mt_logo

పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం..

పాలమూరు- రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం పైలాన్ ను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఇవ్వాళ తనకు ఎంతో సంతోషంగా ఉందని, జీవితంలో మంచి పనులు చేసే అవకాశం, ప్రజల దుఃఖంలో పాలుపంచుకునే అవకాశం కొందరికే వస్తుందని అన్నారు. బొట్టుబొట్టుకు పరితపించిన జిల్లా పాలమూరు అని, కృష్ణమ్మ నీటితో పాలమూరు జిల్లా కాళ్ళు కడుగుతానని గతంలో అన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

రూ. 35, 200 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నామని, ముంపుకు గురికాకుండా చాలా ప్రయత్నం చేశామన్నారు. ప్రాజెక్టు కింద కేవలం మూడు తండాలు మాత్రమే మునుగుతున్నాయని, కరివెన ముంపుకు గురి కావట్లేదని సీఎం చెప్పారు. ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెడతామని, తల తాకట్టు పెట్టైనా నాలుగేళ్ళలో జిల్లాను సుభిక్షం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మూడు తండాల్లో ముంపుకు గురైన వారికి పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తామని, జిల్లా ప్రజలకు మంచి కలెక్టర్ దొరికారని, అందరూ వివరాలు అందజేయాలని చెప్పారు.

ప్రతి పదిహేను రోజులకొకసారి ఇక్కడకు వచ్చి పనులను పరిశీలిస్తానని, ఇందుకోసం అక్కడే ఉన్న గుట్టపై ఒక గెస్ట్ హౌజ్ కట్టుకుని ఉంటానని సీఎం అన్నారు. ఇదిలాఉండగా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని భావించిన సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 6, 190 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇవ్వాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *