By: ఘంటా చక్రపాణి
కొన్ని కథలు ఎవరు సృష్టిస్తారో, ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు, కానీ బతుకమ్మ మాత్రం తెలంగాణా ఆడబిడ్డల ఆత్మావిష్కరణ వేడుక. దొరలూ పుట్టకముందు, గడీలు కట్టకముందే తెలంగాణలో ఆడబిడ్డలు పుట్టారు. ఆ ఆడబిడ్డల ఆటపాటల వేదికే బతుకమ్మ. నదులు, నీళ్ళు, నాగరికతలు ప్రవహించిన ప్రతినేలలో ప్రకృతిపుష్పిస్తుంది,పులకిస్తుంది. అల్లాంటి నేల తెలంగాణా. ఒక్క సారి తెలంగాణా చిత్రపటాన్ని చూడండి, నది అడుగు జాడ లేని నేల కనిపించదు. కృష్ణా, గోదావరి, మంజీరా, మానేరు, మూసీ ఇలా ఇవన్నీ ఇవాళ మసకబారాయి కానీ అన్నీ ఈ నేలలో జీవం నింపిన నదులే. అసలు నది నడవని జిల్లా నే తెలంగాణలో లేదు. ఆ నదుల వెంటా గుంపులు గుంపులుగా గునుగ పూలు, తంగేడు పొదలు, ప్రతి ఇంటి ముందూ, గుడిసె మీదా బీర పాదులు, తీరొక్క పూలు. ప్రతి ఊరికీ గుండె కాయలా చెరువు. ఈ నెల వచ్చే నాటికి ఆ చెరువు నిండా, ఆ నదులు, వాగుల పొడవునా నీళ్ళు. మట్టిని మిళితం చేసుకుని ప్రవహించే కొత్త నీళ్ళు. జూలై -సెప్టెంబర్ మధ్య కురిసిన వానలు వాగులు, వంకలు, నదులు, చెరువులకే కాదు. ఇక్కడి మట్టికి, చెట్టుకి, చేమకి కూడా ప్రాణం పోస్తాయి. పూవులు పూయిస్తాయి. శాస్త్రం, సాంప్రదాయం తెలియని తెలంగాణా ప్రజలు వాటిని ఎంగిలి పూలని తెంపి వేస్తారు. ఎప్పుడైనా తొలిపూవు ఎంగిలి పూవే! శాస్త్రీయంగా కూడా మొదటి పూలను, కాయల్ని తెంచి వేస్తేనే మళ్ళీ ఆ చెట్టు ఫలిస్తుంది. . ఆ ఎంగిలి పూలను బతుకమ్మలో పేర్చి నదిలోనో, వాగులోనో, చెరువులోనో వదిలేస్తారు. అది బతుకమ్మ పండగలో ఒక భాగం. అలా తొలి పూవుల్ని వాటికి ప్రాణం పోసిన నీటిలో వదిలి తమ తల్లిదండ్రులకు పంటలకు కొదువ లేకుండా చూడమని ఆ నదీమతల్లినో, చెరువునొ వేడుకుంటారు, కోరుకుంటారు. ఇలాంటి పండగలు, దేవతలు, దెయ్యాలు, మతాలు పుట్టక ముందునుంచే ఉన్నాయని. సమాజ-మానవ శాస్త్ర ప్రరిశోధనలు చెపుతున్నాయి. ఇవి ఫెస్టివల్స్ అఫ్ రివర్స్ గా, ఫెస్టివల్స్ అఫ్ ఫ్లవర్స్ అన్ని ప్రాచీన సమాజాల్లో, నదీలోయ నాగరికతల్లో కనిపిస్తాయి.
అయితే ఎ సమాజంలోనయినా సరే ప్రజలు, వారి ఆచరణ, జీవన విధానం, అందులోంచి సంస్కృతి నాగరికతలే ముందు పుడుతాయి. అందులోంచే ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు, మతలబులు వస్తాయి. ఏ విశ్వాసం బలంగా ప్రజల్లోఉంటే అదే బలమైన సాంప్రదాయిక ఆచారమై, విలువై వెలుస్తుంది. మతం దాన్నొక తలమానికంగా కొలుస్తుంది. బతుకమ్మ మొదట జీవితమై, ఆ తరువాత, ఆచారమై ‘ఆధునిక’ హిందూ మతవిలువలు సంతరించుకున్న సాంప్రదాయం అయ్యింది. బొడ్డెమ్మ గౌరమ్మ, గౌరీ దేవి అయ్యింది. ప్రతి పండగలాగే ఇది పతివ్రతల వ్రతంగా కొన్ని కులాల్లో కొందరు పండితులు కొత్తకతలు సృష్టించారు. దాన్నొక ఆచారంగా మార్చివెశారు. కానీ తెలంగాణా ఆడపడుచులకు మాత్రం అదొక ఆట విడిది. తబ బాధల్ని, గాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని కలబోసుకుని పంచుకునే వేదిక. ఇప్పుడు వినిపిస్తోన్న “బంగారు బతుకమ్మ” పాటల్లో ఆటలున్నాయి గానీ ఒకప్పుడు బతుకమ్మ బతుకులోని వెతలను వ్యక్తం చేసుకుని గుండెను తేట పరుచుకునే రంగస్థలి. ప్రతి ఆడబిడ్డ కన్నవారి కష్టాలను, అన్నదమ్ముల ఆప్యాయతను, అత్తవారింటి అనుభవాలను, భర్తలు, బావలు, మరుదుల పెత్తనం పెట్టె బాధలను, తమతో పాటు తోటికొడల్ల వేదనను ఆలపించి, విలపించి, పదిమందికీ వినిపించి పరిష్కారాలు వెతుక్కోవడానికి వాళ్లకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విశాల వేదిక. స్త్రీలకు ఇలాంటి వేదికలు అరుదు. హిందూ మత చట్రంలో బందీగా ఉన్న స్త్రీలకు ఇది అసాధ్యం. కానీ తెలంగాణా లో మాత్రం ఇది తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ తొమ్మిది రోజులు ప్రతి ఉదయం తండ్రులు, అన్నలు, తమ్ములు తమ ఆడబిద్దలకోసం పూలు కోసుకు వస్తారు, బతుకమ్మను పేర్చి వారి చేతికి అందించి వెళ్లి ఆదుకుని రమ్మని పంపిస్తారు. ఆ స్వేచ్చ ఒక్క బతుకమ్మలోనే కనిపిస్తుంది. స్వేచ్చను కల్పించేది ఆచారం అయితే మాత్రం తప్పేముంది?
నిజమే నిజాముల కాలంలో బతుకమ్మను అక్కడక్కడా దొరలువారికొక వేడుకగా వాడుకున్నారు. ఆడించారు. అది ఒక ఫ్యూడల్ దుస్సాప్రదాయం గా కొన్ని చోట్ల కొద్ది రోజులు సాగింది. అంతమాత్రాన అదే సాంప్రదాయం కాదు! దొరల ముందు తమను ఏలుకొమ్మని స్త్రీలు ఆడిన ఆటగా దీన్ని ఎవరు చెప్పారో గానీ వారికి అవగాహన లేక గానీ ఇతరుల సంస్కృతి పట్ల చులకన భావంతో గానీ లేక మితిమీరిన ఆదిపత్య భావజాలం వల్లగానీ అలా చెప్పి ఉంటారు. మీలాంటి వాళ్ళు అది నిజమేనేమోనని నమ్మితే ఎలా? మాకు మాత్రం బతుకమ్మను చూసినప్పుడల్లా మా అక్కా చెల్లెళ్ళు, వాళ్ళ ఆలాపనలే గుర్తుకు వస్తాయి!!