ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీకి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు,హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏపీలో ఆనందాలు వ్యక్తమయ్యాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వెలసిన హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు మంత్రి కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ ఇంద్రకీలాద్రిపై ఏపీ టీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెంటర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రేవు అమ్మాజీరావు పేరుతో వెలసిన ఫ్లెక్సీలపై ‘ జైబోలో.. జై కేసీఆర్’ అంటూ నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.