mt_logo

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రల సంచలన వీడియోలు విడుదల చేసిన సీఎం కేసీఆర్

దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. ఈ దేశ పునాదులకే ముప్పు వాటిల్లిందని.. న్యాయ వ్యవస్థే ఈ దేశాన్ని కాపాడాలని చేతులు జోడించి కోరారు. ఈ దేశాన్ని సర్వ నాశనం చేస్తామని చెప్తుంటే.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తామంటే.. ఎవరూ చూస్తూ ఊరుకోవద్దని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరిన్ని సాక్ష్యాధారాలను సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో విడుదలచేశారు. ఈ వ్యవహారాన్ని ఒక సింగిల్‌ కేసులా చూడవద్దని న్యాయ వ్యవస్థను అభ్యర్థించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

చాలా దుఃఖంతోని మొదటిసారి ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నా.. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కన పెద్దలు కేశవరావు ఉన్నారు. దాదాపు 55, 60 సంవత్సరాల అనుభవం ఆయనది. ఆ తరువాతి తరంలో మేము 45-50 సంవత్సరాలనుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందరం పదవులలో ఉన్నాం.. పదవులు లేకుండా కూడా ఉన్నాం. కానీ, ఈ రోజు ఈ దేశంలో నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా జరుగుతున్న ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం ఈ దేశపు పునాదులకు ప్రమాదంగా మారింది. చాలా బాధాకరమైన పరిస్థితి నెలకొన్నది. కనీసం మన ఊహకు కూడా అందదు. ఇట్ల కూడా చేస్తరా? ఇట్ల జరుగుతదా? ఇంత దుర్మార్గం ఉంటదా? ఎవరూ నమ్మలేని పరిస్థితులు. నేను చాలా షాక్‌ అయిన కాబట్టే బాధతో మాట్లాడుతున్నా. 8 ఏండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. ఆకలిరాజ్యంగా దేశం ఎట్లా మారిపోయింది అనే అంశాలు ప్రతిరోజూ చర్చగా మారిపోయాయి. దేశంలో ప్రజలను విభజించే రాజకీయాలు చాలా క్రూరమైన పద్ధతిలో, ఇండియన్‌ సోషల్‌ ఫ్యాబ్రిక్‌నే దెబ్బతీసేలా జరుగుతున్నాయి. ఈ వీడియోలు (ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించి బ్రోకర్ల సంప్రదింపులకు సంబంధించినవి) చూసిన తరువాత నేను బాధకు గురైన. మునుగోడు ఎన్నిక కొనసాగుతున్నందున ముందే చెప్తే.. దాంట్లో లాభం పొందాలని చేసినట్టుగా చిల్లర ఆరోపణలు చేయడానికి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని అరిచే వ్యక్తులు చాలామంది తయారవుతున్నరని ఆగాం. ఈ రోజు పోలింగ్‌ సమాప్తి అయిన తరువాతే దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్‌చేశాను.

ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిపడింది. గతంలో ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ ఆదుకొన్నది. తెలంగాణ పోలీసులు, ఏసీపీ, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేసి నివేదికలు ఇచ్చాయి. ఈ మొత్తాన్ని హైకోర్టులో దాఖలు చేశాము. మీ జర్నలిస్టులందరికీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిగిలిన జడ్జిలు, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులందరికీ ఈ వీడియోలను పంపించాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌తోపాటు, సుప్రీంకోర్టు జడ్జీలు, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులందరికీ వినమ్రపూర్వకంగా నమస్కారం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నా. లేదంటే దేశం పూర్తిగా నాశనం అవుతుంది. ఈ వ్యవహారాన్ని ఒక సింగిల్‌ కేసులా చూడొద్దని నేను న్యాయ వ్యవస్థను అభ్యర్థిస్తున్నా. సుప్రీంకోర్టు సీజేఐ, మిగతా జడ్జీలు, అన్ని హైకోర్టుల సీజేఐలు దీనిపై చర్చించాలి. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. నేరం చేసినవాళ్లను తప్పకుండా శిక్షించండి. అందుకే ఇంతమంది న్యాయమూర్తులు, పత్రికాధిపతులు, ఎలక్ట్రానిక్‌ మీడియా అధినేతలు, కేంద్ర ఎన్నికల సంఘం, అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు ఈ ఆడియోలు, వీడియోలు పంపుతున్నం. ఆరునూరైనా సరే దీన్ని వదిలిపెట్టేదిలేదు. దీన్నిలాగే చూస్తూ ఊరుకుంటే దేశంలో భయంకరమైన పరిస్థితులు వస్తవి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతది. భారత సమాజం ఉనికే ప్రశ్నార్థకం అయితది. ఎవడ్ని ఎవడు చంపుతడో తెలియని పరిస్థితి ఏర్పడతది. ఓపెన్‌గా ఎమ్మెల్యేలను కొంటున్నరు, ప్రభుత్వాలను కూలగొడుతున్నరు. ఇది వీడియోలో స్పష్టంగా చెప్పిన్రు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే దేశం నాశనం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ఇది తీవ్రమైన విషయంగా పరిగణించాలె. ఈ దేశంలో పరిస్థితులు ఇట్లనే కొనసాగితే.. న్యాయవ్యవస్థ ఎటుపోతది? అంతకంటే విలువైన ప్రజాకోర్టు ఎట్ల సహిస్తది? ఈ దౌర్భాగ్య, దుర్మార్గ దుస్థితి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు.

దేశంలో కనీస మౌలిక వసతులు లేవు. తాగడానికి నీళ్లులేవు. కరెంట్‌ ఉండదు. సాగునీళ్లు దొరకవు. నేటికీ అనేక రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. వీటన్నింటినీ పక్కనపెట్టి, వీటి గురించి అసలేం ఆలోచించకుండా.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం.. బలహీనపరచడం.. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం ! ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? 24 మందిమి కలిసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొడుతున్నం అని నిస్సిగ్గుగా చెబుతున్నరు. అందుకే.. వీడియోలు, ఆడియోలను సీబీఐ, ఈడీ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ వంటి విభాగాలకు, పీటీఐ, ఏఎన్‌ఐ వంటి దేశంలోని అన్ని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలకు పంపించాను. దేశం మొత్తం పంపిస్తున్నాను. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా పంపించాను. అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపించినం. ఇంత మందికి ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే… ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వాములైన ప్రతి వ్యక్తి ఈ దురాగతాలను, ఘాతుకాన్ని తెలుసుకోవాలి. ఈ ఘటనలో చాలా మంది దుర్మార్గులు ఉన్నరు. వీళ్లందరూ అనేక నేరాల్లో ప్రమేయమున్నోళ్లు. వీళ్ల సంగతేంటో చూడండని చెప్పినం. మఠాధిపతుల రూపాలు, వేషాలు ఉన్నయట. రాజ్యాంగేతర శక్తులు విశృంఖలంగా స్వైర విహారం చేస్తుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలి? ముఠాలు నిర్భయంగా ఫోన్లలో, ప్రత్యక్షంగా బేరసారాలు ఆడుతున్నరు. వాళ్లు మాట్లాడినవన్నీ వీడియోలో భద్రంగా ఉన్నవి. అవన్నీ చూస్తే ఆశ్చర్యపోతరు. ఈ ముఠాలో 24 మందిమి ఉన్నమని వాళ్లే చెబుతున్నరు. అందరికీ ప్రత్యేక అరేంజ్‌మెంట్లు ఉంటయని అంటున్నరు. ఒక్కొక్కరికి మూడు ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు ఉన్నయట. ఇది చిన్న, సన్న ఫ్రాడ్‌ కాదు. ఆర్గనైజ్డ్‌, అగ్రెసివ్‌ ఫ్రాడ్‌. దీని గురించి దేశమంతా తెలియాలి. చర్చ జరగాలి.

ప్రజాస్వామిక దేశానికి ఇట్లాంటి దుర్మార్గాలు ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ పరిస్థితులు మారాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, యువత, విద్యార్థులది, మేధావులది. ఇందులో ఎవరు మౌనంగా ఉన్నా దేశానికి ప్రమాదం. వీళ్లందరినీ కలుపుకొని ఉద్యమాలకు శ్రీకారం చుడతం. భవిష్యత్తులో జేపీ (జయప్రకాశ్‌ నారాయణ్‌) కాలంనాటి మూమెంట్‌ మళ్లీ తీసుకొస్తం. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో బంగ్లాదేశ్‌ యుద్ధం గెలిచినప్పుడు దేశ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టి అద్భుతమైన విజయాన్ని చేకూరిస్తే.. ఆ రోజుల్లో ఉన్నవారంతా కూడా ‘ఇక ఆమెను ఎవరూ ఏం చేయలేరు. ఆమెకు ప్రత్యామ్నాయం రాదు’ అని అనుకుంటున్న తరుణంలో ఒక చిన్న పొరపాటు చేశారామె. ఎమర్జెన్సీ విధించడం వల్ల ఇందిరాగాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఏ రకమైన శిక్ష విధించారో మనందరం చూసినం. ఇదంతా మన కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఏ విధంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమం వచ్చిందో, విద్యార్థిలోకం, యువలోకం ఏ విధంగా స్పందించి కథానాయకులై ఉద్యమాన్ని నడిపించాయో చూసినం. దాదాపు సంవత్సరన్నర పాటు లక్షలాది మంది నాయకులను జైళ్లలో పెట్టినా ఆ ఉద్యమం ఆగలేదు. మదన్‌మోహన్‌ మాలవీయ, రాంవిలాస్‌ పాశ్వాన్‌, మధు దండావతే వంటి అనేకమంది పెద్దలు జైళ్లలో ఉండి మరీ లక్షల మెజార్టీతో గెలిచారు. ప్రజలు తమ అధికారానికి, ప్రజాస్వామ్యానికి భంగం కలిగితే క్షమించరు. దేశంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ సోయి మరిచి, ఒళ్లు మరిచి ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న అరాచక కాండ, కిరాతకమైన రాజకీయం జుగుప్సాకరంగా, అసహ్యమేసే విధంగా ఉన్నది.

ఈ వీడియోలు చూస్తే ఇంత భయంకరమైన కుట్రనా అని అందరూ ఆశ్చర్యపోతారు. సింహయాజి అనేటాయన ‘అయితే గోడీ.. లేకపోతే ఈడీ’ అని చెప్తున్నడు. గోడీ అంటే సఖ్యత. మోదీతో సఖ్యతగా ఉంటే ఓకే.. లేకపోతే వెంటనే ఈడీ వస్తదని డైరెక్ట్‌గా చెప్పిండు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను ఎట్లా కొన్నరో చెప్పినరు. వాళ్లకు రుమాళ్లు చుట్టి, గడ్డపారలు ఇచ్చి, బుడ్డగోచీలు కట్టి లేబర్‌ వేషాలు వేసి, ఎలహంక దాక ట్రాక్టర్లలో తీస్కపోయిండ్రట. అక్కడ బస్‌ ఎక్కి మద్రాస్‌ పోయిండ్రట. మద్రాస్‌ నుంచి ఇండిగో విమానంలో బొంబాయి పోయిండ్రట. అక్కడే డబ్బులు ఇచ్చినమని చెప్పిన్రు. ఇలా ఆపరేషన్‌ కూడా దాచుకోకుండా క్లియర్‌గా ఈ వీడియోల్లో చెప్పిన్రు. మహారాష్ట్రలో కూడా కూలగొట్టింది మేమే అని నిస్సిగ్గుగా చెప్పిన్రు. ముంబాయి ఆపరేషన్‌ చేసినప్పుడు లోనావాలాలో రిసార్ట్‌ ఇచ్చారని, అక్కడి నుంచే మహారాష్ట్ర ఆపరేషన్‌ చేశానని అన్నరు. నేను ఎయిమ్స్‌లో ఉంటా.. అదే నా కార్యాలయం.. అక్కడి నుంచే ఆపరేట్‌ చేస్తా.. మేము మామూలు ఫ్లైట్లలో తిరగం, చార్టర్డ్‌ ఫ్లైట్లలో తిరుగుతం.. ఎక్కడికైనా నిమిషాల్లో వస్తం అని చెప్పినరు. ఈ క్రమంలో అమిత్‌ షా పేరు కనీసం 20 సార్లు చెప్పిన్రు. రెండుసార్లు మోదీ పేరు చెప్పిన్రు. దీని వెనుక ఏమున్నది? ఈ వేల కోట్ల రూపాయల ధనం ఎక్కడిది? ఎట్ల ఖర్చు పెడుతున్నరు? ఎట్ల కొంటున్నరు?. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెడ్తున్నరని నిన్న ఒక పేపర్‌లో వచ్చింది. ఈ ముఠా నాయకుడు ఎవడు? డబ్బు తెచ్చింది ఎవడు? డబ్బు ఎక్కడున్నది? కచ్చితంగా అవన్నీ బయటికి రావాలె. వాళ్లకు భయం లేదు. సిగ్గు శరం లేదు. ఎవరన్నా విన్నా.. మమ్మల్నేం చేస్తరనే తెగింపు. ఈ దురహంకార, విశృంఖల, అప్రజాస్వామిక, రాజకీయ కిరాతక బరితెగింపును అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.

3/4వ వంతు మెజార్టీతో గెలిచిన ప్రభుత్వాలను ఇద్దరు, ముగ్గురు సభ్యులు కూడ లేని దగ్గర.. ఒక్క ఎమ్మెల్యే లేని కాడ.. ఏకనాథ్‌ షిండేలను పెడతాం అంటే ..ఇదెక్కడి రాజకీయం? ప్రధానమంత్రి మోదీ.. నేను మీ తోటి రాజకీయ నాయకుడిని.. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నవాడిని. మీరు ప్రధానమంత్రిగా అయిన ఏడాదే నేనూ ముఖ్యమంత్రినయ్యా? గత ఎనిమిదేండ్లుగా దేశంతో కలిసి పనిచేస్తున్నా. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నా. ఇటువంటి పనులను ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడండి. మీరు చేస్తున్న చర్యలు సరికావు. ఇది దేశానికి శ్రేయస్కరం కాదు. దేశంలో మీ పేరు కళంకితం అవుతుంది. నేను చెప్పేది వందశాతం నిజం. మీరు దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఇంతకంటే మీకేమి కావాలి? మంచి పనులు చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోండి. మీరు ఈ దుర్మార్గాలు చేసేవారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించండి. ఈ ముఠాలో ఉన్న వారిని జైలుకు పంపండని ప్రార్థిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలనుకోవడం ప్రజాస్వామ్యంలో సరైందికాదు.

ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ.. రాష్ట్రాన్ని ప్రభుత్వాలను కొట్టి.. అందరినీ భయంలోకి నెట్టి ఏమి సాధించాలనుకుంటున్నారు? ఏమి పొందాలనుకుంటున్నారు? భగవంతుడు మీకు జీవితంలో మంచి అవకాశాలు ఇచ్చారు. కానీ మీరు, బీజేపీ చేసేది దేశ హితానికి, మీకు మంచిది కాదు. ఇది నేను చాలా దుఖంతో చెప్తున్న. ఏ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు బతుకుదామని భూమి మీదకు రాడు. ఎంతటి శక్తిమంతులైనా.. 100 ఏండ్లకు మించి బతుకరు. మీ (ప్రధాని) పేరు, హోంమంత్రి పేరు చెప్పి… ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఇలాంటివాటిని ఆపించండి. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు దేశంలోని మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే యువకులు గొంతెత్తాలి. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌నారాయణ్‌ను గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది. గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి నేతలు తాము చేసిన గొప్ప పనులతో దేశానికి గుర్తింపు తెచ్చారు. భారతదేశానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది. కానీ…ఇలాంటి చర్యలతో దేశం ఎటువైపు వెళ్తుంది?

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా నాలుగింటిని పెద్దలు చెప్పారు. ఒకటి శాసన వ్యవస్థ, రెండోది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ, నాలుగోది ప్రెస్‌.. నెహ్రూ కాలం నుంచే ఆ గౌరవాన్నిచ్చారు. కానీ వీరికి (బీజేపీ) ప్రెస్‌ అన్నా.. జ్యుడిషియరీ అన్నా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నా లక్ష్యం లేదు. ఎవరినైనా బెదిరించగలం.. ఏదైనా చేయగలం.. మాకు ఆటంకం లేదు. వాళ్లు (బీజేపీ బ్రోకర్లు) వీడియోలో మాట్లాడిన మాటలు వింటే నివ్వెరపోతం. వాళ్లు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నరు? వాళ్లకు అంత ధైర్యం ఎక్కడిది? ఆ ముఠాలు దేశంలో ఏం చేస్తున్నాయి? దీని వెనుక ఉన్నదెవరు? ఏ బలాన్ని చూసుకొని, ఏ మూకను చూసుకొని వారు మాట్లాడుతున్నారు? ఇలా జరుగుతుందని మనం గతంలో ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ఊహించనైనా లేదు. భారమైన మనసుతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెడుతున్నా. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని జిల్లాలవారీగా లిస్ట్‌ చెప్తున్నారు. ఇది వాంఛనీయమా? ఇదేం ప్రజాస్వామ్యం? దేశంలో అసలు ఏం జరుగుతున్నది? ఏ అహంకారానికి ఇది నిదర్శనం? దీన్ని ఎందుకు సహించాలి? ఇదేమైనా జోకా?

గత నెలలో ఇక్కడికి రామచంద్ర భారతి అనే వ్యక్తి వచ్చి విశ్వప్రయత్నం చేసి మా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. వాళ్లు ఏం ప్లాన్‌ చేస్తున్నారో అర్థమైన తర్వాత.. రోహిత్‌రెడ్డి వచ్చి మాకు చెప్పారు. దీంతో పాటు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రమైన విచారణ జరగాల్సిందేనని నిర్ణయించాం. వారి సంభాషణ మొత్తం మూడు గంటలపాటు ఉన్నది. ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్లు చెప్పిన మాటలు వింటే అంతా ఆశ్చర్యపోతారు. వాళ్లు చెప్పిన పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లవే. వాళ్లు ఏ విధంగా చేస్తున్నారో వివరంగా చెప్పారు. ఇప్పటికే దేశంలో 8 ప్రభుత్వాలను కూల్చినమని చెప్పారు. మరో 4 ప్రభుత్వాలను కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణలో కూల్చేస్తం, ఆ తర్వాత ఢిల్లీలో కూల్చేస్తమని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో బేరాలు పూర్తయినై అన్నారు. ఆ తర్వాత ఏపీలో పడగొడతం.. ఆ తర్వాత టార్గెట్‌ రాజస్థాన్‌.. 21 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినం అని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఎంతమందిని మేనేజ్‌ చేసిన్రు? ఎవరెవరు? ఎక్కడ ఉన్నరు? వంటివన్నీ చెప్పిన్రు. ఇది సులభమైన విషయం కాదు. దీన్ని రాజకీయం అంటారా? ప్రజాస్వామ్యం అంటారా? ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం మనం చూసినం. అక్కడ ఆ పార్టీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠా విధించిన శిక్షను నిశ్శబ్దంగా స్వీకరించారు కాబట్టి.. సులువుగా బయటపడ్డారు. కానీ, తెలంగాణ అట్లాకాదు.. ఇది చైతన్యం గల గడ్డ. మా శాసనసభ్యులు వీరోచితంగా ఆలోచించి దీన్ని బద్దలు కొట్టాలని నిర్ణయం తీసుకొని పార్టీకి, ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాను ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఇదంతా రెండుమూడు రోజులుగా మాత్రమే జరుగుతున్నది కాదు. అనేక రోజులుగా జరుగుతున్నది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్‌ వర్రీ అని కూడా వాళ్లు మా ఎమ్మెల్యేలతో చెప్పారు.

