mt_logo

కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు: మాజీ డీజీపీ దినేశ్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ ఏర్పాటుపై జూలై 30 న స్పష్టమైన ప్రకటన రావడంతో సీమాంధ్ర లో పరిస్థితులు దిగజారుతాయని భావించి 40 కంపెనీల పారా మిలిటరీ దళాలను రప్పించినట్లు దినేష్ రెడ్డి చెప్పారు. ఐతే ఇది సీ ఎం కు నచ్చలేదని, ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరంటూ మండిపడ్డారని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నువ్వెలా ఊహిస్తావు? అంటూ మాట్లాడారని దినేష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పెరుగుతారా? అంటూ ఢిల్లీ లో మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించినపుడు అదంతా ఊహాజనితమేనని తాను చెప్పాననీ, సీ ఎం మాత్రం తెలంగాణ ఇస్తే మావోయిస్టుల సమస్య తీవ్రతరమవుతుందని అన్నారన్నారు. నేను వాస్తవాలు మాట్లాడడంతో నన్ను పిలిపించుకుని తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు పెరిగిపోతారని చెప్పాల్సిందిగా ఒత్తిడి తీసుకు వచ్చారని చెప్పారు. కానీ నేను దీనికి అంగీకరించలేదు అని వివరించారు.

ఇంతేకాకుండా సెప్టెంబర్ 7 న హైదరాబాద్ లో ఏపీ ఎన్ జీవోల సభకు అనుమతి ఇవ్వాలంటూ కిరణ్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదన్నారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు కూడా అనుమతి ఇవ్వాలని సీ ఎం తనతో చెప్పారన్నారు.

జూలై 30 న తెలంగాణ ఏర్పాటుపై సీ డబ్లూ సీ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారని దినేష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ఆడమన్నట్టు ఆడలేదు కాబట్టే తనను పదవి నుంచి తొలగించారని వాపోయారు. పోస్టులో వుండి మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుందని , అందుకే పదవీ విరమణ తర్వాత మాట్లాడుతున్నానని చెప్పారు.

సీ ఎం సోదరుడు సంతోష్ రెడ్డి భూకబ్జాలకు బ్యాక్ ఆఫీస్ లా పని చేస్తున్నాడని ఆరోపించారు. తాను మాత్రం ఆయన భూ కబ్జాలకు సహకరించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నట్టు ఆయన వివరించారు.

సీ ఎం పై మీరు ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో ఆయన మీ పై కేసులు పెడితే ? అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ .. ‘అధికారం బాపకా జాగీర్ కాదు ‘ అన్నారు. ‘ నాకుండాల్సింది నాకుంది నేను చేయాల్సింది చేస్తా ‘ అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలనే చెబుతున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *