mt_logo

సివిల్ సర్వీసెస్ క్యాడర్ కు సవరణలు పార్లమెంటులో చేసే దమ్ముందా : ప్రధానిపై సీఎం కేసీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలిండియా సర్వీసెస్ నిబంధనల సవరణ పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణను దొడ్డిదారిన కాకుండా, ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించా లన్నారు. ఈ మేరకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణలు రాష్ట్రాల హక్కులనుహరించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇష్టం లేకున్నా ఐఎఎస్‌లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా కేడర్ రూల్స్ మార్చాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలు ఏ మాత్రం సమంజసం కాదన్నారు.ఈ సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇవి ఐఎఎస్, ఐపిఎస్,ఐఎఫ్‌ఎస్‌ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నదన్నారు.

రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండానే బదిలీపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం హేతుబద్దంగా లేదన్నారు. ఇది రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది రాజ్యాంగ స్వరూపానికి,సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. పైగా కేంద్రం ప్రతిపాదించిన సవరణల ద్వారా రాష్ట్రాలకు గుర్తింపు లేకుండా పోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలుచేసే ఎత్తుగడ అని ఆరోపించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిందని, వాటిని తాను అంగీకరిస్తున్నానని సీఎం తెలిపారు. కాని రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఎఐఎస్ క్యాడర్ రూల్స్‌కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మోడీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది ఐఏఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదని, ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరోటి కాదన్నారు. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలన్నారు. ఈ నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలని ఈ సందర్భంగా తాను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *