తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో కీర్తిని అందుకుంది. దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ముత్యాలనగరం నిలిచింది. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను సేఫెస్ట్ సిటీగా పేర్కొన్నది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఏటా 10 లక్షల జనాభాకు సగటున నమోదవుతున్న నేరాల ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ నివేదికను విడుదల చేసింది. ఇందులో అత్యంత తక్కువ కేసులు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో మొదటి స్థానంలో కోల్‌కతా, రెండో స్థానంలో పుణె ఉన్నాయి. అత్యంత ఎక్కువ క్రైమ్ రేటు ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న నగరాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఐదు బీజేపీ రాష్ట్రాలే ఉన్నాయి.
ఎక్కువ నేరాల నమోదులో రెండోస్థానంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని సూరత్ రికార్డు సృష్టించింది. మిలియన్ జనాభాకు ఢిల్లీలో 18,596 కేసులు, సూరత్‌లో 16,768 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కేరళలోని కొచ్చి ఉన్నది. నాలుగో స్థానంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ మిలియన్ జనాభాకు సగటున 15,190 కేసులు నమోదయ్యాయి. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోనూ 11,071 నేరాలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, కాన్పూర్, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాల్లోనూ నేరాల నమోదు ఎక్కువగానే ఉన్నది. అతి తక్కువ నేరాల నమోదులో మొదటి స్థానంలో ఉన్న కోల్‌కతాలో ప్రతి 10 లక్షల మందికి సగటున 1,034 కేసులు నమోదయ్యాయి. పుణెలో 2,568, హైదరాబాద్‌లో 2,599 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల పట్ల మొదటి నుంచి తీసుకున్న చర్యలు నేరాలు తగ్గడానికి దోహదం చేశాయి.
కాగా హైదరాబాద్ అత్యంత భద్రమైన నగరంగా నిలువడం పట్ల పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా ఉంచేందుకు పోలీసు శాఖ అహర్నిశలు కష్టపడుతున్నదని కొనియాడారు. హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులను అభినందించారు.