Mission Telangana

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ధ్వంసం చేయాలని చూస్తోంది : మంత్రి కేటీఆర్ మండిపాటు

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిరాకరించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిధులు నిరాకరించడం ఒక విధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసం లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మంగళవారం ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు హిందూ, బిజినెస్‌ లైన్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్.. కేంద్రం రాష్ట్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారతదేశాన్ని రాష్ట్రాల సమాహారంగా ఉండాలని కోరుకొన్నారని.. కానీ ప్రధాని మోదీ మాత్రం పూర్తిగా రాష్ట్రాల సమాఖ్యను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజ్యాంగం ద్వారా 1952లో 14 రాష్ట్రాలుగా భారతదేశం ఏర్పడితే ప్రస్తుతం వాటి సంఖ్య 29కి పెరిగిందని, ప్రధాని ఒక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 28కి తగ్గించారని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వంలోనే భారతదేశ అస్తిత్వం ఇమిడి ఉన్నదని పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రానికి ఆత్మ గౌరవం ఉంటుందన్న కేటీఆర్‌.. కొందరు మాత్రం ఢిల్లీలో కూర్చొని.. మేం ఇస్తున్నాం.. మీరు మాట్లాడుతున్నారు అనడం సరికాదని స్పష్టంచేశారు.

ప్రధానమంత్రి ఉచితాలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ‘మీరు అత్యధిక పేద ప్రజలు ఉన్న మూడో ప్రపంచ దేశానికి అధినేతగా ఉన్నారు. పీడిత వర్గ ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన విధి ప్రభుత్వంపై ఉండదా? వాళ్ల కనీస అవసరాలను మీరు ఎట్లా తీరుస్తారు? ఉదాహరణకు మేం పెన్షన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఇవాళ వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే.. వారి నిద్రలేమి రాత్రులకు కారణమైన సవాళ్లను పరిష్కరించినందువల్లే’ అని కేటీఆర్‌ చెప్పారు. కేంద్రం రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడంలో లేని తప్పు.. దేశంలో రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలపైన వెచ్చిస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు.

ప్రతి రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్ను వాటా కూడా ఆదాయ వనరులుగా ఉంటాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలకు సొంత ఆదాయం సరిపోతుందని చెప్పారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు అవసరమవుతాయని, వాటిని కేంద్రం పన్ను వాటాలో కోత పెడుతున్నదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా.. 15% వార్షిక వృద్ధిరేటు సాధించామన్నారు. తలసరి ఆదాయం 130% పెరిగిందని, జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రాలకు నిధుల నిరాకరణ ఒక విధంగా ఆర్థిక ఆంక్షలను విధించినట్టేనని విమర్శించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్‌ కేంద్రాన్ని మిథ్య అన్నారని గుర్తుచేశారు. జీడీపీలో 5% తెలంగాణ అందిస్తున్నదని చెప్పారు. తెలంగాణపై తుపాకీ గురిపెట్టడం ద్వారా.. దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తించడం లేదన్నారు.

ధాన్యం సేకరణలో కేంద్రం అనుసరించిన తీరే ఇందుకు ఉదాహరణ అన్నారు. భారీ నిల్వలున్నాయన్న సాకుతో తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు నిరాకరించిన మోదీ సర్కారు ఆరు నెలల్లోనే వైఖరిని మార్చుకొని నూకల ఎగుమతిపై నిషేధం విధించిందని తెలిపారు. తెలంగాణ మాదిరిగా దేశం అభివృద్ధి చెందితే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 4.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకొనేదని చెప్పారు. తెలంగాణ భారీ ఎత్తున అప్పులు చేస్తున్నదని విచిత్రంగా ఆరోపిస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 68 ఏండ్లలో రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మోదీ ప్రభుత్వం 8 ఏండ్లలో ఆ అప్పులను రూ.150 కోట్లకు చేర్చిందని వెల్లడించారు. తెలంగాణ అప్పులు మితిమీరుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ విమర్శలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో 25% లోపే ఉన్నాయని స్పష్టంచేశారు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి తాబేదారుగా ఉండాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశమని.. చేసే అప్పులను ఉత్పాదక రంగంలో పెట్టుబడిగా పెడితే మంచి ఫలితాలు వస్తాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *