స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. స్పెయిన్‌కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థ డైరెక్టర్ జీన్ దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక యూనిట్ ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్న కీమో ఫార్మా.. త్వరలో మరో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 2018లో జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీ క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ విభాగాల్లో కార్యకలాపాలను ప్రారంభించిందని, రెండో యూనిట్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నదని వివరించారు.

