mt_logo

ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించిన బహుజన్ సమాజ్ పార్టీ

బీఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని అక్రమ అరెస్ట్  చేసిందని..ఇది ఒక ఒక బూటకమని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండించింది.

కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్‌కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది  తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు అని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఇలాంటి అక్రమ అరెస్ట్లతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేదా కాదు. ఈ దుశ్చర్య కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈడీతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్‌ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు అని తెలిపారు.

దేశంలో మోదీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా, సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీని తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.