mt_logo

కేసీఆర్ పైనే ఎందుకీ అక్కసు??

By: సీహెచ్ శ్రీనివాస్..

అకారణంగా ఒకరిని ద్వేషిస్తున్నామంటే, వాళ్లు మనకన్నా గొప్పవాళ్లు అయుంటారు- ఒక సామెత. ఏప్రిల్ 11న మొదటి దశ పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నేతలు రెండుచోట్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేటీఆర్ తెలంగాణలో అంతటా తానై, సుడిగాలి పర్యటనలు చేస్తూ అగ్రభాగాన నిలువగా, కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలిచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యేలు, నాయకులు టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేయడం అశనిపాతమైంది. దాదాపు అన్ని జిల్లాల్లో, కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఊహల్లో తేలిపోయి, ప్రభుత్వ అధికారులకే వార్నింగ్‌ లిచ్చినవాళ్లను కఠోరవాస్తవం కటికనేల మీదికి దించింది. పైసలతో పని జరుగకపోవడం వాళ్ల అనుభవంలో ఇదే తొలిసారి. లోక్‌సభకు అభ్యర్థులే దొరుకక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లనే పార్లమెంట్ అభ్యర్థులుగా నిలుపాల్సిరావడం వాళ్ల దీనస్థితికి అద్దం పడుతున్నది. ఇక బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే వాళ్లకు పెద్దగా అంచనాలు ఏవీ లేక, కొంత స్థిమితంగానే ఉన్నారు. మరిక చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పుట్టిన పునాదులను ధ్వంసం చేసి, దివంగత ఎన్టీఆర్ ఆశయాలను ఆకాశంలోకి పంపి, ఆజన్మ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాడు. కేవలం టీఆర్‌ఎస్‌ను ఓడించడం కోసం. ఏకంగా సకుటుంబ సపరివార సమేతంగా తెలంగాణ పైకి దండెత్తివచ్చాడు. తరతరాలుగా జరిగిన మోసాన్ని మర్చిపోని తెలంగాణ, ఒక్క తాపు తన్నింది. ఇలా ఈ మూడు పార్టీలకు మాడు పగలడంతో ఏం చేయాలో పాలు పోవడంలేదు. పులి మీద పుట్రలా మళ్లీ లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఇప్పుడేం మాట్లాడాలి? ప్రజలకు ఏం చెప్పి ఓట్లడగాలి? మనం మంచేం చేయనప్పుడు ఎదుటివాడిపై చెడు చెప్పాలి.

 

మొన్న ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రస్తుతం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో, ప్రచారం కొత్తపుంతలు తొక్కుతున్నది. విచిత్రంగా జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. గెలిస్తే, వాళ్లేం చేస్తారో చెప్పకుండా, అసందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం, తిట్టడం చూస్తుంటే, చేయడానికి, చెప్పడానికి వాళ్లకేంలేదని అర్థమవుతున్నది.

ఒకటికి పది సార్లు చెప్పాలి. పదిమంది చెప్పాలి. అంతే.. కేసీఆర్‌పై దాడి మొదలైంది. ఇక్కడ అందరికీ కామన్ శత్రువు కేసీఆర్. తెలంగాణను, కేసీఆర్‌ను విడదీసి చూడటం అసంభవం. కేసీఆరే తెలంగాణ, తెలంగాణే కేసీఆర్ అన్నంతగా పెనవేసుకుపోయింది ఆ బంధం. కేసీఆర్‌ను చికాకు పెట్టి, ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, ఆత్మరక్షణలో పడేస్తేనే తమకు తెలంగాణలో కనీసం వేలు పెట్టే సందయినా దొరుకుతుందని వాళ్ల దురాశ. కానీ ఆయన వజ్ర సంకల్పాన్ని, ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయడమంటే పరమశివుడి తపోభంగం చేయడమటువంటిది. మాడి మసైపోతారు. అయితే కనీసం ప్రయత్నలోపమైనా లేకుండా ఉండాలంటే, సహేతుక, సద్విమర్శలుండాలి. ఆయన పాలనలో లోపమెక్కడుందో, చేయగలిగీ చేయనిదేదో సకల సాక్ష్యాధారాలతో నిరూపించగల సామర్థ్యముండాలి. అన్నింటికీ మించి ముక్కుసూటిగా అడుగగల దమ్ముండాలి. ఇవేవీ లేకుండానే చేసే పరమ అసహ్య, అసందర్భ, అసత్య ప్రేలాపనల వల్ల కేసీఆర్ ఇంకా బలవంతుడవుతాడే తప్ప సత్తువ కోల్పోడు. విచిత్రంగా అందరూ ఇదే బాటను ఎంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎంత ప్రసంగాన్ని రాష్ట్ర నేతలు రాసిచ్చినా, విషయం తెలుసుకోకుండా చదువడు. కానీ, తెలంగాణలో, తెలంగాణపై, కేసీఆర్ గురించి మాట్లాడాల్సివచ్చినప్పుడు సమాచారమంతా ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. తప్పుడు సమాచారంతో అభాసుపాలవుతూ, కొడుకు-కూతుళ్ల గురించి, పూజలు-వ్రతాల గురించి మాట్లాడితే చాలా వెకిలిగా ఉంటుంది. అయితే మోదీ దగ్గరి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం. ఎంత ప్రధాని పదవిలో ఉన్నా, ఈ దేశంలో ఎన్ని లక్షలమంది ఏ అర్హతలతో రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన కూడా అలాగే వచ్చాడు. నిజానికి ఆయన ఒక పొలిటికల్ ప్లాంటర్.

ఎన్నికల్లో గెలువాలంటే ముందుగా జనాల మనసులు గెలువాలి. కేవలం నిజాయితీ, నిబద్ధతలతోనే అది సాధ్యం. తన పని తాను ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో చేసుకుపోతున్నారు కాబట్టే కేసీఆర్ గుండెలు గెలిచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం చేయాలో వారికి బాగా తెలుసు.

అతిపెద్ద దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని విదేశీ ప్రవేశం చేసే ఏజెంట్లను సాధారణంగా నిఘా సంస్థలు ప్లాంటర్‌గా వ్యవహరిస్తాయి. ప్రధాని కావాలనుకున్న తర్వాతే ఆయన రాజకీయప్రవేశం చేశాడు. పకడ్బందీగా ఒక్కో మెట్టూ ఎక్కాడు. లక్ష్యాన్ని చేరుకున్నాడు. కానీ, ఆయనకు ఈ దేశం గురించి కానీ, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర గురించి గానీ, ప్రజల జీవన స్థితిగతుల గురించి గానీ ఏమీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా. ఇక రాహుల్ గాంధీ.. ఆయనకు కూడా ప్రధాని కావాలనే ధ్యాసే తప్ప, ఎలా కావాలనే దానిపై ఏ మాత్రం అవగాహన లేదు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇన్ని సీట్లు రావాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు సేల్స్ టార్గెట్లు పెట్టాడు. లెక్క కుదరడం లేదని చెల్లిని దింపాడు. కానీ దక్షిణ భారతం మింగుడు పడటంలేదు. అందునా తెలంగాణ. రాష్ట్ర పీసీసీ నాయకులు ఎటూ దండగ గుంపు అని తెలుసు. ఎలా? మళ్లీ కేసీఆర్‌నే తిడితే పోలా..! వాళ్లిద్దరు దోస్తులంటాడు ఈయన. వీళ్లిద్దరు దోస్తులంటాడు ఆయన. ఎవరు ఎవరికీ దోస్తులో ఎవరికీ తెలియదు. పాపం.. చంద్రబాబు పరిస్థితి అయోమయం జగన్నాథం. ఎన్నికలు ఏపీలో పెట్టుకొని, కేసీఆర్‌ను తిడుతాడు. జగన్, కేసీఆర్, మోదీ ఒకటేనంటాడు. అసలు ఆంధ్రా ఎన్నికలతో కేసీఆర్‌కేం సంబంధం? ఎవరు అధికారంలోకి వచ్చినా, హాయ్-బై వ్యవహారమే తప్ప తెలంగాణకేం లాభం? పోనీ కేసీఆర్‌కేం లాభం? ఇన్ని కోట్ల మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. అవడానికి ఇది చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. తెలంగాణ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంకయిపోయి, ఏదిపడితే అదే మాట్లాడుతున్నారు బాబు-అబ్బాయి-ఓ బామ్మర్ది. ఏపీ ప్రజలది పాపం.. చిత్రమైన బాధ. అతనికంటే ఘనుడు.. అచంట మల్లన్న.. అన్నట్లు ఆ నలుగురూ జనాలపై గెరిల్లా దాడులు చేస్తున్నారు. పీఎం కంటే సీనియర్ మోస్ట్ సీఎం మాత్రం అతి నీచస్థాయికి దిగజారి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. కేసీఆర్‌ను బూచిలా చూపిస్తూ, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు.

ఎన్నడూ లేంది మోకాళ్ల మీదకి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. బతిమాలుతున్నాడు. భయపెడుతున్నాడు. జగన్ వస్తే ఇక తన రాజకీయ జీవితం సమాప్తమని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ యాతనంతా. కేసీఆర్‌లా ఆలోచించాలన్నా, కేసీఆర్‌ను ఓడించాలన్నా, మళ్లీ కేసీఆరే కావాలి. ఇలా ఎలా జరిగింది? తెలియకుండానే కేసీఆర్ ఇంత ఎత్తుకు ఎప్పుడు ఎదిగారు? కళ్లముందు మేరునగధీరుడిగా ఎందుకు కనిపిస్తున్నాడు? నిజానికి కేసీఆర్ విజ్ఞానం అపారం. దానికి నిరంతర అన్వేషణ తోడైంది. ప్రపంచ చరిత్ర, ప్రముఖుల జీవిత చరిత్ర, కాలానుగుణ మార్పులు, సాంకేతిక విప్లవం.. ఇలా మానవ జీవితంపై ప్రభావం చూపగల అన్ని అంశాలను కేసీఆర్ కూలంకషంగా అర్థం చేసుకున్నారు. తెలంగాణ అనబడే ప్రాంతం అనుభవిస్తున్న కష్టాలెక్కడివి? కారకులెవరు? కావలసినదేమిటి? ఈ ఒక్క విషయం మీద 2001 నుంచి ఆయన సాగించిన మేధోమథన ఫలితాలే నేటి తెలంగాణ చవిచూస్తున్న ఫలాలు. సమస్య మూలాలను శోధించడమే ఆయన విజయానికి కారణం. నేడు తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమాలాంటివి ఆర్థికవేత్తలను, శాస్త్రవేత్తలను, వ్యవసాయవేత్తలను ఆనందాశ్చర్యచకితులను చేస్తుంటే, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇంజినీరింగ్ నిపుణులను సైతం అబ్బురపరుస్తున్నాయి. ఆయన తపనల్లా ఒక్కటే. బీదరైతు, పేదరైతు అనే మాటలు ఇక వినబడకూడదు. తెలంగాణ రైతు అంటే.. మంచి మోతుబరి అని దేశమంతా అనుకోవాలి. ఇంకో పక్క ప్రజారోగ్యం. రాష్ట్ర ప్రజానీకానికంతటికీ కంటి పరీక్షలు చేయించాలనే ఆలోచన అసలు ఎవరికైనా తడుతుందా? కంటివెలుగు ఇప్పుడు ప్రతి ఇంటి వెలుగైంది. కోటిన్నర మందికి పరీక్షలు చేశారు. ముప్ఫై లక్షల మందికి అద్దాలు ఇచ్చారు. ఇంకా అప్రతిహతంగా నడుస్తున్నది. రేపోమాపో ఈఎన్‌టీ డాక్టర్లు వస్తారట.

తర్వాత గుండె డాక్టర్లు.. ప్రజారోగ్యం గురించి కూడా ఆలోచించే ప్రభుత్వం ఎక్కడుంది? 52 లక్షల మంది రైతుబంధు లబ్ధిదారులు, ముప్ఫై లక్షల మంది రైతుబీమా సభ్యులు (ఇందులో 5వేలకు పైగా దురదృష్టవశాత్తు మరణించగా వారంలోనే 5 లక్షలు, బ్యాంకులో జమయ్యాయి), గొర్రెలు, చేపలతో రాష్ట్రం కళకళలాడుతోంది. ఈ పథకాలన్నీ రెడీమేడ్ పరిష్కారాలు కావు. తెలంగాణ కోసం స్పెషల్లీ కస్టమైస్‌డ్. తెలంగాణ వేదనకు కేసీఆర్ స్వయంగా తయారుచేసిన పెయిన్ కిల్లర్లు. ఒక్కసారి ఆవేదనంతా దూరమైతే.. ఇక అంతా అభివృద్ధే. ఇంతటి ప్రజాచింతన ఉన్న నేత దేశం గురించి కూడా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది? అదిగో… ఆ ఊహే భరింపజాలనిది. ఎక్కడ కేసీఆర్ ఢిల్లీకొస్తాడో.. మాపై పెత్తనం చెలాయిస్తాడోననే బాధే జాతీయ నాయకులను బెంబేలెత్తిస్తున్నది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాదిన కూడా రుచి చూపిస్తే మన పరిస్థితి ఏమిటి? ఎన్నికలొచ్చినప్పుడల్లా ఒకసారి పాకిస్థాన్‌ను బెదిరిస్తే చాలు. దేశభక్తి ఓట్లు కురిపిస్తుంది. అదే అభివృద్ధిని చూపిస్తే… జనాల ఆశలకు అంతూ పొంతూ ఉండదనే భావన దశాబ్దాలుగా నరనరానా జీర్ణించుకుపోయిన పార్టీలు అవి. కశ్మీర్ సమస్య వాళ్లకు ఒకరకంగా జీవనోపాధి. అది రావణకాష్టంలా రగులుతూనే ఉండాలి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రూపేణా ఢిల్లీలో అడుగుపెడితే, అది కాస్తా వామనుడి అడుగులా మారి సమస్తం ఆక్రమిస్తుందేమోనన్న భయమే వారితో ఇలాంటి తలా తోకలేని మాటలు అనిపిస్తున్నది. ఇప్పటికే ఆయన దేశ పరిస్థితి గురించి సభల్లో మాట్లాడుతున్న మాటలు వారిని ఇంకా ఆందోళనలో పడేస్తున్నాయి. కానీ, జనాలకేదైనా చేయాలనుకునే నాయకున్ని ప్రజలెప్పుడూ గుండెల్లోనే పెట్టుకుంటారు. దానికి ప్రాంతాలు, రాష్ట్రాలు అనే భేదభావముండదు. కేసీఆర్ దీక్షాపరుడు.

ఒక సినీకవి.. ఎవరోఒకరు, ఎప్పుడో అప్పుడు.. నడవరా ముందుకు.. అటో ఇటో ఎటోవైపు అన్నట్లు ఎంతో ధైర్యంతో, మనోబలంతో ముందడుగు వేయగలరు. అదే ఆయనకు తెలంగాణను తెచ్చిపెట్టింది. వీళ్లందరూ కేసీఆర్‌పై కత్తులు దూయడానికి ఇదే కారణం. ఆయన చేస్తున్న, చేయబోతున్న మంచి పనులు ఎలాగూ చేతకావు. మక్కికి మక్కి కాపీ కొట్టినా, ఎక్కడో తేడా కొడుతున్నది. కాబట్టి ఒకటికి వందసార్లు తిడితే, కనీసం ఒకరిద్దరన్నా నమ్మరా..అనే నీచపు ఎత్తుగడ. ఎన్నికల్లో గెలువాలంటే ముందుగా జనాల మనసులు గెలవాలి. కేవలం నిజాయితీ, నిబద్ధతలతోనే అది సాధ్యం. తన పని తాను ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో చేసుకుపోతున్నారు కాబట్టే కేసీఆర్ గుండెలు గెలిచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం చేయాలో వారికి బాగా తెలుసు. ఎంత ఎత్తుకు ఎదిగినా, తెలంగాణే కేసీఆర్‌కు ప్రథమ ప్రాధాన్యం. తన రాష్ట్రం ప్రజాజీవన ప్రమాణాల్లో అగ్రభాగాన ఉండాలనేది కేసీఆర్ ఉక్కు సంకల్పం. నెంబర్ 1 రాష్ట్రమంటే కడుపులో కత్తులు, మాటల్లో జిత్తులు కాదు, చేతల్లో చూపాలి. సూర్యోదయం ఎక్కడైనా పరవాలేదు, వెలుగు మాత్రం ప్రజల మొహాల్లో నిండాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *