రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సాంకేతిక పరిజ్ణానంతో పరిష్కరించే దిశగా తొలి అడుగులు తెలంగాణ రాష్ట్రంలో పడనున్నాయి. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో త్వరలో అగ్రిహబ్ ఏర్పాటు కాబోతున్నది. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన టీ-హబ్ స్ఫూర్తితో అగ్రి హబ్ ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎస్ఏయూ) ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రాజేంద్రనగర్ లోని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి గల ఎంట్రప్రెన్యూర్స్ తో పాటు విద్యార్ధులను కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నారు. అగ్రి హబ్ నిర్మాణం, పరిశోధనలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరునెలల్లో అగ్రిహబ్ భవన నిర్మాణం పూర్తికానుంది.
వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు ఐటీ శాఖ టీ హబ్ ద్వారా 87 స్టార్టప్ లను సూచించింది. అయితే ఇందులో అవసరమైన 21 స్టార్టప్ లను గుర్తించిన వర్సిటీ అధికారులు తొలిదశలో 11 స్టార్టప్ లను గుర్తించి పరిశోధనలకు అనుమతి ఇచ్చారు. ఈ స్టార్టప్ లన్నీ ఒక్కో విభాగంలో సేవలు అందించనున్నాయి. అగ్రి హబ్ నిర్మాణ దశలో ఉన్నప్పటికీ సాంకేతిక ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ యాసంగి నుండే పలు ప్రాంతాల్లో సూచించిన పంటలపై పైలట్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతుకు తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో పని పూర్తి అవుతుంది. ఉదాహరణకు ఒక ఎకరం పొలంలో రసాయనాల పిచికారీకి సుమారు రూ. 800 వరకు ఖర్చు అవుతుంది. అదే డ్రోన్ల ద్వారా ఎకరానికి కేవలం రూ. 300 నుండి రూ. 400 వరకు ఖర్చు అవుతుంది.