mt_logo

మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు- సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ఐపాస్ రెండవ దశలో మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో స్వయంగా అనుమతి పత్రాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి మరో రూ.1087.37 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా సుమారు 5,321 మందికి ఉపాధి లభించనుంది. అనుమతి పత్రాలు పొందిన కంపెనీల్లో స్పెయిన్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ కెమో ఉండటం విశేషం! ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని, పారిశ్రామిక అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్ ఇన్చార్జి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శాంతకుమారిని సంప్రదిస్తే పరిష్కరిస్తారని చెప్పారు.

రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నెలకొల్పనున్న ఈ కంపెనీల్లో సెల్ ఫోన్, పాదరక్షల కంపెనీలతో పాటు హెలికాప్టర్ క్యాబిన్ కిట్, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీలు ఉన్నాయి. టీఎస్ఐపాస్ రూపకల్పన జరిగిన తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తొలిదశలో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో 17 కంపెనీలకు జూన్ 23న అనుమతి పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో నెల తిరక్కుండానే మరో 19 కంపెనీలకు అనుమతులు లభించడం చూస్తే పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *