mt_logo

భగీరథ ప్రయత్నంలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్..

దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసాన్ని చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భగీరథ ప్రయత్నంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టారని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లో రూ. 2వేల కోట్లు కేటాయించిందని గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం ఎల్లూరు రిజర్వాయర్ వద్ద గల రేగుమాన్ గడ్డ సమీపంలో వాటర్ గ్రిడ్ స్థల పరిశీలన చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వీ శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి తదితరులు ఉన్నారు.

వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయబోయే జొన్నబలగూడ ప్రాంతాన్ని, ఎల్లూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. పంపింగ్ హౌస్ లోపలికి దిగి అక్కడి పనులను, ఇంజినీరింగ్ డిజైన్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 15 ఇన్ టేక్ వెల్ ల నిర్మాణాలను ఈ సంవత్సరం మే చివరినాటికి పూర్తి చేయనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే 26 వాటర్ గ్రిడ్ లలో తొలివిడతగా 4 వాటర్ గ్రిడ్ లను ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తిచేస్తామని, ఫిబ్రవరి రెండవ వారంలో నల్లగొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ పైలాన్ ప్రారంభిస్తామని చెప్పారు.

ఎల్లూరు ఇన్ టేక్ వెల్ నిర్మాణానికి మూడేళ్ళకు పైగా సమయం పడుతుందని, ఈలోగా సాగునీటి శాఖ సహాయంతో వాటర్ గ్రిడ్ కు అవసరమైన నీటిని అందిస్తామని, క్రిష్ణానదిలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కోతిగడ్డ వద్ద చేపట్టే ఇన్ టేక్ వెల్ కు నీటిని తరలించి అక్కడినుండి పంపింగ్ ద్వారా జొన్నబలగూడ వద్ద నిర్మించే గ్రిడ్ కు నీటిని తరలిస్తామని కేటీఆర్ వివరించారు. అక్కడినుండి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల వాటర్ గ్రిడ్ లకు నీళ్ళు అందిస్తామని, ప్రజల తాగునీటి అవసరాలు కనీస హక్కుగా భావిస్తూ తాము చేపట్టిన ఈ వాటర్ గ్రిడ్ పథకం విజయవంతం అవుతుందని, ఇప్పటికే ఈ పథకానికి సాగునీటి శాఖ నుండి అన్ని అనుమతులు లభించాయని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను చేపడుతున్న ఆర్ డబ్ల్యూఎస్ శాఖలో కొత్తగా 1232 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *