తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి మొదటినుండి అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు తరలిస్తామని, ఎస్సారెస్సీ, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరిస్తామని, లెండి ప్రాజెక్టు ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో జిల్లాలో ఏడు చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తున్నామని సీఎం తెలిపారు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుల కోసం తవ్విన కాల్వలను పూర్తిగా వినియోగించుకుంటామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ కాలువలను లింక్ చేయనున్నట్లు సీఎం తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ పథకం కింద జిల్లాకు అదనంగా రెండువేల ఇళ్ళను కేటాయిస్తున్నట్లు, ఈ కాలనీలను జాతీయ రహదారులకు ఇరువైపులా చేపట్టి అన్ని రాష్ట్రాల వారికీ ఈ పథకం గొప్పదనాన్ని చాటిచెప్పాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణంలో అవినీతికి తావివ్వరాదని, అసలైన పేదలను లాటరీ పద్ధతిలో అధికారులు ఎంపిక చేయాలని, మహిళల పేరునే ఇళ్ళను కేటాయించాలని సీఎం పేర్కొన్నారు.
రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించడానికి వీలుగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రజాప్రతినిధులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా మిషన్ కాకతీయ పనులు వేగంగా పూర్తిచేయాలని, ఈ ఏడాది వర్షపాతం సరిగ్గాలేక చెరువుల్లోకి నీరు రాలేదని, అలాంటి చెరువులన్నింటినీ గుర్తించి వాటిలో ముందుగా పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.