mt_logo

వీడని ఆంధ్రా గ్రహణం!!

– తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 12 లేఖలు.. వంద కొర్రీలు
– ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా పత్రికల అడ్డగోలు కూతలు.. రాతలు
– పాత ప్రాజెక్టులకు కొత్త సున్నాలు

ఆంధ్రపార్టీలు, ఆంధ్రమీడియా తెలంగాణను ప్రశాంతంగా నిద్రపోనివ్వాలనుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తమ సామ్రాజ్యం కుప్పకూలినట్టు, కిరీటం పడిపోయినట్టు అవి భావిస్తున్నాయి. ఇవాళ సీమాంధ్ర మీడియా ప్రచురణలు, ప్రసారాల్లో సీమాంధ్ర కనిపించదు. అక్కడి ప్రజల కష్టాలు కనిపించవు. కానీ తెలంగాణ మీద చల్లుతున్న విషం పేజీ పేజీనా కనిపిస్తుంది. సీమాంధ్ర పాలకులు తమ రాష్ట్ర పాలన పట్టించుకోరు. తెలంగాణను ఎలా దెబ్బ కొట్టాలా? అని ఎత్తులు వేస్తుంటారు. తమ బానిసలను, మీడియాను ఉసిగొల్పుతుంటారు. తాజాగా సీమాంధ్ర పార్టీలు, మీడియా తెలంగాణ ప్రాజెక్టులకు లక్ష్యంగా చేసుకున్నాయి.

ప్రధానంగా తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే పాలమూరు, డిండి ప్రాజెక్టుల మీద విషం చిమ్ముతున్నాయి. ఆరు దశాబ్దాలపాటు ఈ గడ్డను నిలువునా ఎండబెట్టి, నీళ్లన్నీ మళ్లించుకున్న పాలకులు, ఇపుడు తెలంగాణ తన వాటా తాను వాడుకునేందుకు సిద్ధమైతే భరించలేకపోతున్నారు. సీమాంధ్ర మీడియాకైతే నిద్రే పట్టడం లేదు. పోతిరెడ్డిపాడు కాలువను నదీమార్గంగా మార్చేసినపుడు, బేసిన్‌లో లేని ప్రాంతాలకు నదులకు నదులనే మళ్లించినపుడు నోరు విప్పని మీడియా.. ఇవాళ తెలంగాణ తన హక్కుగా నీరు వాడుకుంటే గగ్గోలు పెడుతున్నది. రోజుకో రకమైన కథనాలతో ప్రజలను, బుద్ధి జీవులను గందరగోళపరుస్తున్నది. సీమాంధ్ర ప్రభువుల కొలువులో రూపొందే కుట్రలు మరునాడు పత్రికల్లో పతాక శీర్షికల రూపమెత్తుతున్నాయి. సీమాంధ్రలో పట్టిసీమ చేపట్టిననాడు నవరంధ్రాలు గట్టిగా మూసుకున్న మీడియా ఇవాళ పాలమూరు, డిండి రెండు కొత్త ప్రాజెక్టులేనని రుజువు చేయడానికి పడరాని పాట్లు పడుతున్నది.

అక్షరాలా అబద్ధాలు: ఉమ్మడి రాష్ట్రంలో అయ్యోపాపం.. అని ప్రతినోటా అనిపించుకున్న జిల్లాలు పాలమూరు, నల్లగొండ.. వలసలతో ఒక జిల్లా ఎడారిగా మారితే, మహమ్మారి ఫ్లోరైడ్‌తో మరో జిల్లా తల్లడిల్లింది. తెలంగాణ దుఃఖానికి ప్రతిరూపమైన ఆ జిల్లాలకు ఆరు పదుల సమైక్య పాలనలో క్రూరపరిహాసాలే మిగిలాయి. ప్రత్యేక రాష్ట్రంలో వాటికి ఆపన్నహస్తం అందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇది సీమాంధ్ర పాలకులకు కన్నెర్రగా మారింది. నదులకు నదులనే అయ్య జాగీరులాగా మళ్లించుకున్న నాయకులకు ఇవి అక్రమ ప్రాజెక్టులుగా కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులుగా సాక్షాత్కరిస్తున్నాయి. రెండు కండ్లు, కొబ్బరి చిప్పలు అంటూ కబుర్లు చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టులను నిలువరించాలని గల్లీనుంచి ఢిల్లీదాకా ఫిర్యాదులు చేస్తున్నారు. నిజానిజాలతో, న్యాయాన్యాయాలతో నిమిత్తం లేకుండా ఆంధ్రా పత్రికలు గోల చేస్తున్నాయి.

దొంగ నిద్రలకు మందులేదు: నిద్రపోయేవారిని లేపొచ్చు.. కానీ నిద్ర నటించేవారిని లేపలేం! సరిగ్గా పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతున్న రోజు.. ఆ జిల్లా ప్రజలు మహోత్సవాల్లో మునిగి తేలుతున్న రోజే.. ఏపీ మంత్రి దేవినేని పనిగట్టుకుని పత్రికాసమావేశం పెట్టి ఇవి అక్రమ ప్రాజెక్టులని ప్రకటించారంటేనే ఏపీ పాలకులకు తెలంగాణ మీద ఉన్న కుట్ర స్వభావాన్ని అర్థంచేసుకోవచ్చు. కనీసం ప్రాజెక్టు వస్తుందన్న సంతోషాన్ని సైతం తెలంగాణ ప్రజలకు దక్కనివ్వరాదనేదే వారి లక్ష్యం. వాస్తవం ఏమిటంటే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదన దశనుంచి ప్రారంభం దాకా అనేక ప్రక్రియలుంటాయి. ఒకసారి జీవో వచ్చిందీ అంటే.. ఏ దశలో ఉన్నా అది అనుమతించినట్టే లెక్క. అవసరాలు, డిమాండ్లు, వనరులను బట్టి వాటి రూపురేఖలు మారుతాయే తప్ప అది కొత్త ప్రాజెక్టు కాబోదు. జలసంఘం అనుమతో, పర్యావరణ అనుమతో, మరొకటో మాత్రమే ప్రాతిపదిక అంటే ఇవాళ రెండు రాష్ట్రాల్లో పోలవరం సహా 80% ప్రాజెక్టులకు అనుమతులు లేనట్టే లెక్క. మరి వాటన్నింటినీ ఆపేస్తారా? కట్టిన ప్రాజెక్టులు కూల్చేస్తారా?

జీవోలు వచ్చాక కూడా కొత్త ప్రాజెక్టులా?
ఎవరేం చెప్పినా ఎన్ని సాముగరిడీలు చేసినా.. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 2007లోనే అప్పటి సీఎం వైఎస్ జీవో 159ని, 7.7.2007న జారీచేశారు. దానితో సదరు ప్రాజెక్టుకు ఉమ్మడి సర్కారు ఆమోదముద్ర పడ్డట్టే లెక్క. సదరు జీవోలో ఎస్సెల్బీసీలో భాగంగా నిర్మించే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్టు చేసే పథకానికి సంబంధించిన నక్కలగండి పథకంపై సర్వే కోసం రూ.1.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టంగా ఉంది. అంటే 2007లోనే ఈ ప్రాజెక్టుకు అప్పటి ఉమ్మడి సర్కారు అనుమతినిచ్చేసింది. డీపీఆర్‌ను పరిశీలించేందుకు ఒక అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ 2009లో జీవో 200 కూడా జారీ చేశారు. డీపీఆర్‌ను పరిశీలించేందుకు కమిటీ వేశారంటే ఆ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టే. ప్రజాప్రతినిధుల నుంచి సరైన ఒత్తిడి.. ఖజానాలో సొమ్ము ఉండి ఉంటే ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయి ఉండేది. అయితే 2006లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ స్పష్టం చేయడంతో అప్పటి ప్రభుత్వం అధికారులకు ఆ మేరకు మెమో జారీ చేసిందని చంద్రబాబు సర్కారు తన లేఖలో సాకు చూపింది. మరి సీమాంధ్ర ప్రాజెక్టులకు ఆ నియమం పాటించారా అంటే ఏం జవాబు చెప్తారు? కానీ ఇక్కడ అప్పటి సీఎం వైఎస్ బ్రిజేశ్ ట్రిబ్యునల్ కొలిక్కి రాగానే డిండిని చేపడతానని ప్రకటించారు. ఏ రకంగా చూసినా డిండి ప్రభుత్వం అనుమతించిన.. చేపట్టిన ప్రాజెక్టే తప్ప నూతన ప్రాజెక్టు కాదు.

పాలమూరుకు పక్కా దారి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అధికారికంగా ఆరేండ్ల చరిత్ర ఉంది. 2009 ఫిబ్రవరి 4న ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆయన పేషీ నుంచి నం.1800/సీఎంసీ/2009 లేఖ కూడా వెళ్లింది. దీనితోపాటు ఈ ప్రాజెక్టు డీపీఆర్, సర్వేకోసం రూ.5 కోట్లు కేటాయించాలని సీఈపీ/ఎంబీఎన్‌ఆర్/పీఎల్‌ఐఎస్/3686, 26.2.2009 లేఖ జారీ అయింది. దాని కొనసాగింపుగా 2013లో సమైక్య ప్రభుత్వమే స్వయంగా ఈ ప్రాజెక్టు సమగ్ర సర్వేకోసం రూ.6.91 కోట్లు మంజూరుచేస్తూ జీవో 72ను 8.8.2013 జారీ చేసింది. అంతేకాదు.. ఏ నీరు? ఎంత కాలం? ఎన్ని టీఎంసీలు అనేది కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. 35 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 70 టీఎంసీలను తరలించుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించినట్టు జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇది కొత్త ప్రాజెక్టు ఎలా అవుతుంది? ఈ చరిత్ర అంతా తొమ్మిదేండ్లు సీఎంగా, పదేండ్లు ప్రతిపక్ష నేతగా చేసిన నేటి అవశేష ఏపీ సీఎంకు తెలియదా? ఆ జీవోల్లో నీటి కేటాయింపుల ప్రస్తావన లేదని, కేవలం ఇన్వెస్టిగేషన్‌కోసమే జీవోను ఇచ్చారని పచ్చి అబద్ధాలను చంద్రబాబు, ఆంధ్ర పత్రికలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. 70 టీఎంసీల వరద జలాలను తీసుకుని పదిలక్షల ఎకరాలకు నీరందించడానికి ప్రాజెక్టును రూపొందించాలని 8.8.2013న ఇచ్చిన జీవో 72లో స్పష్టంగా ఉంది. మూడు జిల్లాలకు తాగు, సాగు నీరివ్వడం లక్ష్యంగా పేర్కొంది. అలాగే జీవో ఎంఎస్ 169 కింద 7.7.2007న 30 టీఎంసీల నీటితో డిండి ప్రాజెక్టును నిర్మించి ఫ్లోరైడు బాధిత ప్రాంతాలకు తాగునీరివ్వాలని, 3 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని డిండి ప్రాజెక్టుకు ఉద్దేశించిన జీవో వివరించింది.

మోదీ కూడా చెప్పారు..
22.4.2014న మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించిన అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని తన ప్రసంగంలో దశాబ్దం క్రితం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం విపరీతమైన జాప్యానికి గురవుతున్నదని ప్రస్తావించారు. ఇప్పుడు అదే పాలమూరు ప్రాజెక్టు ఎలా కొత్త ప్రాజెక్టుగా మారింది?

జలాల సంగతేంది?..
2001లో కేసీఆర్ శాసనసభలో అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సర్కారు తరఫున అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానమిస్తూ బచావత్ కేటాయించిన 299 టీఎంసీలతో పాటు ఎస్సెల్బీసీ-30, కల్వకుర్తి-25, నెట్టెంపాడు-22 టీఎంసీలతో తెలంగాణకు 376 టీఎంసీల మిగులు జలాల కేటాయింపులు(ఉమ్మడి ఏపీ చేసినవి) ఉన్నాయని స్పష్టంచేశారు. బచావత్ కేటాయింపు కాకుండా తెలంగాణకు అదనంగా 77 టీఎంసీల మిగులు జలాలున్నాయని ధ్రువీకరించారు. విభజన తర్వాత మొన్న కృష్ణాజలాల యాజమాన్య మండలి నికరజలాలు, వరద జలాలు 63.13, 36.86 నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పింది. వరద జలాలపై ఆధారపడి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కలిపి 227.5 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులు నిర్మించారని, ఇందులో తెలంగాణ ప్రాజెక్టుల వాటా 77 టీఎంసీలని తాజాగా ఏపీ రాసిన లేఖలో కూడా పేర్కొంది.

అంటే 376 టీఎంసీలకు ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం తెలంగాణకు ఉంది. తాజాగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు కలిపి 197 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఇందులో సగం నీటిని కేటాయించినా తెలంగాణకు అదనంగా మరో 100 టీఎంసీలు వస్తాయి. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే పని అయితే మళ్లించిన నీటిలో 45 టీఎంసీలు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు వస్తాయి. అంటే కృష్ణాలో తెలంగాణ నీటివాటా 521 టీఎంసీలు.

నీళ్లే లేనపుడు కొత్త బ్యారేజీ ఎలా కడతారు?
కృష్ణాలో మిగులు జలాల ఆధారంగా 227.50 టీఎంసీల ప్రాజెక్టులు చేపట్టగా ఏపీలో 155.50 టీఎంసీలు, తెలంగాణలో 77 టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయన్న చంద్రబాబు.. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు మిగులు జలాలు ఉండవని వాదిస్తున్నారు. విచిత్రమేమంటే.. కొన్నిరోజుల కిందట చంద్రబాబు పులిచింతల-విజయవాడ మధ్య కృష్ణాపై కొత్త బరాజు నిర్మించాలని ఏపీ జలవనరుల శాఖను ఆదేశించారు. కృష్ణాలో మిగులు జలాలే లేనపుడు ఈ కొత్త బరాజు ఏ నీళ్లతో కడతారు?

అసలు పట్టిసీమ ఎక్కడిది?
పాలమూరు, డిండిలపై ఇంత రాద్ధాంతం చేస్తున్న బాబు తన కింద నలుపును మాత్రం దాచేస్తున్నారు. పట్టిసీమ అనే ప్రాజెక్టు రాష్ట్ర విభజన వరకు ఎవరికీ తెలియదు. కేంద్ర జలసంఘం కూడా ఈ పేరుతో ఒక ప్రాజెక్టు ఉన్నట్టు ఎపుడూ వినలేదని స్పష్టంచేసింది. ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని ఏపీ సీఎం చెప్తున్నారు. కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి పట్టిసీమ అనే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికిగానీ, తమ శాఖకుగానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే కాదని కూడా కుండబద్దలు కొట్టారు.

డూడూ బసవన్నలు.. మేధో వైపరీత్యాలు..
ఆంధ్రా పార్టీలు తెలంగాణకు అవసరమా? తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది! దీనిమీద ఆంధ్రపార్టీలు గగ్గోలు పెట్టాయి. మీడియా ఇంతెత్తున ఎగిరింది. అవతలి వాళ్లకే కాదు.. మనవాళ్లు కొందరికీ రోషం పొడుచుకొచ్చింది. ఇతర పార్టీలను కూల్చే యత్నాలు చేస్తున్నారని ఆంధ్రపార్టీలు నాయకులు, వారికి తాళం వేసే తెలంగాణ శాఖల బసవన్నలు రంకెలేశారు. మన పాత్రికేయులు ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం అంటూ కాలమ్‌లు నింపేశారు. ప్రకటిత, స్వయం ప్రకటిత మేధావులు రాజ్యాంగాలు, ప్రత్యామ్నాయాలు, నియంతృత్వాలు అంటూ వాగాడంబర విన్యాసాలుచేశారు.

కానీ ఈ ఏడాదిన్నర అనుభవం ఏం చెప్తున్నది? ఆంధ్రపార్టీల కుట్రలకు అంతూ పొంతూ ఉన్నదా? ఆంధ్రమీడియా రాక్షసదాడులకు హద్దూ పద్దూ ఉన్నదా? ఎప్పటికప్పుడు ఏదో పంచాయతీ! విద్యుత్ తీగలకు ఫీజులు పీకడం, జలవిద్యుత్‌కు అడ్డంపడడం, ఆత్మగౌరవంతో బతుకుతామంటే ఉమ్మడి సంస్థలమీద, విద్యావ్యవస్థ మీద, న్యాయవ్యవస్థ మీద.. చివరికి రాజధాని నగరం మీద కూడా పెత్తనం కొనసాగించే యత్నాలు! ఉద్యోగులకు ఆప్షన్ల పేర తిష్ఠ. తెలంగాణ గుండెకాయ మీద విమానాశ్రయాలకు వాళ్ల పేర్లు. ప్రాజెక్టులమీద అంతర్గతంగా జిల్లాలమధ్య కలహాలు రెచ్చగొట్టే యత్నాలు. ప్రభుత్వంలో అంకితభావంతో పనిచేసే అధికారుల మనోధైర్యం దెబ్బతినేలా మీడియాను అడ్డుపెట్టుకుని నీలాపనిందలు, దుష్ప్రచారాలు, దుర్మార్గపు దాడులు. ఆఖరుకు ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడానికి కోట్లకు కోట్లు కుమ్మరింపులు.

దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అనేక రాష్ట్రాలు విడివడ్డాయి. ఎప్పుడూ ఎవరికీ లేని కష్టాలన్నీ ఒక్క తెలంగాణకే వస్తాయి. అన్ని రాష్ట్రాలకు హైకోర్టులు వస్తాయి. ఒక్క తెలంగాణకు మాత్రం అరిచి గీ పెట్టినా రాదు. గట్టిగా నిలదీస్తే చేతనైంది చేసుకో పో.. అంటారు. ఇవేవీ ఇక్కడి మేధావులకు సమస్యగా కనిపించవు. విచిత్రంగా ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా విరుచుకుపడడంలో మాత్రం ఒకరిని మించి ఒకరు ముందుంటారు. ఇక్కడి సర్కారు ఎలా ఉండాలో.. ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పేవారికి సీమాంధ్ర ప్రభుత్వ వైఖరిని నిరసించే పని తమది కాదనిపిస్తుంది. ఇక ప్రతిపక్షాలది రాజకీయ ప్రయోజనాల యావ. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది కాలంలో డజనుకు పైగా లేఖలు కేంద్రానికి, జలసంఘానికి, తెలంగాణ ప్రభుత్వానికి రాశారు. తెలంగాణలోని రాజకీయ పక్షాలు ఈ అంశంపై పల్లెత్తుమాట అనవు. సరికదా.. ప్రాజెక్టులకోసం ముందడుగు వేస్తున్న ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తాయి.

కాంగ్రెస్, టీడీపీల పాలనలో నదులనుంచి నీటిని తీసుకోవలసిన చోట పనిచేయకుండా ఉత్తగా కాలువలు తవ్వించి బిల్లులు ఎత్తేసుకున్నారు. ప్రాణహితలో రాజకీయ లబ్ధికి దోసిలి పడుతున్న కాంగ్రెస్.. పాలమూరుకు బాబు అడ్డుపడుతుంటే నోరెత్తదు. బీజేపీ నోరు మెదపదు. కాంగ్రెస్‌కు ఇదొక సమస్యగానే అనిపించడంలేదు. సీపీఐ, సీపీఎంల ఎజెండాలే వేరు. వారు సాగునీటి సమస్య తప్ప అన్నీ మాట్లాడతారు అని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు.

నాసికా త్రయంబకం సమీపంలో జలాల్‌పూర్ వద్ద మొదలు పెట్టి.. నాందేడ్ జిల్లా బాబ్లీ వరకు గోదావరి నదిపై 63 బ్రిడ్జి కం బరాజులుకానీ, భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులుగానీ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అక్కడ మనలా గోదావరి నది ఎండిపోయి కనిపించే ప్రాంతాలు చాలా తక్కువ. కృష్ణా ఉపనది భీమా నదిపై కూడా 40కి పైగా ఇటువంటి బరాజులు, ప్రాజెక్టులు మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించాయి. ఇక్కడ ప్రాజెక్టులు కడదామంటే రాజకీయ నాయకులు వందరకాలుగా మాట్లాడతారు. కనీసం సాగునీరు, తాగునీరు విషయంలో ఏకతాటిపై ఉందామనే స్పృహ ఉండదు. కర్ణాటక, మహరాష్ట్రలలో సాగునీటి విషయం వస్తే అన్ని పార్టీలూ ఒక్కతాటిపైకి వచ్చి నిలబడతాయి. ఇక్కడ ఆంధ్రా నాయకుల కొంగుపట్టుకుని తిరిగేవారు కొందరు, ప్రతిపక్షమంటే అన్నింటినీ వ్యతిరేకించడమే అని భావించేవారు ఇంకొందరు అని విశ్లేషకులొకరు వాపోయారు.

ఎన్ని లేఖలో..
ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్న లేఖాయనం తీరు ఇలా ఉంది.
– కేంద్రం, కేంద్ర జల సంఘంకు రాసిన లేఖలో సాగునీటి ప్రాజెక్టులను ప్రజా ప్రయోజనాలకు విరుద్ధ నిర్మాణాలని అభివర్ణించారు. విభజన చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– తర్వాత.. సీడబ్ల్యూసీ, కృష్ణా యాజమాన్య బోర్డుకు మరో లేఖ పంపారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ, అపెక్స్ కమిటీ, కృష్ణా నదీ బోర్డుకు లేఖలు రాసి, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తెప్పించుకొని పరిశీలించాలని, వాటిని తమకిచ్చి, తమ అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరారు. ఆ తర్వాతే తుది నిర్ణయం జరగాలన్నారు. అప్పటిదాకా ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకుపోకుండా ఆదేశించాలని కోరారు.

– ఆ తర్వాత తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి మరో లేఖ రాశారు. అందులోనూ పాలమూరు, డిండి ప్రాజెక్టులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. ఇది ఆంధ్ర హక్కులకే కాదు.. ఎగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించడమేనని ఆరోపిస్తూ పొరుగు రాష్ట్రాలను కూడా ఇందులోకి లాగారు.

– తాజాగా జులై 31న మరో లేఖను తెలంగాణ ప్రభుత్వానికే రాశారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు అనుమతులు కావని వాదించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *