తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటే వినిపించొద్దని, వచ్చే మూడేళ్ళలో రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించి తీరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి సంస్థ ఏర్పాటు చేయబోయే 600 మెగావాట్ల మూడవ ప్లాంట్ రెండవ దశకు చెందిన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పవర్ ప్లాంట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, తక్షణమే భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరత ఎదుర్కోకుండా అందరూ దీక్షతో పనిచేయాలని, ఇప్పటికే అభివృద్దిపథంలో ఉన్న 1200 మెగావాట్ల ప్లాంట్ పనులు ఈ సంవత్సరం నవంబర్ 15 కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా 1200 మెగావాట్ల కోసం నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కు సంబంధించి నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా సూచించారు. ప్లాంట్ కు సంబంధించి రైల్వే ట్రాక్, వాటర్ పైప్ లైన్ పనులకు సంబంధించి భూ సేకరణను రైతులు అడ్డుకుంటున్నారని సింగరేణి సీఎండీ శ్రీధర్ సీఎం దృష్టికి తేగా, దీనిపై స్పందించిన కేసీఆర్, జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆర్డీవోలతో భూసేకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.