తెలంగాణ సర్కారును గొంతునులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా! బాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. బాబుకు రేవంత్‌రెడ్డి బలి. ఏమంత రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి ఎగిరెగిరిపడి ఎల్లెల్కల పడ్డడు. ఆంధ్రా నోట్ల కట్టలను రేవంత్ నెత్తిన పెట్టి భస్మాసుర అస్త్రంలా ప్రయోగించాడు ఆంధ్రాబాబు. ఇందులో అడ్డంగా దొరికి జైలుపాలయ్యాడు పాపం రేవంత్. ఈ విధంగా బాబు ఉచ్చులో మరొకరు బలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి కీ.శే. నందమూరి తారకరామారావు గారిచ్చిన బిరుదులు: నేను స్థాపించిన పార్టీలో అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేకవన్నె పులులు తలెత్తుతాయని ముందుగా తెలుసుకోలేకపోయాను. నేను దేవుడినని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టల్లో తేళ్ళలాగ, పొదల్లో నక్కలాగ కుట్రలు కుతంత్రాలు అల్లారు. ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపుతామంటున్నారు. చేతులు జోడించి, నమస్కరించి తుపాకి పేల్చి గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.. 1995 ఆగస్టులో సాక్షాత్తు ఎన్టీఆర్ అన్న మాటలివి.
పిల్లనిచ్చి, పదవులిచ్చి పార్టీ కీలక బాధ్యతలిచ్చిన ఎన్టీఆర్.. చంద్రబాబును ఉద్దేశించి అన్న మాటలవి. తన రక్తం పంచుక పుట్టిన వారినే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసేలా ఉసిగొల్పే నైపుణ్యం చంద్రబాబుది. తాను కష్టపడి ఇష్టంతో నిర్మించుకున్న రాజకీయ సౌధాన్ని లాక్కున్నాడు అల్లుడు బాబు. ఎన్టీఆర్ ఊరూరు తిరిగి గెలిపించిన వారితోనే వైస్రాయ్ హోటల్ ముందుకుపోయిన ఆయనపై చెప్పులు విసిరేలా ఉసిగొల్పిన ఘనుడు చంద్రబాబు. ఈ చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దెదించి, అవమానించి, మానసికంగా చిత్రవధ చేసినందుకు వగిచి, విలపించి, గుండెపగిలి ఐదు నెలలు తిరగకముందే ఎన్టీఆర్ కన్నుమూశారు.
ఇది చంద్రబాబు చేసిన మొట్టమొదటి బలి. బాబు వల్ల ప్రథమ బలి. ఈ విధంగా బాబుకా బలి(బాబు వల్ల బలి) లిస్టు తీస్తే చాంతాడంత అవుతుంది. 1995లో ఎన్టీఆర్ మొదలు నిన్నటి రేవంత్‌రెడ్డి వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాబు కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, జిత్తులకు బలైన వారు ఎందరో! చంద్రబాబుకు బంధువులు, మిత్రులు, విశ్వాసపాత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఉపయోగపడేవారు, ఉపయోగం లేనివారు రెండే బంధుత్వాలు. ఎప్పటికప్పుడు విధానాలు సంబంధాలు మారిపోతుంటాయి. యూజ్ అండ్ త్రో పాలసీ. నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి వేంకటేశ్వర్‌రావు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు బాబు బాధితులే! బాబు వల్ల బలైన బలి పశువులే.
1995కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పద్ధతి విలువలకు విలువవుండేది. 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ద్వారా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వల్ల మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టినయ్. ప్రభుత్వ యంత్రాంగం పతనమయ్యింది. ఉద్యోగులపై ప్రజలను ఉసిగొల్పి వారిని బలిపశువులను చేసి తాను తప్పించుకున్నాడు. ఉద్యోగులంటే అభివృద్ధి నిరోధకులు అనే అభిప్రాయాన్ని సమాజానికి కలిగించే ప్రయత్నం బాబు అడుగడుగునా చేశాడు. ఎన్నికలంటే ఓ జూదంలా మార్చాడు. కల్లు, సారా, మనీ, మాఫియాలే ఎన్నికలు అనే ఓ నిర్వచనాన్ని స్థిరపరిచాడు. మీడియా మేనేజ్‌మెంట్ పేరుతో జర్నలిస్టులను చీల్చి తనకు అనుకూల భజనపరులను తయారుచేసుకున్నాడు. అబద్ధాలను వండివార్చి పత్రికల పతాక శీర్షికలో తన డబ్బా కొట్టుకునే సంస్కృతి ఈయన గారి నుంచే ప్రారంభమైంది. బ్యూరోక్రసీని, న్యాయవ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను అన్నిటిని బలి తీసుకున్నాడు బలిబాబు. ఈ విధంగా బాబుతో వ్యవస్థ అవస్థలపాలైంది.
ఒక పచ్చి అబద్ధాన్ని పుట్టించి, పత్రికలలో పతాక శీర్షికలో పెట్టించి పెంపుడు కుక్కలను ఎగదోసి, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే గోబెల్స్ శిష్యుడు అబద్ధాల బాబు. పాలమూరు అంబేద్కర్‌గా పిలువబడిన దళిత నేత పుట్టపాగ మహేంద్రనాథ్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు. నెంబర్-2గా స్థానం పొంది ఆర్థిక, రెవెన్యూ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌తో అంత సాన్నిహిత్యం, కీలక స్థానం ఓ దళిత నాయకుడు మహేంద్ర పొందటం ఓర్వలేని బాబు కుట్రలకు తెరతీశాడు. 1994లో ఎన్టీఆర్ అచ్చంపేట నియోజకవర్గం నుంచి మహేంద్రకు టికెట్‌కు ఖరారు చేశారు.
మహేంద్రనాథ్ మళ్లీ గెలవడం ఖాయం. ఎన్టీఆర్‌కు నెంబర్2 గా ఉండటం ఖాయమని గ్రహించిన నక్కజిత్తుల బాబు తన పెంపుడు కుక్కలకు కుట్ర పథకాన్ని అమలు చేసే బాధ్యతను ఇచ్చాడు. అచ్చంపేట పార్టీ మీటింగ్‌కు వెళ్లిన మహేంద్రనాథ్‌డౌన్ డౌన్, గోబ్యాక్ మహేంద్రనాథ్ అని తన పెంపుడు కుక్కలతో మొరిగించాడు. సున్నిత మనస్కుడైన మహేంద్రనాథ్ మీటింగ్ మధ్య నుంచి అవమానం భరించలేక వెళ్లిపోయారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఎన్టీఆర్‌కు తెలిపారు. ఎన్టీఆర్ వారించినా వినలేదు. ఇక ఆ తరువాత ఆ అవమానాన్ని ఆవేదనతో తన సన్నిహితులతో పదేపదే చెప్పుకొని మానసిక వేదనకు గురై మంచానికే పరిమితమై మరణించారు.
రాజకీయ కుట్రలకు, పరోక్ష హత్యకు బలయ్యారు. 1995లో కుట్రతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలమూరు జిల్లాను కుట్రపూర్వకంగానే దత్తత తీసుకున్నారు. పాలమూరు జిల్లా వెన్ను విరిచి ప్రపంచబ్యాంకు ముందు అవిటి అనాథ జిల్లాగా చూపించి, వేల కోట్లు తెచ్చి, ఆంధ్రాకు పెట్టుకుని, దత్తత జిల్లాను 2004వరకు దగా చేశాడు. ఆ విధంగా ఏకంగా లక్షలాది మంది జిల్లా ప్రజలనే బలితీసుకున్నాడు బలి బాబు. వందలాది మంది తెలంగాణ బిడ్డలు బాబు కుట్రలకు బలి అయ్యారు.
2009లో కేసీఆర్ పాలమూరు పార్లమెంటు సభ్యులు. తెలంగాణే ఏకైక జెండా పట్టుకున్న కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం అమీతుమీకి సిద్ధపడ్డారు. తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదాలతో 2009 నవంబర్ 29న బలిపీఠం ఎక్కారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తొమ్మిది రోజుల పాటు ఉడుంపట్టుతో కొనసాగించారు. కేసీఆర్ పట్టుదలతో ఆంధ్రా లీడర్లు బెంబేలెత్తారు. మనసులో తిట్టుకుంటూనే తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని డిసెంబర్ 7,8 తేదీల్లో అసెంబ్లీలో ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రకటించాడు జిత్తుల బాబు.
తెలంగాణ కాలం కడుపుతో ఉండి, కేసీఆర్‌ను కన్నదన్నట్లుగా సావునోట్లో తలపెట్టిన కేసీఆర్ ఎన్ని తీర్మానాలు చేసినా దీక్ష విరమించలేదు. ఆయన దీక్షకు మద్దతుగా లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా శ్రీకాంతాచారి మంటలో కాలిండు. మాంసపు ముద్దలు రాలిపడుతున్నా అమ్మా అనే బదులు జై తెలంగాణ అన్నాడు. 11 రోజులకు ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేసింది. ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే చంద్రబాబు కుట్రలకు తెరలేపిండు.
ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చిన బాబు అర్ధరాత్రి అట్లెట్లా ఇస్తారు తెలంగాణ అని మీడియా ముందుకు వచ్చిండు. ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు కొట్టి రెచ్చగొట్టిండు. కృత్రిమ ఉద్యమానికి తెరలేపిండు. డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసింది. వచ్చిన తెలంగాణ వెనక్కి పోయింది. దీంతో నిరాశతో ఉద్వేగంతో తట్టుకోలేని విద్యార్థి యువతీ యువకుల ప్రాణత్యాగాలకు, బలిదానాలకు తెరలేపిండు. వచ్చిన తెలంగాణ ప్రకటనను కృత్రిమ ఉద్యమంతో అడ్డుకున్నది చంద్రబాబే. ఆ కుట్రల వల్ల వందలాది మంది యువతీ యువకులను బలితీసుకున్నది చంద్రబాబు కుటిలనీతి.
బాబు కుట్రలు సాగుతూనే ఉన్నాయి. కేంద్రం కమిటీ పేరుతో కాలయాపన చేస్తుంది. తెలంగాణ ప్రజలు అసహనం, ఆవేశంతో ఊగిపోతారు. ప్రజల ఆవేశం, ఆకాంక్ష ప్రతిఫలించాలంటే ఒక వేదిక, సందర్భం కావాలి. ఉద్యమ వ్యూహకర్త అయిన కేసీఆర్ తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామా ఆయుధంగా కేంద్రంపై ఎక్కుపెట్టిండు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు తోకముడిచి వీపు చూపారు. 12 మంది టీఆర్‌ఎస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఉద్యమంలో ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తేటతెల్లమైంది. రాజీనామాలతో భయపడి వీపుచూపిన తెలంగాణ టీడీపీ వారిని ఈ స్థానాల్లో బాబు పోటీకి దింపాడు. దీనికి తెలంగాణ టీడీపీ వారు వారించినా వినలేదు. 12 చోట్ల టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అట్లా తెలంగాణ టీడీపీని బలితీసుకున్నాడు బాబు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ్యులను సంతలో సరుకులను కొన్నట్లుగా కొని ఏడాది పసిగుడ్డు తెలంగాణ సర్కారును గొంతు నులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా! బాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు.
బాబుకు రేవంత్‌రెడ్డి బలి. ఏమంత రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి ఎగిరెగిరిపడి ఎల్లెల్కల పడ్డడు. ఆంధ్రా నోట్ల కట్టలను రేవంత్ నెత్తిన పెట్టి భస్మాసుర అస్త్రంలా ప్రయోగించాడు ఆంధ్రాబాబు. ఇందులో అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు పాపం రేవంత్. ఈ విధంగా బాబు ఉచ్చులో మరొకరు బలి. బాబుకు బలైన వారి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఓ గ్రంథమైతది. అలాగే ఇటీవల రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 27 మంది బలయ్యారు. అందుకే తెలంగాణ టీడీపీ నాయకుల్లారా మీరు మేల్కోకపోతే మీరు ఆంధ్రాబాబు వల్ల బలి కావడం ఖాయం.
– ఎ.పి. జితేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు
– బెక్కెం జనార్దన్, న్యాయవాది
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..