గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సులిన్ తయారుచేసే ఇన్సుమన్ ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానుంది. శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గురువారం ఉదయం గం.11:30 ని.లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఫ్రెంచ్ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్సులిన్ ను తయారుచేయనున్నారని, దీనిద్వారా వందలమంది స్థానికులకు ఉపాథి అవకాశాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వమే తీసుకోవడం, సింగిల్ విండో విధానం, త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ప్రవేశపెట్టిన టీఎస్- ఐ పాస్ తో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయి కంపెనీ అయిన ఐటీసీ కూడా రాష్ట్రంలో సేవలను మరింత విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న పేపర్ మిల్లును 700 కోట్లతో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 150 కోట్ల రూపాయలతో ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా నెలకొల్పనుందని సమాచారం.