వీళ్ల ఫోన్లను సీజ్‌ చేయగానే పోలీసులు కాల్‌ డాటా తీసినరు. ఒక్క రోజు చరిత్ర కాదు. 2015 నుంచి ఇప్పటిదాకా వీళ్ల చరిత్ర దొరికింది. వీళ్లు ఎవరెవరితో మాట్లాడినరు? దీని వెనుక ఎవరెవరు ఉన్నరు? మొత్తం చరిత్ర వచ్చింది. అదంతా ఇయ్యాల హైకోర్టుకు సమర్పించినం. కోర్టు పబ్లిక్‌ ప్రాపర్టీ. హైకోర్టు అనేది కోర్ట్‌ ఆఫ్‌ డాక్యుమెంట్స్‌. రాజ్యాంగబద్ధమైనది. అంటే.. పబ్లిక్‌ డొమైన్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఆధారాలు ఇప్పుడు పబ్లిక్‌ ప్రాపర్టీ. మేం ఒక్కరం ఏకపక్షంగా చేయకుండా.. లభ్యమైనదాన్ని యథాతథంగా కోర్టుకు సమర్పించినం. వాళ్ల కాల్‌ డాటా, ల్యాప్‌టాప్‌ డాటా.. మొత్తం తీస్తే చాలా పెద్ద డాటా వచ్చింది. అది 70-80 వేల పేజీలు ఉంటది. అందులో చాలా విషయాలు బయటికి వచ్చినయి. ఈ సమాచారం ఎక్కడా ట్యాంపర్‌ కాకుండా, ఎవరూ తారుమారు చేయకుండా, నిజమైన దొంగలు దొరికే వరకు అందరూ పరిశోధించాలె కాబట్టి అందరికీ పంపించిన.

తుషార్‌ అనే కాంట్రాక్టరు కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీ మీద బీజేపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి. తుషార్‌ అభ్యర్థిత్వాన్ని అమిత్‌షానే డిక్లేర్‌ చేసిండు. ఏం దౌర్భాగ్యమిది? ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? ఎక్కడికి పోతున్నది అసలీ దేశం? అందుకే.. భారమైన గుండెలతో నేను చెబుతున్న మాటలివి. దేశం కోసం చావాల్సి వస్తే చస్తం. ఏమైతది? కానీ.. ఈ దేశాన్ని విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తామంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తమంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. జర్నలిస్టులు కూడా సహించరని నాకు తెలుసు. అసలిదేం పద్ధతి? ఈ విధానమే సరైనది కాదు. ఇదే పద్ధతి కొనసాగితే ఈ దేశం ఎక్కడికి పోతది? ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలి. అందుకే అన్నీ కోర్టుకు సమర్పించాం.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో పట్టుబడిన బీజేపీ దూతలు వెల్లడించిన అత్యంత కీలకమైన వ్యక్తి పేరు తుషార్‌ వెల్లపల్లిది. కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆ సందర్భంగా తుషార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అప్పట్లో ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లిని వయనాడ్‌ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు నేనే గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని అమిత్‌షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాకు ముందే సమాచారం వచ్చింది. ‘మీ దగ్గర 36 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కొన్నరట.. మీరు జాగ్రత్త పడండి’ అని మొన్ననే ఢిల్లీ ముఖ్యమంత్రిని అలర్ట్‌ చేసినం. ఢిల్లీలో వెంటనే స్పందించినరు. ఇదసలు ఏం ఘోరం? ఎంతటి దారుణం? అసలీ ఫేక్‌ ఐడెంటిటీ కార్డులు ఏంది? ఈ ధైర్యాన్ని వీళ్లకు ఎవరిచ్చినరు? ఇందులో ఇన్‌వాల్వ్‌ అయిన వేలకోట్లు ఎక్కడివి? ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు ఉన్నంతకాలం మా బీజేపీ ప్రభుత్వానికి ఢోకాలేదని నిర్లజ్జగా మాట్లాడుతున్నరు. ‘ఈ దేశంలో మేం ఏమైనా చేస్తం.. మమ్మల్ని ఎవరేం చేస్తరు’ అన్నట్టు వ్యవహరిస్తనంటే ఎట్ట? దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోతున్నట్టు? ఎటువైపు పోతున్నట్టు??

బెంగాల్‌కు సంబంధించి ‘దీదీ ఆప్‌కే పార్టీకే చాలీస్‌ ఎమ్మెల్యే మేరే టచ్‌మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది టచ్‌లో ఉన్నారని చెప్పంగ విన్నమా? తమిళనాడులో, తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తరంట. స్వయంగా దేశ హోంమంత్రి రాష్ట్రానికి వచ్చి ‘నెల రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’ అని మునుగోడు సభలో ఎలా చెప్తారు ? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తకంఠంతో ఖండించకపోతే, నాకేమిటని వదిలేస్తే మనందరం పోతాం. నేను మంచిగ ఉన్నా కదా అనుకొనే పరిస్థితి లేదు. క్రూరమైన పద్ధతిలో జరిగే దమనకాండను నిలువరించకపోతే, ఎవరి పాత్ర వారు నిర్వహించకపోతే దేశ ఉనికి, గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతది. ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే, మళ్లీ పుంజుకోవడానికి వంద సంవత్సరాలు పడుతది.

బీజేపీ దుర్మార్గాన్ని ఉపేక్షించడం ఏ రకంగానూ దేశ ఉనికికి మంచిది కాదు. బీజేపీ నేతలు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈడీ రాదు. ఇన్‌కంట్యాక్స్‌ రాదు, స్టేట్‌ సెక్యూరిటీ కాదు. సెంట్రల్‌ సెక్యూరిటీ, అది కూడా వై క్యాటగిరీ ఇస్తామని చెప్తున్నారు. రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వమున్నది ! ఈ శక్తులు చేస్తున్న విశృంఖల విహారాన్ని అరికట్టకపోతే అందరికీ ప్రమాదం. తమ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనటానికి ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ ఆమ్‌ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది. మనిషికి రూ.25 కోట్లు ఇచ్చినా దాదాపు రూ.1,100 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు ఎవరిస్తున్నారు? ఎక్కడ ఉన్నదో ఎంక్వయిరీ చేయాలని ఈడీకి ఆప్‌ ఫిర్యాదు చేసింది. ఇంతకూ ఆ డబ్బులు ఎక్కడివి? దీని వెనక ఎంత మంది దొంగల ముఠా ఉన్నది? ఏం జరుగుతున్నది. కాంట్రాక్టులు ఇస్తాం.. వర్స్‌ ఇస్తాం.. ఏం గాకుండా చూస్తం అంటున్నరు. ఇగ మరి ఎన్నికల ప్రక్రియ ఎందుకు? గెలిచినోళ్లకు బొక్క పెడితే అయిపాయె. ఈ వ్యవస్థ ఎందుకు? అంతా వేస్ట్‌.

వేరే పార్టీ వాళ్లను మీరు కలుపుకోలేదా ? అని ఓ కేంద్ర మంత్రి మాట్లాడతరు.. అవును మేం కలుపుకున్నం. కానీ మీలాగ కాదు. 88 సీట్లతోని గెలిచినం. కొద్ది మంది కాంగ్రెస్‌ మిత్రులు నా దగ్గరకు వచ్చి మేం కూడా చేరుతం.. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటం అన్నరు. అయినా వారికి సారీ చెప్పిన. రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు లోబడి, ఆ సంఖ్య మేరకు వస్తేనే మేం కలుపుకొంటమని చెప్పిన. ఆ ప్రకారంగానే వారు 2/3 మెజార్టీతో వచ్చి నాకు లేఖ ఇస్తే దానిని స్పీకర్‌కు పంపి రాజ్యాంగబద్ధంగా కలుపుకొన్నం. అంతేతప్ప మీలాగ దొంగ పని చేయలే. హైదరాబాద్‌ వచ్చి వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మా ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే మేం ఊరుకోవాలా? ఇక భరించం. ఇది విస్ఫోటం. ప్రపంచానికి తెలుపుతాం. దేశవ్యాప్తంగా అందరికీ ఈ వీడియోలను పంపుతం. భారతదేశ ప్రజాక్షేత్రంలో ఇది పడాల్సిందే. దీని కథ ఏందో తెలాల్సిందే.

అధికారంలో ఉన్నవారు ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో బిజీ అయిపోతే దేశంలో ఇతర పనులు ఎవరు చేయాలి. ఇటువంటి సంఘటనలు దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలను నడవకుండా చేస్తున్నారు. వారి దృష్టంతా అభివృద్ధిపై కాకుండా రాజకీయాలవైపు వెళ్తున్నది. దీని ఫలితం ఏమవుతుంది? ఇప్పటికే దేశం ఎన్నో సమస్యల్లో ఉన్నది. దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నది. దేశ న్యాయవ్యవస్థకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా.. నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల కమిషన్‌ గుర్తు కేటాయించేందుకు నిరాకరించినప్పుడు నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాతోపాటు దేశంలోని అన్ని పార్టీలకూ కామన్‌ సింబల్‌ కేటాయించేలా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్రలు పన్నేవారిని న్యాయవ్యవస్థ నియంత్రిస్తుందని నేడు కూడా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇది చాలా బాధతో చెబుతున్నా.. ఒకవేళ ప్రాణ త్యాగం చేయాల్సివచ్చినా నాకేం ఫరవాలేదు. ఎక్కడికైనా వెళ్తాం. ఒకవేళ ప్రాణాలు అర్పించాల్సివస్తే అర్పిస్తాం. కానీ, మౌనంగా మాత్రం ఉండే ప్రసక్తే లేదు. త్వరలోనే ప్రజాజీవితంలో ఉన్నవారితో మాట్లాడి ఒక ఉద్యమం లేవదీస్తాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవారంతా ఈ ఉద్యమంలో పాల్గొని తమపాత్ర పోషించాలని, దేశాన్ని కాపాడాలని కోరుతున్నా.

మునుగోడులో జరిగిన ఎన్నికలు మీరు చూశారు. సిగ్గుపడే పరిస్థితి. అరచేతులల్ల పువ్వు గుర్తులు దించుడు.. ఎప్పుడన్న చూసినమా ఇది? ఎన్ని అబద్ధాల ప్రచారాలు! కాంగ్రెస్‌ అభ్యర్థి.. గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతి అనే అమ్మాయి నా దగ్గరికి వచ్చి కలిసినట్టు ప్రచారం చేయడం ఎంత అన్యాయం ? ఎన్నికలు వస్తయి, పోతయి.. చాలా గెలుస్తం.. చాలా ఓడుతం.. ప్రజల తీర్పును హుందాగా గౌరవించాలి. మేం చెప్పిందే వేదం.. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంటది? దేశంలో ఎన్నికల కమిషన్‌ ఫెయిలయిందని, ఇక్కడున్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఫెయిలయిండంటూ దిక్కుమాలిన ఆరోపణ చేస్తున్నరు. ఈసీ కూడా వాళ్లు కోరుకున్న పద్ధతుల్లో పనిచేసి.. గెలిపిస్తెనేమో ఈసీ బాగా పనిచేసినట్టు.. లేకుంటే ఫెయిలైనట్టా? ఈసీని నియమించింది ఎవరు? కేంద్రంలో వాళ్ల పార్టే అధికారంలో ఉన్నది. సీఈసీ.. ఇక్కడి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌పైన గరమైంది. ఇంత దిగజారడం ఎన్నడైనా చూసినమా? ఉద్యమ సందర్భంలో మేము ఇంత హేయంగా ఎన్నడూ ప్రవర్తించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *