mt_logo

తెలంగాణను కించపరిస్తే సహించేది లేదు!!

హైదరాబాద్ వారికి పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు.. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే నిద్రలేపడం నేర్పారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని కించపరిచే వారెంతటి వారైనా సహించేది లేదు.. మీరు ఒక్కటంటే మేం పదంటాం.. ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేనా పడ్తా(ఇటుకకు రాయితో సమాధానం చెప్పాల్సి ఉంటుంది) అని హెచ్చరించారు. తనను అంటే పడతాను కానీ, తెలంగాణను కించపరిస్తే ఎవరినీ వదిలేది లేదని, తెలంగాణ జోలికి రావద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కవి, రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు 91వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దాశరథి స్ఫూర్తి తెలంగాణలో ప్రతి ఒక్కరిలో దాక్కొని ఉందని, తెలంగాణ సంస్కృతిని, గొప్పదనాన్ని చెప్పడంలో ఆయన పాత్ర అమోఘమని ప్రశంసించారు.

దాశరథి కనుక ఇప్పుడు బతికుంటే తెలంగాణకు జరుగుతున్న కుట్రలపై మరో అగ్నిధార కురిపించేవారన్నారు. నా తల్లి తెలంగాణ కంజాతవల్లి.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరధి గారు గొప్పగా చెప్పారు. దాశరథి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యకు ముఖ్యమంత్రి అందజేశారు. దాశరథి మంచివారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ముందు ఒక్క కోటి ఉన్నాం. ఇప్పుడు మూడుకోట్లు అయ్యాం.. అని మురిసిపోయారు. అంతేకాకుండా మూడు కోట్లు ఒక్కటై ముడి బిగించే అని రాశారు. కానీ తర్వాత ఇంతటి అన్యాయం జరుగుతుందని ఆయనకు తెలీదు పాపం. ఆయన సమకాలీనుడు, వరంగల్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి గారని ఒక కమ్యూనిస్టు ఉన్నారు.. బిడ్డా ఇది అంతా మేం చేసిన పాపమే.. తెలుగు వారంతా ఒక్కటైతే మంచి జరుగుతుందనుకున్నాం. అదే వ్యామోహంలో పడి కొట్టుకుపోయాం. కానీ ఇంత దగా అవుతుందనుకోలేదు అని బాధపడ్డారని కేసీఆర్ గుర్తుచేశారు.

తెలంగాణ ఒక రకమైన చక్రబంధం నుండి బయటపడి స్వేఛ్చావాయువులు పీల్చుకుంటూ ముందుకెళ్తుంది. తన బతుకు తాను బతుకుతుంది. కానీ ఇప్పటికీ ఆంధ్రా ప్రాంతీయులు అక్కడి సీఎంతో సహా పిచ్చిపిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సాహితీవేత్తలు, విజ్ఞులు దీనిపై స్పందించి ఖండించాలని కేసీఆర్ కోరారు. హైదరాబాద్ ఒక చారిత్రక నగరం. అదృష్టవశాత్తు అది తెలంగాణకు రాజధాని నగరం అయ్యింది. అది మన పెద్దలు చేసుకున్న పుణ్యం.. తరతరాల కృషి.. మన వారు చిందించిన స్వేదం, రంగరించిన రక్తం ఫలితమే మన హైదరాబాద్. ఇది మహానగరం. దీని పరిధి 7,200 చదరపు కిలోమీటర్లు. 18.30 లక్షల ఎకరాల్లో విస్తరించింది. అందులో రిజర్వ్ ఫారెస్ట్ లక్షా 50వేల ఎకరాలు. ఎక్కడి అమరావతి? ఎక్కడి హైదరాబాద్. దానితో పోల్చి హైదరాబాద్ ను తక్కువ చేయడం ఎంతవరకు సమంజసం? రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. ఎవరి బతుకులు వారు బతకాలి. ఇదే సలహా నేను ఏపీ సీఎంకు చెప్తున్నా. ఇక ఇటువంటి భ్రమలు వీడండి. అమరావతి బ్రహ్మాండంగా కట్టుకుని అక్కడి ప్రజలకు సేవలందించండని చెప్పారు.

దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ ప్రొఫెసర్ తిరుమల శ్రీనివాసాచార్య తాను రచించిన బంగారు తెలంగాణ కావ్యాన్ని ముఖ్యమంత్రికి సంప్రదాయ పద్ధతిలో అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సాధించిన రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమశిక్షణ, భక్తిభావం గల వ్యక్తి అని, ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదని, పట్టువదలకుండా తెలంగాణను సాధించిన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *