mt_logo

కాళేశ్వరం ప్రాజెక్టుపై వెదిరె శ్రీరాం ప్రచారానికి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం విదుదల చేసిన ప్రెస్ నోట్ లో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలు చోటు చేసుకున్నాయి అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.

తమ వాదనలు సత్యమని చెప్పడానికి అబద్ధాలను చెప్పడానికి వెనుకాడలేడని.. తెలంగాణలో ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు ముందు ఈ రకమైన ప్రెస్ నోట్ విడుదల చేయడం ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసినదే అని బీఆర్ఎస్ పేర్కొన్నది.

వేదిరే శ్రీరాం లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ తమ కౌంటర్‌ను విడుదల చేసింది 👇

ఆరోపణ: తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి కట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయ్యింది.
బీఆర్ఎస్ కౌంటర్: వారిని (బీజేపీని) ఒప్పించడానికి ఒక సంవత్సరం పాటు తీవ్రంగా ప్రయత్నించింది. వారి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ 152 FRL వద్ద బ్యారేజి కట్టడానికి అసలే ఒప్పుకోలేదు. 2015 ఫిబ్రవరి 17న ముంబై రాజ్ భవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో చర్చించుకున్నారు. ఆయన తన మొండి వైఖరి వీడలేదు. బ్యారేజి FRLను 148 మటర్లకు తగ్గించుకోమని చెప్పారు. ఇక కాలయాపన తప్ప ప్రయోజనం లేదని ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేయవలసి వచ్చింది.

ఆరోపణ: CWC తుమ్మిడిహట్టి వద్ద 165 TMC లో నీళ్ళు లభ్యం అవుతాయని ఎప్పుడు చెప్పలేదు.
బీఆర్ఎస్ కౌంటర్: 2015 లో CWC రాసిన లేఖలో మీరు 273 టీఎంసీలు లభ్యమవుతాయి అని DPR లో కట్టిన లెక్క తప్పు. అక్కడ 165 టీఎంసీలే లభ్యం అవుతాయని, అందులో పై రాష్ట్రాలు ఉపయోగించుకునే 63 టీఎంసీలు కలిసి ఉన్నాయని, అవి భవిష్యత్‌లో రాకపోవచ్చునని స్పష్టంగా చెపుతూ తరలించే నీటి పరిమాణాన్ని review చేసుకోమని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అంటే భవిష్యత్‌లో అక్కడ లభ్యమయ్యే నీరు 102 టీఎంసీలేనని చెప్పకనే చెప్పింది. అందుకే 284 టీఎంసీలు లభ్యమయ్యే మేడిగడ్డను ఎంచుకోవాలి వచ్చింది. ఈ లభ్యతను CWC కూడా ధృవీకరించింది.

ఆరోపణ: కోర్టు కేసు విరమించి కోవడంలో తాత్సారం చేసినందున కొత్త ToR జారీ చేయడంలో ఆలస్యం అయ్యింది.
బీఆర్ఎస్ కౌంటర్: సుప్రీం కోర్టులో కేసు విరమించుకున్న తర్వాత కూడా అదనపు ToR జారీ చేయడానికి మూడేళ్లు ఎందుకు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం? అసలు 2014 లో తెలంగాణ ప్రభుత్వం చేసిన రిక్వెస్ట్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అప్పుడు ఏ కేసు లేదు కదా. ఒకటిన్నర సంవత్సరాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంలో కేసు వేయడం జరిగింది. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి తాత్సారం చేసింది వారు. నెపం రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టుతున్నారు

ఆరోపణ: 2021 నుంచి మాత్రమే 50:50 డిమాండ్ చేయడం మొదలు పెట్టారు
బీఆర్ఎస్ కౌంటర్: 2018 నుంచే ఈ డిమాండ్ చేయడం మొదలయ్యింది. బోలెడన్ని లేఖలు, బోర్డు మినిట్స్ అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. 2015 నాటికి APRA సెక్షన్ 89 కింద విచారణ కూడా మొదలయ్యింది. వారికి చిత్తశుద్ది ఉండి ఉంటే ఆనాడే విచారణ సెక్షన్ 3 కింద జరపమని అడిగేవారు. చంద్రబాబు ఒత్తిడి ఫలితంగా సెక్షన్ 3 కింద విచారణ జరపమని ఆదేశించలేదు.

ఆరోపణ: కాళేశ్వరం బ్యారేజీల డిజైన్ లోపాలు ఉన్నాయని NDSA చెప్పింది
బీఆర్ఎస్ కౌంటర్: బ్యారేజి డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న CDO చేసిన సంగతి వాస్తవమే. వీటిణి డిజైన్ చేసినప్పుడు CWC, CBIP, BIS వారు జారీ చేసిన డిజైన్ మాన్యువల్స్, కోడ్స్‌ను తూచ తప్పకుండా పాటించారు. ఒకవేళ ఆ డిజైన్ లో తప్పులు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన మాన్యువల్స్/కోడ్స్ తప్పయి ఉండాలి. డిజైన్ లోపాలే ఉంటే 4 భారీ వరదలను తట్టుకొని నిలబడి ఉండేది కాదు. ఇప్పుడు కూడా కుంగుబాటు 8 బ్లాకుల్లో ఒక్క బ్లాకులోనే సంభవించింది. కుంగుబాటు ఎందుకు జరిగిందో చెప్పాలంటే detailed geological investigations జరగాలి. అప్పటిదాకా ఎవరు ఏమి చెప్పినా ఊహాగానాలు తప్ప ఖచ్చితమైన కారణాలు కాజాలవు. NDSA వారు కూడా ఇన్వెస్టిగేషన్ ఫలితాలు తమకు పంపాలని కోరింది. NDSA నివేదిక ఊహాగానాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయ ప్రయోజనాలను తీర్చడానికి వండి వార్చిందే తప్ప మరొకటి కాదు.

ఆరోపణ: కేంద్ర ప్రభుత్వం investment clearance ఇవ్వలేదు
బీఆర్ఎస్ కౌంటర్: నిజమే.. 2017 లో TAC clearance తర్వాత investment clerance కోసం రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు లేఖలు రాసింది. అయినా రెండేళ్ల పాటు కొర్రీలు పెడుతూ investment clearance రాకుండా కేంద్రమే తాత్సారం చేసింది.

మూడవ టీఎంసీ పనుల ఖర్చును కలిపి 1,27,000 కోట్లకు revised DPR పంపించినప్పుడు BCR 1.87 వచ్చిన లెక్కల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు CWC వారికి వివరించడం జరిగింది. వారు అందుకు ఒప్పుకున్నారు కూడా. అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి వారు BCR clearance ఇవ్వకుండా ఆపివేశారు. జిల్లా వ్యవసాయ అధికారులు అందజేసిన ప్రస్తుత పంటల ధరలను బిసిర్ ను లెక్కగట్టడానికి ఉపయోగించడం జరిగింది. అట్లాగే కరెంటు యూనిట్ ధర 6.40 తీసుకోవడం జరిగింది. తాగునీరు, పారిశ్రామిక నీటి ధరలు కూడా ప్రభుత్వ జీవోల ఆధారంగానే తీసుకోవడం జరిగింది. అంతే గానీ BCR లెక్కలు తప్పని చెప్పడం సరి అయ్యింది కాదు. అవి పూర్తిగా శాస్త్రీయంగా చెసిన లెక్కలు.

ఆరోపణ: NDSAకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని అందజేయలేదు
బీఆర్ఎస్ కౌంటర్: వారు అడిగిన అన్ని అంశాలకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అడిగిన మలి సెట్ ప్రశ్నలకు కూడా వివరణలు అందజేశారు

ఆరోపణ: దేవాదుల ప్రాజెక్టు డిజైన్ లోపాలను BRS ప్రభుత్వం కూడా సరిదిద్దలేదు
బీఆర్ఎస్ కౌంటర్: పచ్చి అబద్దం. ఎటువంటి pondage లేకుండా దేవాదుల ప్రాజెక్టును రూపకల్పన చేసిన చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దింది. కంతనపల్లి వద్ద ఆదివాసీ గ్రామాల ముంపును తగ్గించడానికి బ్యారేజి స్థలాన్ని తుపాకుల గూడెంకు మార్చి సమ్మక్క పేరుతో బ్యారేజిని 83 మీ FRLతో నిర్మించింది. ఆ ఎత్తువద్ద ఛత్తీస్గఢ్‌లో 50 ఎకరాల భూమి మాత్రమే మునుగుతుంది. ఆ ఎత్తున భూసేకరణ పూర్తి అయ్యేదాకా బ్యారేజీలో నీటి నిల్వ 80 మీ వద్దనే ఉంచుతామని హామి కూడా ఇచ్చింది. ఛత్తీస్ఘడ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సహకరించలేదు. 80 మీ వద్ద కూడా దేవాదుల ఇన్టేక్ లోకి నీటిని తీసుకునే అవకాశం ఉంది. గోదావరిలో 77 మీ ఎత్తులో నీరు ఉంటే దేవాదుల పంపింగ్ కు ఇబ్బంది లేదు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయనిరాకరణకు తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యమా?

ఆరోపణ: విభజన చట్టంలో KWDT 2 కి సెక్షన్ 3 కింద విచారణకు స్కోప్ ఇవ్వలేదు
బీఆర్ఎస్ కౌంటర్: నిజమే. మరి రాష్ట్ర ప్రభుత్వం 2014 లోనే రాసిన లేఖకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? 2023 వరకు తాత్సారం చేసింది ఎవరు? తప్పు చేసింది మీరైతే మరొకరిని తప్పు పట్టడం దేనికి?

ఆరోపణ: 2015 ఒప్పందంలో తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన 200 టీఎంసీలను కోరలేదు
బీఆర్ఎస్ కౌంటర్: ఎట్లా కోరుతారు? అప్పటికే సెక్షన్ 89 కింద KWDT 2 విచారణ ప్రారంభం అయ్యింది. కోరినా ఇవ్వడం సాధ్యమా? నీటిని కేటాయించడం ట్రిబ్యునల్ పరిధిలోని అంశం. అప్పటికి కృష్ణాలో మన ప్రాజెక్టులు ఏవి కూడా నీటిని వినియోగించుకునే దశకు చేరుకోలేదు. అందుకే ఒక సంవత్సరానికి ఆ ఒప్పందం కుదిరింది. 2016 లో మరొక సంవత్సరానికి పొడిగించాము. 2018 నాటికి కృష్ణా ప్రాజెక్టులు వినియోగంలోకి వచ్చాయి. అప్పటి నుంచి 50 శాతం డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ట్రిబ్యునల్ ముందు 575 టీఎంసీల డిమాండ్‌ను పెట్టడం జరిగింది.

సాగర్ ఆక్రమణ విషయమై MoHA ఆధ్వర్యంలో డిసెంబర్ 1న జరిగిన సమావేశంలో సాగర్ డ్యాంపై నవంబర్ 28 నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని అమలు పరచడంలో KRMB, కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలం అయినాయి. వైఫల్యం వారిది తప్ప రాష్ట్ర ప్రభుత్వానిది కాదు. అదే రోజు KRMB చైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందన లేదు. ఇప్పటికీ సాగర్ పై ఏపీ ఆక్రమణ కొనసాగుతున్నది.