mt_logo

లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

రానున్న రోజుల్లో లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా మరింత అభివృద్ధి చెందాలంటే నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో మందుల ఆవిష్కరణ డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరి వైపు సాగుతున్నదని, ఐటీ, ఫార్మా రం గాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ‘తెలంగాణ- ఆర్‌అండ్‌డీ, ఇన్నోవేషన్‌ హాట్‌స్పాట్‌ ఆఫ్‌ ఏషియా’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన బృంద చర్చలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం లైఫ్‌ సైన్సెస్‌లో హైదరాబాద్‌ ఇతర నగరాలకంటే ముందున్నదని తెలిపారు. ప్రఖ్యాత నోవార్టిస్‌ సంస్థ తమ అతిపెద్ద రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించిందని గుర్తు చేశారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పారు. ఈ రంగానికి ఉతమిచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారత్‌లో ఆశించినంత మద్దతు లేదని భావిస్తున్నట్టు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌ ఫార్మా సిటీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో ఆర్‌అండ్‌డీ రంగం అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సులభతరమైన విధానాలను ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని సూచించారు. దేశంలో నైపుణ్యానికి కొదవలేదని, ప్రభుత్వాలు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఈ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టడంతోపాటు హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నదని వివరించారు. ఈ చర్చలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన అథర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *