mt_logo

అడ్డగోలు లేఖలు రాయడం టీడీపీకి కొత్త కాదు- హరీష్ రావు

ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును చూసి ఆంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేని ఆయన అసమర్ధతపై ఏపీ ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోయాయని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏడాది దాటినా ఏమీ చేయలేని, చేతగాని చంద్రబాబుపై ఆంధ్రా జనం ఆశలు వదులుకున్నారని, ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజల దృష్టిని మళ్ళించేందుకే పాలమూరు, డిండి ఎత్తిపోతలపై టీడీపీ లేఖల డ్రామాలు ఆడుతున్నదన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు కావాల్సిన నీటి కేటాయింపులు ఉన్నాయని చెప్పడానికి శతకోటి ఆధారాలున్నాయని చెప్తూ అందులో ముఖ్యమైన పది అంశాలను గురువారం మీడియాకు విడుదల చేసిన లేఖలో మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో తమకు ఉన్న హక్కు ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటున్నా, దాన్ని అనవసర రాద్ధాంతం చేయడం వెనుక ఆంధ్రా ప్రజల కోసం పోరాడుతున్నామనే భ్రమ కల్పించే కుట్ర ఉందని హరీష్ రావు చెప్పారు. మంత్రాలకు చింతకాయలు రాలవు.. మీ లేఖలతో మా ప్రాజెక్టులు ఆగవు.. కరువు పీడిత మహబూబ్ నగర్ జిల్లాకు, ఫ్లోరైడ్ తో అల్లాడుతున్న నల్గొండ జిల్లాకు నీళ్ళిద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డగోలు లేఖలతో టీడీపీ సైంధవుడిలా అడ్డుపడుతుందని మండిపడ్డారు. పాలమూరు పాత ప్రాజెక్టేనని డాక్యుమెంట్లతో సహా ఇప్పటికే అనేకసార్లు నిరూపించామని, వాళ్ళ అసమర్ధ పాలననుండి ఏపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు, నీళ్ళు వస్తాయని ఆశపడుతున్న తెలంగాణ ప్రజలను గందరగోళ పరచడానికే ఏపీ ప్రభుత్వం చిల్లర చేష్టలు చేస్తుందన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి గతంలో కూడా ఇలాంటి లేఖలు చాలా రాసిందని, అయినా లేఖలతో తెలంగాణ ఆగలేదని, ఈనాడు ప్రాజెక్టులు కూడా ఆగవని హరీష్ రావు స్పష్టం చేశారు.

పాలమూరు కొత్త ప్రాజెక్టు కాదు, పాత ప్రాజెక్టే అని చెప్పడానికి సవాలక్ష సాక్షాలున్నాయి. పాలమూరు, డిండికి కావాల్సిన నీటి కేటాయింపులున్నాయని చెప్పడానికి మా దగ్గర శతకోటి ఆధారాలున్నాయి. అందులో ముఖ్యమైన పది అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను.

1. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామని మాటిచ్చారు. తెలంగాణకు 290 టిఎంసిల నికర జలాలతో పాటు మొత్తం 368 టిఎంసిల వాటా కృష్ణాలో ఉందని నాడే చెప్పారు.
2. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 70 టిఎంసిల నీటితో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని, దానికి సర్వే చేయమని 72వ నంబరు జీవో కూడా విడుదల చేశారు.
3. 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్లో ఏప్రిల్ నెలలో టిడిపి-బిజెపి సంయుక్త ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఆ సభలో అప్పటి ప్రధాని అభ్యర్థి, ఇప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించారు. ఏండ్లు గడిచినా తల్లీకొడుకులు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని సోనియా, రాహుల్ గాంధిలను విమర్శించారు. మా దగ్గర పేపర్ కటింగులు, వీడియో క్లిప్పింగులు కూడా ఉన్నాయి. పంపిస్తాం.
4. అదే ఎన్నికల్లో రాహుల్ గాంధి కూడా తాము మళ్లీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామని హామీ ఇచ్చారు. అంటే యుపిఏ, ఎన్డీఏ రెండూ ఒప్పుకున్న ప్రాజెక్టు ఇది.
5. కృష్ణా నది జలాల్లో మాకున్న వాటా ప్రకారమే మేము ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఇంకా మాకు నీటి వాటా పెరగబోతున్నది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 197 టిఎంసిల వరద జలాల్లో తెలంగాణ వాటా తేలాలి. సగం వాటా వచ్చినా దాదాపు వంద టిఎంసిలు తెలంగాణకు వస్తాయి.
6. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం దిగువ రాష్ట్రాలు నదీ జలాలను మళ్లించుకుంటే వాటిలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. దాని ప్రకారం… మీరు 80 టిఎంసిల నీటితో పట్టిసీమ కట్టుకుని గోదావరి నీటిని మళ్లించుకుపోతున్నారు. మాకు దాని ప్రకారం కృష్ణా నీటిలో 45 టిఎంసిల నీటి వాటా ఉంటుంది.
7. ఏ నదీ జలాల్లో అయినా.. సరే ముందు తాగునీటికి కేటాయింపులు జరపాలి. ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్ లో ఉంది. కృష్ణా నీటినే నగరానికి తరలించాలి. హెచ్ఎండిఏ పరిధిలో జనాభా కోటి 42 లక్షలు. ఇంత మంది ప్రజలకు తాగునీరు అందించాలంటే ఏటా దాదాపు 60 టిఎంసిల నీరు కావాలి. ఈ నీరు తీసుకునే హక్కు తెలంగాణకు లేదా?
8. శ్రీ కృష్ణా కమిటీకి ఆంధ్రా పార్టీలిచ్చిన నివేదికలో హైదరాబాద్ నగరంలో 40 లక్షల మంది ఆంధ్ర వాళ్లున్నారని మీరే రాశారు. మరి మీ లెక్క ప్రకారమే 40 లక్షల మంది ఆంధ్రోళ్లు ఉన్న హైదరాబాద్ నగరానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటారా? మేము హైదరాబాద్ నగరానికి 60 టిఎంసిల నీరు వాడుకుంటే, అందులో 25 టిఎంసిల మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆంధ్ర ప్రజలే వాడుకుంటారు కదా. అంటే మీ ప్రజలకు నీరివ్వద్దని మీరే చెబుతారా?
9. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని మాట్లాడుతున్నారు. పట్టిసీమకు ఎవరి అనుమతి ఉందో చెప్పండి. ఎవరు అనుపతి పత్రం ఇచ్చారో చూపించండి. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, పులిచింతల లాంటి పథకాలను ఎవరి అనుమతి తీసుకుని కట్టారో చెప్పండి. రాష్ట్రాలకున్న నీటి వాటా ప్రకారం ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఏ రాష్ట్రానికైనా ఉండే సహజమైన హక్కు. ఆ హక్కు ప్రకారమే మేము పాలమూరు, డిండి కట్టుకుంటున్నాం.
10. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా నదిలో 300 టిఎంసిల నీరు వాడుకునే హక్కు తెలంగాణకుంది. ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా కనీసం వంద టిఎంసిలు కూడా నీరు తెలంగాణలో పారడం లేదు. మాకున్న నికర కేటాయింపులతోనే మేము ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. కేటాయించాల్సి ఉన్న దాదాపు 100 టిఎంసిల వరద జలాలు, పట్టిసీమకు పరిహారంగా రావాల్సిన 45 టిఎంసిలు, హైదరాబాద్ నగర మంచినీటికి కోసం ఇవ్వాల్సిన వాటా, నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడిక బాపతు నీళ్ల వాటా రావాల్సి ఉంది. అవన్నీలెక్క కలిపితే మేము పాలమూరు లాంటి మరో ఐదారు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. నిజాలకు మసిపూసి మారేడు కాయ చేసే పని ఇప్పటికైనా మానుకోండి. దగా పడిన బతుకులు బాగుపడుతుంటే ఓర్వలేనితనం ప్రదర్శించడం మంచిదికాదు.
– తన్నీరు హరీష్ రావు
నీటి పారుదల శాఖ మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *