mt_logo

తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న లూలు గ్రూప్

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. తెలంగాణ నుంచి యూరప్‌ సహా వివిధ విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు త్వరలో తమ యూనిట్‌ను ప్రారంభిస్తామని, దీనిపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. దీంతో ఇందుకు అవసరమైన అనుమతి పత్రాలను మంత్రి కేటీఆర్‌ ఆయనకు అందజేశారు. తెలంగాణలో కేవలం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనే కాకుండా భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా లూలు గ్రూపు మరిన్ని పెట్టుబడులను పెట్టనున్నట్టు యూసుఫ్‌ అలీ తెలిపారు. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాపర్టీల యజమానులతో మాట్లాడుతున్నామని వివరించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్‌ మాల్‌ను నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్‌ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో లూలు గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండటం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ను మరింత పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో 500 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లులూకి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *