తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురైన తెలంగాణ నిరుద్యోగులకు ఆరు సంవత్సరాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ మరోసారి భారీ సంఖ్యలో 50 వేల పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు. కరోనా రక్కసితో ఉపాధి అవకాశాలు కోల్పోయి నిరాశతో ఉన్న యువత సీఎం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఉపాధ్యాయులు, పోలీసులతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తొలగించే క్రమంలో యువతకు లక్షా ఏడువేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని తొలి శాసనసభా సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా గత ఆరేళ్లలో వాటి ప్రక్రియ పూర్తిచేశారు. వీటికి అదనంగా మరో 50 వేల ఉద్యోగాల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించి చరిత్ర సృష్టించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిపోతుందని టీజీవో, పీయార్టీయూఎస్, టీఎన్జీవో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎంసీహెచ్ఆర్డీ నివేదిక ప్రకారం 16 వేలకు పైగా ఉపాధ్యాయ భర్తీలు ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోనే 4,300 పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 29,408 పోస్టులు భర్తీ అవ్వగా తాజా ప్రకటనతో మరో 19,910 ఖాళీలు భర్తీ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే 8,300 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అయితే ఉపాధ్యాయ పోస్టులపై ప్రభుత్వం నుండి ప్రకటన వస్తే కానీ ఎన్నివేల ఉద్యోగాల భర్తీ ఉంటుందనేది తెలుస్తుంది. బీసీ వెల్ఫేర్ లో 1,027, మున్సిపల్ లో 1,533, పశుసంవర్ధక శాఖలో 1,500, వ్యవసాయ శాఖలో 1,740, ఎస్సీ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో 350, ఇతర శాఖల్లో మూడు నుండి నాలుగువేల ఖాళీలు భర్తీ చేసే వీలున్నట్లు సమాచారం. ఏఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే అంశంపై అధికారులు దృష్టి సారించనున్నారు.