తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు సేకరించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమస్యలతో పాటు సలహాలు, సూచనలను మంత్రి వర్గ ఉపసంఘం స్వీకరించనుంది. స్థిరాస్థి వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వ్యాపారులు మొదలైన వారినుండి అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.