mt_logo

బ్యాంకర్లపై మండిపడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి!

రైతులు కరువుతో బాధపడుతుంటే బ్యాంకర్లు రుణమాఫీ విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిదికాదని, రైతులనుండి ఎలాంటి వడ్డీ వసూలు చేయొద్దని వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రులు పోచారం, హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలు రుణమాఫీ, పంటరుణాలు అందించడంలో జాప్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం 36.33 లక్షలమంది రైతులకు రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, ఇప్పటికే రెండు విడతలుగా 50 శాతం డబ్బులను బ్యాంకులకు విడుదల చేశామని చెప్పారు. రైతుల పరిస్థితికి చలించి ప్రభుత్వం రుణమాఫీ చేస్తే బ్యాంకర్లు మాత్రం మాఫీ వర్తింపు, తిరిగి రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు.

నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తామని, రైతులనుండి ఎలాంటి వడ్డీ వసూలు చేయొద్దని ప్రభుత్వం జీవో 323 విడుదల చేసింది.. కానీ ఆ జీవోను పట్టించుకోకుండా బ్యాంకర్లు రైతుల ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్నారు.. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలను, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదికను, ప్రభుత్వ జీవోలను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే లెక్కలేదా? ఇంత బరితెగింపు ఎందుకు? ఇదేనా మీ పనితీరు? బ్యాంకర్లు ఇదేవిధంగా వ్యవహరిస్తే సహాయనిరాకరణ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపచేయాలని, మాఫీ వచ్చినట్లుగా ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు అందించాలని, బ్యాంకులు కూడా ప్రభుత్వంలో భాగమేనని బ్యాంకర్లు గుర్తుపెట్టుకుంటే మంచిదని పోచారం సూచించారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతుల జీవితాలతో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆడుకుంటున్నాయని, రూ. లక్ష రుణం తీసుకున్న రైతు నుండి పత్తికి రూ. 13వేల ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారని, పంట నష్టపోయినా ఇన్సూరెన్స్ చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లానుండి రైతులు ఏటా రూ. 90 కోట్లు ఇన్సూరెన్స్ చెల్లిస్తూ మోసపోతున్నారన్నారు. బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయడంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామని, రైతుల విషయంలో ప్రభుత్వం బాధ్యతగానే ఉన్నా బ్యాంకర్ల తీరుతో చెడ్డపేరు వస్తున్నదని అన్నారు. రైతులనుండి వసూలు చేసిన వడ్డీని వారంరోజుల్లో తిరిగి వారి ఖాతాల్లో జమచేయాలని హరీష్ రావు ఆదేశించగానే వసూలు చేసిన మొత్తాన్ని తక్షణమే రైతులకు అందజేస్తామని బ్యాంకర్లు మంత్రులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *