mt_logo

కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు

By: బి. హరిరాం, ఇంజనీర్-ఇన్-చీఫ్, కాళేశ్వరం ప్రాజెక్టు,
శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖా మంత్రి ఓఎస్డి

26 ఆగస్టున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వారు “కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకం – రీ ఇంజనీరింగ్ – భారీ ఇంజనీరింగ్ తప్పిదం” శీర్షికన అయిదు నక్షత్రాల తాజ్ దక్కన్ హోటల్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. జెఎసి తరపున రఘు ప్రజెంటేషన్ చేసాడు. ఇందులో వారు లేవనెత్తిన అంశాలు రెండు. 1) కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తు నుండి కిందకి ప్రవహించిన నీటిని త్రిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోస్తారు. 2) నీటి లభ్యతపై cwc పేర్కొన్న అంశాలను తప్పుగా అన్వయించి ప్రాజెక్టుని తుమ్మిడి హట్టి నుంచి మేడి గడ్డకు మార్చారని ఆరోపణ.

ఈ రెండు అంశాలని విశ్లేషించడంలో రఘు పూర్తిగా తప్పులో కాలేసాడు. కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయినాడు. ఏంతో శ్రమకోర్చి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందని నిరూపించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడినాడు. హైడ్రాలజిలో తన ప్రాథమిక అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేలుతున్నది. నవంబరు 2016 లో వీరే తాజ్ దక్కన్ లో విడుదల చేసిన Kaleshwaram Lift Irrigation Project – Will it benefit Telangana State? అన్న పుస్తకంలో నీటి లభ్యతపై శాస్త్రీయమైన అధ్యయనం చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఒక సమస్యే కాదని తేల్చారు. ఇప్పుడేమో ఈ రకంగా యు టర్న్ తీసుకున్నారు. రఘు ఏ రకంగా తప్పుడు విశ్లేషణ చేసిండో ఇప్పుడు చూద్దాం.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తునుండి కిందకి ప్రవహించిన నీటినే తిరిగి పైకి అదే ప్రాంతానికి ఎత్తిపోస్తారు అని రఘు విశ్లేశిస్తున్నాడు. ఈ తప్పుడు అవగాహనపై ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూప స్వభావాలపై ఏ మాత్రం అవగాహన లేని విశ్లేషణ ఇది. ప్రాజెక్టును రూప కల్పన చేసిన ఇంజనీర్ల విజ్ఞతపై పరిహాసం చేసినాడు, దేశంలో నీటి ప్రాజెక్టులను ఆమోదించే అత్యున్నత సంస్థ అయిన కేంద్ర జల సంఘం సామర్థ్యాన్ని శంకించే సాహాసం చేసినాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మూడు మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశాలు కాళేశ్వరం సిస్టంలో ఉన్నది. మొదటిది శ్రీరాంసాగర్ కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళతాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డకు వెళతాయి. ఆ తర్వాత తుపాకుల గూడెం ద్వారా పోలవరానికి వెళతాయి. శ్రీరాంసాగర్ కు కనీసం మూడేండ్లకు ఒకసారి అయినా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలుస్తున్నది. శ్రీరాంసాగర్ కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు (మేడి గడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్ 2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు) తిప్పే అవసరం రాదు. ఇక రెండో స్థితి శ్రీరాంసాగర్ కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్ ఎల్లంపల్లికి మధ్యన ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని ఈ సంవత్సరం మనం చూసాము. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్ 2 పంపులు తిప్పి నీటిని మిడ్ మానేరుకు చేరవేయడం, అక్కడి నుంచి ఎగువకు కొండ పోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరు – కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ రెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్ 1, లింక్ 2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. పై నుంచి నీటిని కిందకి పోనిచ్చి మళ్ళీ పైకి అదే ప్రదేశానికి ఎత్తిపోసే స్థితి ఎక్కడ ఉన్నది? పైన నీళ్ళు ఉన్నప్పుడు పై నుంచే వాడుకోవడం జరుగుతుంది తప్ప ఈ నీళ్ళను కిందకి పోనిచ్చి మళ్ళీ పైకి ఎత్తిపోసే మూర్ఖపు పని మన ఇంజనీర్లు చేస్తారని సివిల్ ఇంజనీర్ అయిన రఘు ఎట్లా ఊహించగలిగినాడు?

ఇకపోతే నీటి లభ్యతపై CWC పేర్కొన్న అంశాలను తప్పుగా అన్వయించినారు అన్నది మరో ఆరోపణ. తొలుత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పంపిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిపిఆర్ ని కేంద్ర జల సంఘం లోని హైడ్రాలజి డైరేక్టోరేట్ వారు పరిశీలించి తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యతపై తమ పరిశీలనలను, సూచనలను చేసినారు. 4.3.2015 న ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు CWC రాసిన లేఖలో తుమ్మిడిహట్టి వద్ద నికరంగా లభ్యమయ్యే నీరు (75% విశ్వసతనీయత) 165 tmc లని పేర్కొంటూనే అందులో పై రాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకునే 63 tmc లు కలిసి ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నది. ఈ మాటలు రాస్తూ ప్రాజెక్టు అధికారులకు తుమ్మిడి హట్టి వద్ద తరలించగలిగే నీటి పరిమాణాన్ని పున: పరిశీలించమని సూచన చేసింది. ఈ 63 tmc లు ఇప్పుడు కిందకి వస్తున్నాయి భవిష్యత్తులో రాకపోవచ్చు, తుమ్మిడి హట్టి వద్ద లభ్యమయ్యే నీటి పరిమాణం తగ్గిపోతుందన్న సూచన అందులో ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో నికరంగా లభ్యమయ్యే నీరు 165 – 63 = 102 tmc లని స్పష్టం అవుతున్నది. ఇందులో పర్యావరణ ప్రవాహాలు 25 % తీసివేస్తే మిగిలేవి 80 tmc లు. ఇది తుమ్మిడి హట్టి బ్యారేజిని 152 మీ FRL వద్ద నిర్మించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మహారాష్ట్రా 148 మీ కంటే ఒక్క ఇంచు ఎక్కువకు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని అనేక సందర్భాల్లో ప్రకటించింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమతో సంప్రదించకుండా, తమ అంగీకారం లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టు కంట్రోల్ లెవెల్స్, ఇతర సాంకేతిక అంశాలను నిర్ధారించుకొని ముందుకు సాగుతున్నదని, ఈ ఖర్చు అంతా వృధా అవుతుందని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఘాటైన లేఖ రాసిన సంగతి అందరికి ఎరుకే. మహారాష్ట్రాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు పలు మార్లు ముంబాయి వెళ్లి తుమ్మిడి హట్టి బ్యారేజి FRL పై మహారాష్ట్రాను ఒప్పించే ప్రయత్నం చేసినారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా 17 ఫిబ్రవరి 2015 ముంబాయి వెళ్లి మహారాష్ట్రా ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ని కలిసినారు. ఆ ప్రయత్నమూ విఫలమయ్యింది. 4.3.2015 న తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యతనే లేదని CWC లేఖ రాసిన తర్వాత ఇక మహారాష్ట్రాతో FRL, ముంపు పంచాయతీ పరిష్కారం అయినా కూడా ప్రాజెక్టు సాఫల్యతకు అవసరమైన నీటి లభ్యతనే ప్రశ్నార్థకం అయినప్పుడు ప్రభుత్వం ఏమి చెయ్యాలి? ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది. ఆ వెతుకులాటలో దొరికిందే మేడి గడ్డ. ఇది 1990వ దశకంలో గోదావరి జలాల వినియోగంపై దివంగత ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ టి. హనుమంతరావు గారు ప్రతిపాదించిన ఏడు వరుస బ్యారేజిల్లో ఒకటైన సూరారం బ్యారేజి స్థలమే. ఇకపొతే మేడి గడ్డ వద్ద నీటి లభ్యత వాస్తవ లభ్యత కంటే చాలా ఎక్కువ చేసి చూపించారని రఘు ఆరోపణ. ఇది ఉద్దేశ్యపూర్వకమైనదని ఆయన అభిప్రాయం. ఆయన చర్చకు తీసుకున్న డాక్యుమెంట్ కాళేశ్వరం DPR. అయితే చర్చకు ప్రామాణికం కావలసింది CWC వారు 30.10.2017 ఇచ్చిన హైడ్రాలజి అనుమతి పత్రం. DPR లో ప్రభుత్వాలు రాసిన అంశాలని, చేసిన లెక్కలను CWC తిరస్కరించిన దాఖాలాలు అనేకం. ఉదాహరణకు ప్రాణహిత చేవెళ్ళలో మనం ప్రతిపాదించిన 273 tmc ల నీటి లభ్యతని తిరస్కరిచి 165 tmc లని లెక్క తేల్చిన సంగతి పైన చెప్పుకున్నాము. కాబట్టి రఘు ఈ చర్చకు ప్రామాణికంగా తీసుకోవాల్సినది DPR కాదు CWC వారి హైడ్రాలజి అనుమతి పత్రం. సరే DPR నే పరిగణనలోనికి తీసుకున్నా రఘు ఎ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడో విశ్లేషిద్దాము. ఇది ఉద్దేశ్యపూరితంగా చేసినది కాదు అది ఆయన అవగాహనారాహిత్యంతో చేసినదే. అయన ఇందుకు సాక్ష్యంగా DPR వాల్యూం 1, పేరా 1.3 (a), వాల్యూం 2, పేరా 3.3.1 ఉటంకించినాడు. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత తక్కువ చేసి మేడి గడ్డ వద్ద ఎక్కువ చేసి చూపించారని నిరూపించడానికి వీటిని సాక్ష్యాలుగా ఉపయోగించినాడు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 415 tmc లు గా చూపించడం అశాస్త్రీయం అంటున్నాడు. తుమ్మిడిహట్టి వద్ద కన్నా మేడిగడ్డ వద్ద అదనంగా 250 tmc ఎక్కువ నీరుందని DPR లో ఉద్దేశ్యపూరితంగానే చూపించారని ఆరోపిస్తున్నాడు. ఇంత నీరు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాడు. రఘు పేర్కొన్న DPR రెండు పేరాల్లో కూడా స్పష్టాతిస్పష్టంగా మేడిగడ్డ వద్ద నికరంగా లభ్యమయ్యే నేరు 282.3 tmc లనే రాసి ఉన్నది తప్ప 415 tmc లని చెప్పలేదు. ఏదైనా ప్రాజెక్టు వద్ద హైడ్రాలజిని (నీటి లభ్యతను) లెక్కగట్టేటప్పుడు మొదట unintercepted catchment అంటే ఏ అడ్డంకులు లేని పరివాహక ప్రాంతం ద్వారా వచ్చే నీటిని లెక్క గడతారు. అందులో నుంచి అప్పటికే పైన పూర్తి అయిన ప్రాజెక్టుల వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల వినియోగం తీసివేసి నికరంగా లభ్యమయ్యే జలాలను నిర్ధారిస్తారు. రఘు ఉటంకించిన DPR వాల్యూం 2, పేరా 3.3.1 లో ప్రాణహిత, మానేరు, మధ్య గోదావరి సబ్ బెసిన్ల unintercepted catchement నుంచి వచ్చే నీరు 415 tmc లని లెక్క గట్టిన మాట వాస్తవమే. ఆ వెంటనే మానేరు, మధ్య గోదావరి సబ్ బేసిన్లలో అప్పటికే ఉపయోగంలో ఉన్న నీరు 132.2 tmc లను తీసి వేసి మేడిగడ్డ వద్ద నికరంగా లభ్యమయ్యే నీరు 282.3 tmc లని తేల్చింది. దానికే మనం CWC నుంచి అనుమతిని కోరినాము. (అయితే cwc మాత్రం 284.3 tmc లకు హైడ్రాలజి అనుమతినిచ్చింది). ఈ అంశం ఆయన కూడా గుర్తించాడు. కాని మేడిగడ్డ వద్ద తుమ్మిడిహట్టి వద్ద కన్నా లభ్యమయ్యే అదనపు జలాలను లెక్క గట్టేటప్పుడు ఆయన 415 (మేడిగడ్డ) -165 (తుమ్మిడిహట్టి) = 250 tmc లని చెప్పి ఇన్ని నీళ్ళు ఎక్కడివి అని ప్రశ్నిస్తాడు. ఇది అవగాహనారాహిత్యం. సివిల్ ఇంజనీర్ గా బాధ్యతారాహిత్యం అవుతుంది. మేడిగడ్డ వద్ద అదనంగా లభ్యమయ్యే జలాలు ఎన్ని? 284.3-165 = 119.30 tmc లు. ఇదే విషయాన్ని అనేక సార్లు వెల్లడించినాము తప్ప మేడి గడ్డ వద్ద లేని నీరు ఉన్నదని ప్రభుత్వం గాని, వాప్కోస్ సంస్థ గాని, CWC గాని ఎవరూ చెప్పలేదు. అది రఘు మెదడులో నుంచి పుట్టిన చిత్త భ్రమ మాత్రమే. దాన్ని చరిత్రలో అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదమని మనలని భ్రమింపజేద్దామని ఆశపడుతున్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు CWC హైడ్రాలజి అనుమతి పత్రాన్ని 30 అక్టోబర్ 2017 న పంపింది. ఇది రహాస్య పత్రం కాదు. CWC వారి వెబ్ సైట్లో కూడా చూడవచ్చు. ఈ పత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఈ పత్రం ఆధారంగానే నీటి లభ్యతపై చర్చించాలి తప్ప DPR ని ఆధారం చేసుకుని కాదు. (DPR తప్పు అని ఒప్పుకున్నట్టు దబాయిస్తాడు కాబోలు) ఇంతకూ ముందు చెప్పుకున్నట్టు ప్రభుత్వాలు సమర్పించిన DPR లని CWC యధాథతంగా ఆమోదించదు. వారికి మన వద్ద కంటే కూడా అదనపు సమాచారం, హైడ్రాలజి అంశాలని విశ్లేషించే టూల్స్ ఉంటాయి కనుక తప్పనిసరిగా మన DPR లు నిశితమైన పరిశీలనకు గురి అవుతాయి. అనేక సార్లు వారి అనుమానాలను, ప్రశ్నలను నివృత్తి చేసిన తర్వాత, వారు సంతృప్తి చెందితే అప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. అప్పుడు కూడా మనం అనుకున్నట్టు అనుమతులు రాకపోవచ్చు. అందుకు ప్రాణహిత చేవెళ్ళకు CWC ఇచ్చిన 165 tmc ల అనుమతి పత్రమే దృష్టాంతం. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే రఘు చర్చకు తీసుకున్న ప్రాతిపదిక లోపభూయిష్టమైనది. CWC వారి హైడ్రాలజి అనుమతి రాకన్న ముందు ఈ చర్చDPR ఆధారంగా జరిగినా కూడా రఘుది తప్పుడు విశ్లేషణే. హైడ్రాలజి అనుమతి వచ్చిన తర్వాత ఇక చర్చ DPR మీద చేయడం ఉద్దేశ్యపూర్వకం తప్ప శాస్త్రీయం కాదు.

CWC వారి అనుమతి పత్రంలో మూడు అంశాలను పేర్కోన్నారు. మొదటిది ప్రాజెక్టు ప్రతిపాదనలు, రెండు DPR లో ప్రాజెక్టు వద్ద నీటి లభ్యతను లెక్క గట్టిన పద్దతి, మూడు తమ పరిశీలనలు నిర్ధారణలు. DPR ప్రకారం మేడి గడ్డ వద్ద నికరంగా లభ్యమయ్యే నీరు 282.3 tmc లని CWC సరిగ్గానే రికార్డు చేసింది. రఘుకి మాత్రం 415 tmc లు కనిపించాయి. (కంటి వెలుగు పథకాన్ని వినియోగించుకోవాలని మిత్రుడికి మా సూచన) CWC వారు మేడి గడ్డ వద్ద లభ్యమయ్యే నీటిని లెక్క గట్టేటప్పుడు ప్రాణహిత సబ్ బేసిన్ నుంచి (G9), పెన్ గంగ సబ్ బేసిన్ నుంచి (G7) వచ్చే జలాలను మాత్రమే పరిగణన లోనికి తీసుకున్నారు. వార్ధా (G8), మానేరు (G6), మధ్య గోదావరి (G5) సబ్ బేసిన్లలో ఎటువంటి అదనపు జలాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ప్రాణహిత, పెన్గంగ సబ్ బెసిన్ల నుంచి పైన అన్ని రకాల వినియోగాలు పోనూ మేడి గడ్డ వద్ద లభ్యమయ్యే నీరు 284.3 tmc లని నిర్ధారించారు. ఈ లెక్కలకు వారు 1971-72 నుంచి 2011-12 వరకు yield series ని ప్రాతిపదికగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. (తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యతను లెక్క గట్టి నప్పుడు కూడా CWC ఇవే yield series ప్రాతిపదికగా తీసుకున్నారు). ఈ నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఈ హైడ్రాలజి అనుమతి ఆధారంగానే ప్రాజెక్టులో అన్ని రకాల వినియోగాలకు 237 tmc లకు కూడా CWC ఆమోదం ఇచ్చింది. ఇక రఘు ప్రవచించినట్టు మేడిగడ్డ వద్ద లేని నీళ్ళను ఎక్కువ చేసి చూపింది ఎక్కడ? తుమ్మిడి హట్టి వద్ద ఉన్న నీళ్ళను లేవని చెప్పింది ఎక్కడ? ఎవరిని మభ్య పెట్టాలని, ఎవరిని సంతృప్తి పరచాలని రఘు ప్రయత్నం? తన అవగాహనారాహిత్యంతో తప్పుడు విశ్లేషణలు చేసి తాను ఎదో భారీ ఇంజనీరింగ్ తప్పిదాన్ని కనుగొన్నానని భ్రమ పడుతున్నాడు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టును కీర్తిస్తున్న ప్రముఖులను ఎద్దేవా చేసినాడు. వ్యాసం మొదట్లో చెప్పినట్టు రఘు చాల శ్రమపడి ఎదో పట్టుకుందామని కాళేశ్వరం కొండను తవ్వాడు. ఆఖరుకు ఎలుకను కూడా పట్టలేకపోయినాడు. హైడ్రాలజి అంశంలో తన పరిజ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను బట్టబయలు చేసుకున్నాడు. ఈ ప్రెజెంటేషన్ ద్వారా సహచర సివిల్ ఇంజనీర్లను దారుణంగా పరిహసించిన రఘు మేధో అహంకారాన్ని ఈ సందర్భంగా నిరసిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *