ఎస్టీ, మైనార్టీల సామాజిక, ఆర్ధిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఎస్టీల పరిస్థితులు అధ్యయనం చేసే కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ చెల్లప్పను, ముస్లిం మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ జీ సుధీర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద ఈ రెండు కమిషన్లను ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీ, మైనార్టీలకు 12% చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే ప్రస్తుతం ఈ రెండు కమిషన్లను నియమించారు. ఎస్టీ, మైనార్టీల సామాజిక జీవన స్థితిగతులపై విస్తృత అధ్యయనం జరిపి రిజర్వేషన్లను కల్పించే అంశంతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి అందించే విషయంలో సిఫారసులు చేయనున్నాయి. నివేదికను ఇవ్వడానికి కమిషన్ కు మంగళవారం నుండి ఆరు నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.