చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం హాంకాంగ్ లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని, కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం వారిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామికవిధానం(టీఎస్ఐపాస్) గురించి వివరించిన సీఎం పారిశ్రామిక అనుమతుల కోసం గ్రిల్స్ లేని సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని, అతి తక్కువ సమయంలోనే అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు.
హాంకాంగ్ లోని రినైస్సెన్స్ హార్బర్ వ్యూ హోటల్ లో జరిగిన సెమినార్ లో ఐదు నిమిషాల వ్యవధితో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించగా సెమినార్ కు హాజరైన పారిశ్రామికవేత్తలు దానిని ఆసక్తిగా తిలకించారు. అనంతరం టీఎస్ఐపాస్ పై తమకున్న సందేహాలను అక్కడి పారిశ్రామికవేత్తలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానం గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. సెమినార్ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ బృందం భారత కాన్సులేట్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్ తో కలిసి లాంతౌ ద్వీపం న్యాంగ్ పింగ్ ప్రాంతంలోని టియాన్టన్ భారీ కంచు బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఇదిలాఉండగా పదిరోజుల చైనా పర్యటనను ముగించుకుని సీఎం బృందం హాంకాంగ్ నుండి బయలుదేరి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది.