నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రగాయాల పాలైన ఎస్సై సిద్ధయ్యను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రి వైద్యుల బృందం సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలను సీఎంకు తెలిపారు. ఎస్సై శరీరంలోకి దూసుకుపోయిన నాలుగు బుల్లెట్లలో రెండింటిని తొలగించామని, మరో రెండు బుల్లెట్లు ఇంకా శరీరంలోనే ఉన్నాయని, తాము అందిస్తున్న వైద్యానికి ఆయన ఏమాత్రం స్పందించినా మిగతా రెండు బుల్లెట్లను తొలగించే విషయం పరిశీలిస్తామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వారు సీఎంకు వివరించారు.
అనంతరం ఆస్పత్రి బయట ఉన్న ఎస్సై కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. ఎంత ఖర్చయినా సిద్ధయ్యను బతికించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే విదేశీ వైద్యులను ఇక్కడికి పిలిపిస్తామని, లేదంటే సిద్ధయ్యనే అక్కడికి తరలించేందుకైనా వెనుకాడబోమని, అధైర్యపడొద్దని సీఎం ధైర్యం చెప్పారని సిద్ధయ్య సోదరుడు దస్తగిరి తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ఆస్పత్రికి వచ్చినవారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్ చంద్, ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.