ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23న మల్లన్న సాగర్ జలాశయంలోకి అధికారికంగా నీటివిడుదలను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని మల్లన్నసాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు ఈ జలాశయానికి అనుబంధంగా పంప్‌హౌస్ నిర్మించారు. ఈ పంపుహౌస్ వద్ద సీఎం మీట నొక్కి గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నీటిపారుదల రంగం చరిత్రలోనే సమతల ప్రాంతంలో 50టిఎంసిల నీటినిలువ సామర్థ్యంతో కూ డిన మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించిన కెసిఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే జలాశయపు నిర్మాణ పనులతోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. పంట పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరి కాలువల పనులు చకచకా జరుగుతున్నా యి. అరుబయలు ప్రాంతంలో సుమారు 17వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ జలాశయం నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 7400 కోట్లు ఖర్చు చేసింది. జలాశయం పనులను 2018లో ప్రారంభించి నిర్ణీత గడువుకంటే ఎంతో ముందుగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పనులు పూర్తి చేశారు. 50టిఎంసిల నీటి నిలువ సామర్ధం ఉన్న ఈ జలాశయం భద్రతా ప్రామాణాల దృష్టా తొలి ఏడాది ట్రయల్ రన్‌గా 10.50టిఎంసీల నీటిని నింపారు. రాష్ట్రంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 6.50టిఎంసీల నీటిని జలాశయంలోకి నింపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నాడు శ్రీకా రం చుట్టనున్నారు. దీంతో ఈ జలాశయంలో నీటి నిలువ ఈ సీజన్‌లో 17టిఎంసిలకు చేరుకోనుంది. పంటపొలాలకు సాగునీటి అవసరాలతోపాటు , హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు, నగర శివార్లలోని పారిశ్రామిక అవసరాలను తీర్చేందకు గోదావరి జలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 8,33, 000 ఎకరాల ఆయకట్టుతోపాటు,12నుంచి18 వరకూ ప్యాకేజిల పరిధిలో 2,95,955 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజాంసాగర్, సింగూరు, మనదుర్గ( ఘన్‌పూర్) ప్రాజెక్టుల కింద 11,29,755 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,మేడ్చెల్, జనగాం , నల్లగొండ జిల్లాలకు గోదావరి జలాలు అందనున్నాయి. అత్యంత భారీ ప్రణాళికతో చేపట్టిన మల్లన్న సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటినిలువ సామర్దం 50టిఎంసీలు కాగా, కట్ట నిర్మాణం ప్లస్ 557.000మీటర్ల స్థాయిలో నిర్మించారు. బండ్ లెవెల్ ప్లస్ 562.000మీ. కాగా, మినిమమ్ డ్రా డౌన్ లెవల్ ప్లస్ 532.165 మిటర్లుగా నిర్ణయించారు. రిజర్వాయర్ ఫుల్ లెవెల్ వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం 59.00 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జలాశయం పరివాహక ప్రాంతం 75 చదరపు కిలోమీటర్లు కాగా, రిజర్వాయర్ కట్ట పొడవు 22.60 కిలోమీటర్లు ఉంది. కట్టకు ఒటి స్లూయీస్‌లు ఏర్పాటు చేశారు. ప్యాకేజి 14, 15 వద్ద గ్రావిటి నీటి ప్రవాహానికి 2.525కి.మి వద్ద కాలువను నిర్మించారు. దీని ద్వారా ఒక టిఎంసి నీటిని విడుదల చేయనున్నారు.
ఒటి స్లూయీస్2లో ప్యాకేజి 13, 17 కోసం 2.891కిమి వద్ద సమాంతర కాలువను నిర్మించారు. దీని ద్వారా 0.5 టిఎంసిల నీరు విడుదల కానుంది. ప్యాకేజి 12కోసం 21.35కిలోమీటరు వద్ద ఏర్పాటు చేశారు. దీని నీటి విడుదల సామర్దం 29.218 క్యూబెక్స్ గా ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. దీని ద్వారా 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఒటి స్లూయీస్ 4 తపస్పల్లికి కి.మి 0.75వద్ద నిర్మించారు. దీని ద్వారా 49.745 క్యూమెక్స్ నీరు విడుదల కానుంది. ఒటి స్లూయీస్5ను కి.మి 4.800 వద్ద మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేశారు. రంగనాయక సాగర్ జలాశయం నుంచి విడుదలయ్యే నీటిని ప్రధాన కాలువ నుంచి మల్ల న్న సాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు 8 మె గా పంపులను నిర్మించారు. ఈ పంప్‌హౌస్‌కోసం 47మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించనున్నారు.