Mission Telangana

క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 

ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై నగరంలోని ఎంఎల్‌సీ లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. పేదలు కూడా క్రిస్మస్ ను సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తుందన్నారు.

ఎల్‌బీ స్టేడియంలో జరిగే విందుకు సీఎం హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా ఒక్కో నియోజకవర్గ పరిధిలో ఎనిమిది ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో చర్చి కమిటీ ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి డిన్నర్, గిప్ట్ ప్యాక్ ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతానికి 500 చొప్పున గిప్ట్ ప్యాక్ లు, డిన్నర్ నిర్వహణ కోసం ఒక లక్ష రూపాయలు చొప్పున అందించనున్నట్లు వివరించారు. దీని కోసం నియోజకవర్గానికి ఒక ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు.

ఈ సమావేశంలో మండలి ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణి దేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్, టీఎస్‌ఈడబ్ల్యూఐసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ కాంతి వెస్లీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *