mt_logo

మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం 

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఖాతాలో మరో పథకం కూడా చేరింది. ఇప్పటికే రైతుబంధు, మిషన్‌ భగీరథ లాంటి ప్రతిష్ఠాత్మక పథకాలకు నకలు తయారు చేసిన మోదీ సర్కార్‌.. తాజాగా మరో పథకాన్ని కాపీ కొట్టేసింది. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2017లో ప్రారంభించిన సంచార పశు వైద్యశాలలను ఇప్పుడు దేశమంతా అమలుచేసేందుకు కేంద్రం నిర్ణయించిది.

మారుమూల ప్రాంతాలకు వెళ్లి, పశువులకు తక్షణ వైద్యం అందిస్తూ.. వాటి ప్రాణాలు నిలపడమే లక్ష్యంగా 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌తో తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ వైద్యసేవలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచూర్యం పొందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రంలో పర్యటించారు. 1962 అంబులెన్స్‌లను, కాల్‌ సెంటర్‌ సేవలు అందిస్తున్న జీవీకే సెంటర్‌కు వెళ్లి పరిశీలించారు. రైతుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నట్టు గుర్తించి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసి, అంబులెన్స్‌లను అందించింది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో :

రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌.. పాడిపశువుల సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా పశువుల కోసం అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దాదాపు 27 లక్షల కుటుంబాలు పశుపోషణే ప్రధాన ఆదాయ వనరుగా జీవిస్తున్నట్టు సమాచారం. ప్రతి రైతు వద్ద ఎన్నో కొన్ని పశువులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవి అనారోగ్యం బారిన పడినప్పుడు సరైన సమయంలో వైద్య అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక అంబులెన్స్‌ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. తొలిదశలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున 100 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వీటిని 2017 సెప్టెంబర్‌ 15న సీఎం కేసీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

50 లక్షల కాల్స్‌. 30 లక్షల పశువులకు వైద్యం :

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశు వైద్యశాలల 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ప్రతిరోజు వందల సంఖ్యలో రైతుల నుండి ఫోన్లు వస్తుండటం గమనార్హం. అంబులెన్స్‌లు ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది జూలై వరకు ఏకంగా 50 లక్షల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ప్రతిరోజు 850 నుంచి 900 ఫోన్‌కాల్స్‌ రాగా, 30 లక్షల పశువులకు చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. 2017-18లో 3.04 లక్షల ఫోన్‌కాల్స్‌ రాగా 2021-22లో అది 9.67 లక్షలకు పెరుగడం గమనార్హం. అంటే 315 శాతం కాల్స్‌ పెరుగుదల నమోదయ్యింది. రోజువారి కేసుల సంఖ్య మొదట్లో 350 కాగా ప్రస్తుతం అది 850కి చేరింది. ఒక్కో అంబులెన్స్‌ మొదట్లో 3.5 ట్రిప్పులు వేయగా ప్రస్తుతం అది 8.8 ట్రిప్పులకు పెరిగింది.

మరో వంద అంబులెన్సులు :

పాడిపశువుల సంరక్షణే ధ్యేయంగా సంచార పశు వైద్యశాలల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నది. మందులు, వైద్యుల వేతనాలు, అంబులెన్స్‌ నిర్వహణ కలిపి ఏటా రూ.40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. అంటే ఈ ఏడేండ్లలో సుమారు రూ.280 కోట్లు ఖర్చు చేసింది. అంబులెన్స్‌ల కొనుగోలు ఖర్చు దీనికి అదనం. రూ.15 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం 100 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ప్రతి నెల ఒక్కో అంబులెన్స్‌ నిర్వహణకు రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *