తెలంగాణ ప్రాంతానికి చెందిన సమర్ధులైన ఐఏఎస్ అధికారులను తన ప్రభుత్వంలో నియమించడం ద్వారా తెలంగాణను వేగవంతంగా అభివృద్ధి చేయొచ్చని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి రప్పించాలని కేసీఆర్ గవర్నర్ ను కోరారు. వీరిలో కోల్ ఇండియా చైర్మన్, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావును సీఎంవో ముఖ్య కార్యదర్శిగా, మరో ఇద్దరు అధికారులు ఎం. గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నిన్న గవర్నర్ ను కలిసిన కేసీఆర్ ఈ విషయమై కేంద్రానికి తెలియజేయాల్సిందిగా కోరారు. గవర్నర్ సలహా మేరకు ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న వారిని కేంద్రసర్వీస్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పీకే మహంతి సోమవారం సాయంత్రం కేంద్రానికి, కోల్ ఇండియాకు ప్రత్యేకంగా లేఖలు వ్రాశారు. వీరిలో గోపాల్ రెడ్డిని ముఖ్యకార్యదర్శిగా, రాజశేఖర్ రెడ్డిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించనున్నారని సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేసీఆర్ ను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు. అతికీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుల్లో ఎవరిని నియమించాలనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారు. విద్యుత్తు, రవాణా, రెవెన్యూ, ఆర్ధిక, మున్సిపల్, వ్యవసాయం, నీటిపారుదల తదితర అన్ని శాఖల్లో సమర్ధులైన అధికారులను ఎంపికచేసే విషయంలో కేసీఆర్ క్షణం తీరికలేకుండా ఉన్నారు.