజిటల్‌ లావాదేవీల వినియోగం.. ఆయా సంస్థల ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నది. 5జీ రాకతో డాటా వినియోగం మరింత పెరుగవచ్చని అంచనా. దీంతో ప్రధాన నగరాల్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

డాటా సెంటర్‌ అంటే ?

డాటా సెంటర్‌ అంటే ఓ కేంద్రీకృత స్థానం. ప్రతీ సంస్థ రోజూవారీ కార్యకలాపాలకు ఇదే కీలకం. సంస్థకు చెందిన సమస్త సమాచారాన్ని ఇక్కడే నిక్షిప్తం చేస్తారు. డాటా, అప్లికేషన్ల కలెక్టింగ్‌, స్టోరింగ్‌, ప్రాసెసింగ్‌, డిస్ట్రిబ్యూటింగ్‌లపై కంప్యూటింగ్‌, నెట్‌వర్కింగ్‌ ఎక్విప్‌మెంట్‌ వంటివి ఈ సెంటర్లలో ప్రధానంగా నిర్వహిస్తారు. ఉదాహరణకు.. మనం గూగుల్‌లో ఏదైనా కీవర్డ్‌ టైప్‌ చేయగానే.. క్షణాల్లో వేలాది పేజీల సమాచారం కనిపిస్తుంది. డాటా సెంటర్‌ నుంచే ఈ సమాచారం లభ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *