mt_logo

అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పీఅండ్ జీ పరిశ్రమ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన అమెజాన్ ఫుల్  ఫిల్మెంట్ కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ అఖిల్ సక్సేనా, సంస్థ సిబ్బంది మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తుందని, అమెజాన్ సంస్థ ఏర్పాటుకు కేవలం పది రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని అన్నారు. భవిష్యత్తులో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఒకే ఒక్క దరఖాస్తుతో అనుమతులు ఇస్తామని చెప్పారు. ఈ సంస్థ ద్వారా సుమారుగా 600 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు.

అమెజాన్ ఏడువేలకు పైగా ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నదని, ఈ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రం ఏర్పాటుతో రవాణా, ప్యాకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని కేటీఆర్ చెప్పారు. సంస్థకు చెందిన డాటా కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారని, పరిశ్రమల్లో స్థానికులకు ఉపాథి లభించేలా చర్యలు తీసుకున్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *