బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం తర్వాత నిర్ణయాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఓటుకు నోటు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్ పై పదేండ్లు తనకు హక్కు ఉందని చంద్రబాబు చెప్పడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇక్కడ ఆయన కేవలం ఒక గెస్ట్ సీఎం మాత్రమేనని, కావాలంటే విభజన చట్టాన్ని చదువుకోవాలని, హైదరాబాద్ పదేళ్ళు ఫెసిలిటేటింగ్ క్యాపిటల్ మాత్రమేనని సూచించారు. అహంకారం, అరాచకంతో మాట్లాడుతున్న చంద్రబాబు ఆటలు ఇంక సాగవని, చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని కేసీఆర్ తేల్చిచెప్పారు.
తనను అరెస్టు చేసిన రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆఖరిరోజని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దొరికిన దొంగని, ఆయన చర్యను ప్రధాని మోడీ కూడా సమర్ధించబోరన్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బాబు దానినుండి తప్పించుకోవడానికి గాయిగాయి చేస్తున్నాడని కేసీఆర్ అన్నారు. కేవలం 63మంది ఎమ్మెల్యేలతోనే టీఆర్ఎస్ పార్టీ 5 ఎమ్మెల్సీ సీట్లకు పోటీ చేసిందని అంటున్న పెద్దమనిషి చంద్రబాబు వైసీపీ నుండి ఇద్దరు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నాడు? ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలను, ఒక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ను పార్టీలో చేర్చుకున్నాడు. నువ్వు చేర్చుకుంటే నీతి! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక కొత్త వాతావరణం వచ్చి తెలుగుదేశాన్ని ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితే అది అవినీతా? దీనికి చంద్రబాబు సమాధానం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు.