రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య(క్రెడాయ్) నేతలు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కీలక పాత్ర పోషిస్తారని, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా సమాఖ్యగా ఏర్పడి ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో మూడు, నాలుగు వేల ఎకరాల్లో ప్రత్యేకంగా నగరాన్ని నిర్మించాలని కోరారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం టీఎస్ఐపాస్ లాంటి చట్టం తేవాల్సిన అవసరం ఉందని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
గ్రీన్ ఫీల్డ్ ఆక్టివిటీ పెంచాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం బిజినెస్ ఎట్ ఈజ్ పద్ధతిలో జరగాలని, ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ కోరారు. భూముల లే అవుట్లకు అనుమతులిచ్చే విషయంలో, నిబంధనలను పాటించే విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. హైదరాబాద్ నగర గమనాన్ని అర్ధం చేసుకుంటూనే ఇతర నగరాలను అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు.