కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా.. అన్నారం బ్యారేజీ వద్ద ఉన్న సిరిపురం పంపుహౌస్‌లోని రెండో మోటార్‌ను అధికారులు మంగళవారం విజయవంతంగా నడిపారు. ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదలతో పంపుహౌస్ పూర్తిగా నీటమునిగి అందులోని పలు పరికరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాంతో మోటార్లలోని విడిభాగాలన్నింటినీ విప్పిన అధికారులు, వాటిని అరబెట్టారు. ఇక కాళేశ్వరంలో అదనపు టీఎంసీ కోసం తెప్పించి… ఇంకా అమర్చని పరికరాలను వాడుకుని, మంగళవారం రెండో మోటార్‌ను విజయవంతంగా నడిపారు. కాగా ఈ నెల 8న తొలి మోటార్‌ను విజయవంతంగా నడిపిన అధికారులు, నీటిని సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోశారు. పదిరోజుల వ్యవధిలోనే రెండో మోటార్‌ను కూడా రన్ చేయడం గమనార్హం.
వరదల వలన కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం (అన్నారం)లో మోటార్లు నీటమునిగాయి. అన్నారంలో ప్యానల్ బోర్డు, స్విచ్డ్‌గేర్ పరికరాలకు మాత్రమే నష్టం జరిగింది. ఇక మొత్తం మోటార్లలో నాలుగింటిని తొలి దశలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన రెండు మోటార్లను కూడా ప్రతీ 10 రోజుల విరామం అనంతరం నడిపించనున్నారు.