mt_logo

అఖిలపక్షంలో తేలుస్తారా?

– మాడభూషి శ్రీధర్

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిలపక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అందరూ ఏదో జరుగుతుందని ఎదురుచూస్తున్న రోజు. డిసెంబర్ 9 వలె చరిత్ర సృష్టిస్తుందా లేక డిసెంబర్ 23 వలె మరో విద్రోహ దినంగా నిలిచిపోతుందా? మూడు ప్రమాదాలున్నాయి. అవి. 1. ఢిల్లీ పట్టించుకోదు. 2. నిత్యనూతనమైన మోసాలకు కొందరు కోస్తా నేతలు వెనుకాడరు. 3. తెలంగాణ నుంచి విభిన్న రాజకీయపార్టీల్లో ఉన్న వారు పదవులు, వాటి మీద ఆశలు వదిలేసి రారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వారి మీద తెలంగాణ వారితోనే దుమ్మెత్తి పోయించే నిందా రాజకీయాలను కోస్తానేతల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలు వదలడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28 నాడు ఏంజరుగుతుంది. తర్వాత ఏమవుతుంది?

ఢిల్లీ పాలకులకు తెలంగాణ అసలు పట్టదు. 1947-48లో తెలంగాణ రజాకార్ల హత్యలు, మానభంగాలతో రగిలిపోతుంటే ఢిల్లీ సుల్తాన్లు 13నెలలు మౌనంగా ఉన్నారు. 1955-56లో మొత్తం తెలంగాణ విలీనం వద్దంటే మనకేం అన్నట్టు తెలంగాణకు విషాదాంధ్ర విశాలాంధ్రను సృష్టించారు. 1969లో 369 మందిని నిరంకుశ కోస్తాంధ్ర సర్కారు ఊచకోత కోస్తే ఢిల్లీ తెలంగాణ ఉద్యమ ద్రోహనేతలను టోకున కొనేసే కర్కశ వ్యాపారి వలె వ్యవహరించింది. 2009 నుంచి ఇప్పటి వరకు 800మందికి పైగా హతులై తెలంగాణ శాంతియుత ఉద్యమంలో రగిలి నలిగిపోతూ ఉంటే కోస్తాంధ్ర లాబీయింగ్ పైరవీలలో మునిగితేలుతూ నీరో చక్రవర్తివలె వినోదాలు చేసుకుంటున్నది ఢిల్లీ. హస్తిన పాలకులకే కాదు పౌరులకు కూడా తెలంగాణ పట్టదు. సమస్య లోతుపాతులు కూడా తెలియవు. విచిత్రమేమంటే దాదాపు ఎనిమిది వందలమంది విడి రాష్ట్రం కోరి ఆత్మహత్య చేసుకుంటే దానిగురించి కనీసం చర్చించాలని కూడా అనుకోరు. తెలంగాణకు ఢిల్లీ ఎంతదూరమో ప్రజలకు కూడా అంతే దూరంగా ఉన్నది.

జనాన్ని పట్టించుకోరు. మేధావులు చర్చించాలా వద్దా అని చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ నాయకత్వం వహిస్తున్న పార్టీ కనుక తెలంగాణ గురించి ఆలోచించక తప్పదు. కానీ చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే ఎవరికెంత లాభం, లాబీయింగ్ కోసం కేటాయించిన సొమ్ములు ఎంత లాభం ఎవరికి దక్కుతుందోఅని ఆలోచించి దక్కితేనే పనిచేసే నేతల సంఖ్య ఎక్కువవుతున్న రోజుల్లో 800 మంది ప్రాణాలు తీసుకుంటే ఎవరికేమి లెక్క?

ఇటీవల ఢిల్లీలో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వేదిక మీద తెలంగాణ సమస్యను చర్చకు పెడితే, వ్యతిరేకవాదులు రాలేదు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అసలీ విషయమే చర్చించవద్దని నిరసన లేఖ ప్రతులను ఆ సభలో పంచారు. అందరికీ పంపిన సభ నేపథ్య పత్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉందని అది తమకు సమ్మతం కాదని సమైక్యాంధ్ర జేఏసీ పేరుమీద ఇద్దరు సంతకం చేసిన ఈ లేఖలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ ఆర్థిక వెనుకబాటుతనం అనే మిథ్యను తుంచేసిందని, అసలు సభలో పంచిన పత్రం అబద్ధమని 1969లో మరణాల సంఖ్య కూడా అసత్యమని రాస్తూ… ముందే తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నారనే సాకుతో సభలో పాల్గొనబోమని అందులో రాశారు. కనీసం తెలంగాణ సమస్య గురించి ప్రస్తావన ఉండకూడదని దాని పైన చర్చ ప్రారంభం కూడా కాకూడదని చేసే ప్రయత్నం ఇది. ఆ లేఖ ప్రతులు బల్ల మీద పెట్టి వెళ్లిపోయారు. అక్కడ ఆ లేఖ గురించి మాట్లాడడానికి ఎవరూ లేరు. ఇదొక అప్రజాస్వామిక ఎత్తుగడ. సరిగ్గా ఈ దుర్మార్గం మీదనే తెలంగాణ పోరాడవలసి ఉంది. తెలంగాణవాదాన్ని వినిపించడానికి వచ్చిన వారు వినడానికి వచ్చిన వారే మిగిలారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను రచించిన మాజీ హోం సెక్రెటరీ వి.కె. దుగ్గల్ ఆలస్యంగా వచ్చి అక్కడ కోస్తాంధ్రకు ప్రాతినిధ్యం వహించడం ఒక విచిత్ర సత్యం. రాజకీయపార్టీల స్వార్థపూరిత, కోస్తాంధ్ర కాంట్రాక్టు రాజకీయుల లాబీయింగ్ దుష్ర్పభావ పూరితమై అసత్య అసందిగ్ధ పరస్పర వ్యతిరేక అర్థ సత్యాలతో కూడిన ఆ నివేదిక నెత్తిన పెట్టుకుని మోయడానికి తెలంగాణ వ్యతిరేకులకు ఒక పరికరంగా మారిపోయింది. హోంశాఖలో ఒక లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రజాఉద్యమాన్ని ఏ విధంగా లాఠీలతో అణచివేయాలో కుయుక్తులతో సహా వివరించిన దారుణమైన చీకటి ఎనిమిదో అధ్యాయం చాలు ఈ నివేదికకు ఒక్క క్షణం కూడా నిలబడే విలువ లేనిదని చెప్పడానికి.

ఆ చీకటి నివేదిక చూపుతూ ప్రముఖ సామాజికశాస్త్ర ఆచార్యుడు యోగేంద్ర యాదవ్ శ్రీకృష్ణ కమిటీ సెక్రెటరీ దుగ్గల్‌ను ఒక ప్రశ్న అడిగాడు. ఈ రహస్యభాగం నివేదికలో భాగమేనా? అని. భద్రతా కారణాల దృష్ట్యా కొంత భాగం రహస్యంగా ఉంచడం మామూలేనని ఆయన తడబడుతూ జవాబిచ్చాడు. పక్కనే ఉన్న శ్రీరాం వెదిరె ఆ నివేదిక రాసింది ఈ దుగ్గలే అని ప్రకటించగానే సభంతా గొల్లున నవ్వింది. ఈ ఎనిమిదో అధ్యాయం చదివిన తరువాత ఇక మొత్తం నివేదిక చూడవలసిన అవసరమే లేదని యోగేంద్ర యాదవ్ ఒక్కముక్కలో తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులు సభలో లేకపోయినా, పాతుకుపోయిన ఈ తెలంగాణ వ్యతిరేకత గురించి ఢిల్లీలో ఇన్నాళ్లూ ఎవరికీ అర్థం కాలేదన్న విషయం తెలిసొచ్చింది. తెలంగాణ ఒక గుర్తింపు కోసం పోరాడుతున్నదని, తమ సంస్కృతిపైన, భాషపైన జరుగుతున్న దాడిని అవమానాలను ఎదిరిస్తున్నదని, ఇన్నాళ్లుగా సాగుతున్న ఉద్యమాన్ని, వందలాదిమంది ఆత్మాహుతిని తక్కువచేసి చూస్తూ, కించపరుస్తున్నారని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వివరించారు.

మేధావులు మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు అందుకోసం డిమాండ్ లేదు, దానికీ వ్యతిరేకతా లేదు. ఉత్తరాఖండ్ కోసం మాత్రం పెద్ద ఉద్యమమే సాగింది. కాని వద్దన్న వారులేరు. ముజఫ్ఫర్‌పూర్ కోసం కొంత వివాదం వచ్చినా వేరే రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు. జార్ఖండ్ ఏర్పడిన నాటికి ఆ ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన ప్రాంతాల వారు పోతే పోయిందిలే అనుకున్నారు. లాలూ యాదవ్ మొదట్లో కాదన్నా, పోవడమే మంచిదన్నట్టు వ్యవహరించారు. కాని తెలంగాణ విషయం వచ్చే సరికి ఒకవైపు జోరైన ప్రత్యేక ఉద్యమం, మరోవైపు చర్చించడానికి కూడా ముందుకురాని వ్యతిరేకులు. మేమివ్వమనీ, మాతోనే కలిసి ఉండాలనీ మొండివాదమే గాని ఎందుకు విడిపోతామంటున్నారని అడిగేవారు లేరంటే ఢిల్లీ మేధావులు ఆశ్చర్యపోయారు. అన్యాయాలు తీరుస్తామనకపోగా అసలు అన్యాయమే జరగలేదని దొంగ రిపోర్టులిప్పించుకోవడం, దానికోసం క్షణాల్లో కోట్ల రూపాయలు సేకరించి, చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐ కోసం వాల్‌మార్ట్ తరహాలో లాబీయింగ్‌కు ఖర్చు పెట్టడం జరుగుతున్నదని వారికి ఎవరు చెప్పగలరు?

వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎవరితో పొత్తు పెట్టుకుంటే మంచిదో చూస్తారే కాని తెలంగాణ వెనుబడిందంటే ఎవరికి పట్టింది? మొత్తం రాష్ట్ర పన్నుల ఆదాయంలో తెలంగాణ నుంచి మూడొంతులు వస్తుంది. కానీ 20 శాతం కూడా ఇక్కడ అభివృధ్ధికి వెచ్చించరు. నీళ్లు, నిధులు మళ్లిస్తున్నారు. ఉద్యోగాల్లో, చదువుల్లో తెలంగాణ వారికి కనీసం స్థానాలు కూడా దక్కనీయడం లేదు. హైదరాబాద్ రాజధాని కనుక వచ్చామని సమర్థించుకునే వారు, చుట్టుపక్కల జిల్లాలలో ఇతర జిల్లాలలో కూడా భూములు ఉద్యోగాలు తెలంగాణ వారికి ఎందుకు మిగలడం లేదో చెప్పరు.

ఉద్యమాలు ఉద్వేగంతో సాగుతూ ఉంటే కేవలం పదిబస్సులు పగలగొడితే ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా అంటూ కాంట్రాక్టర్ ఎంపీలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. డబ్బు తప్ప వారికి దేశం అవసరం లేదు. జనాన్ని జనధనాన్ని సంపాదించి లాభాలు లెక్కపెట్టుకోవడం తప్ప జనం కష్టాల పరిష్కారం వారికి అవసరం లేదు. రాజకీయ పార్టీలు, కావాలని అబద్ధ ప్రచారం కోసం చెప్పే అర్థరహిత ప్రకటనలు, సంపన్నుల కొమ్ముకాసే కొన్ని మీడియా చానళ్లు విపరీతమైన ప్రచారం ఇస్తాయి. వందలమంది ఆత్మాహుతి వారి రాతి రాక్షస మనసులను కరిగించదు. నిజానికి పది బస్సులు పగులగొట్టి సమైక్యాంధ్ర ఉద్యమం ఉందంటూ ఢిల్లీకి నివేదికలు పంపుతున్నారు. ఒకరిద్దరు డబ్బుతో కెమెరా ఫోజులకు పరిమితమైన ఉద్యమాలు చేయడం, వారు వాటాలిచ్చి వెంట పెట్టుకున్నసొంత విధేయ మీడియాలో ప్రచారం చేయడం, డిల్లీ వాటినే నమ్మడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పార్టీ మీద నాయకుల మీద, తెలంగాణ గొంతు వినిపిస్తున్న కాంగ్రెస్ ఎంపీల మీద వ్యక్తిగత నిందలు వేయడం కోస్తాంధ్ర నేతల కొత్త దుర్మార్గం. వీరు తమ పార్టీలో ఉన్న తెలంగాణ హోంమంత్రుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయిస్తారు. తెలంగాణ మంత్రి కన్నా డీజీపీకే ఎక్కువ అధికారాలుంటాయి. తెలంగాణకు చెందిన సేద్యపునీటి మంత్రిని బొమ్మవలె నిలబెట్టి, నదుల నీళ్లు తమ సీమలకు మళ్లించుకుంటారు. సిగ్గుపడవలిసిన వారు సిగ్గుపడడంలేదు. ఈ పాలసీలతో పాటు తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ద్వారా తెలంగాణ ఉద్యమనాయకులకు వ్యతిరేకంగా సభ్యతకు ఏ మాత్రం సంబంధంలేని భాషలో తిట్టిస్తారు. తెలుగు భాషాభివృధ్ధికి మీడియా గొప్ప సహాయం చేసిందని ఈ మధ్య జరిగిన సమావేశంలో చెప్పుకున్నారు. నిజమే. కానీ ఎవరి భాష అభివృద్ధి అయింది? తమ పక్షపాత అవసరాల కోసం నాయకుల ప్రసంగ పాఠాల్లో పత్రికాప్రకటనల్లో, విలేకరుల సమావేశాల్లో వాడే భాషను అభివృధ్ధి చేసి ప్రచారం ఇచ్చి పోషిస్తున్నారు. బాగా బాగుపడిన రెండు మూడు జిల్లాల యాస తప్ప మిగతా ప్రాంతాల నాయకులందరి యాసను వీరు అవహేళన చేస్తారు, చేయిస్తారు.

తెలంగాణ వద్దంటారా ఇమ్మంటారా స్పష్టంగా చెప్పలేని నాయకులకు అసలు నాయకులుగా ఉండే అర్హత ఉందా? అనేది మరో ప్రశ్న. సీట్లు ఓట్లు మాత్రమే లెక్కించుకుంటూ జనాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ఏ విధానమూ ప్రకటించని వారు పార్టీ అధ్యక్షుడెట్లా అవుతారు? దీన్నికాక మరి దేన్ని దివాళాకోరుతనం అంటారు. నాలుగు కోట్ల జనం సమస్య గురించి నాన్చే ధోరణిని అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక పార్టీలు మూడు: రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వాపస్ తీసుకున్న కాంగ్రెస్, వచ్చిన రాష్ట్రాన్ని ఆపడానికి కుయుక్తులు పన్నిన తెలుగుదేశం, చంద్రబాబు వలె రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవకాశవాద రాజకీయాన్ని అనుసరిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ వ్యతిరేకతలో ఒకటే, వారిలో ఐక్యత ఉంది. పైకి భేదాలు కనిపిస్తున్నా, ఈ మూడు పార్టీలలో కోస్తాంధ్ర నేతలు ఒకటే. వారిలో తెలంగాణ అనుచరుల విధేయత కూడా ఒకటే. వారు తెలంగాణ వ్యతిరేకులన్న విషయం పైకి చెప్ప రు. డిసెంబర్ 28న కూడా చెప్పరు. అనుకూలం అని చెప్పేదమ్ము వారికి ఉందని అనిపించడం లేదు. సీపీఎం చాలా స్పష్టంగా తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని చెప్పారు. సీపీఐ విశాలాంధ్రవాదాన్ని మార్చుకున్నది. బీజేపీ కూడా చాలా స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్ వ్యూహం ఇతరులు ఇచ్చే నిధులను బట్టి వారి విధానాలను బట్టి మారుతూ ఉంటుంది.

తెలంగాణ నేతలను రకరకాలుగా విభజించి వారి బతుకులతో ఆడుకుంటున్న కేంద్ర నాయకుల విచ్ఛిన్న రాజకీయాలకు బ్రిటిష్ వారి దేశద్రోహ స్వార్థ రాజకీయాలకు పెద్ద తేడా లేదు. హైదరాబాద్‌ను పాతబస్తీగా కొత్త నగరంగా విభజించారు. సైబరాబాద్ కొత్తగా పుట్టించిన కోస్తాంధ్ర రియల్ ఎస్టేట్ దందాల కేంద్రం. పాతబస్తీని మజ్లిస్ చెరలో మగ్గిపోవడానికి వీలుగా అక్కడ మత కలహాలను పెంచి పోషిస్తారు. గూండా రాజకీయాలకు డబ్బిచ్చి రెచ్చగొడతారు. అక్కడి ప్రజలకు బడులు కట్టరు. అక్కడి గుడులను బతకనివ్వరు. ఆలయ భూములను ఆక్రమించి గూండాలు రోడ్డుమీద కొట్టుకుంటూ ఉంటే అది మనదేశం కానట్టుంటారు. రోడ్లు వెడల్పు చేయరు. వెనుకబడితనంలో కొట్టుమిట్టాడమని వదిలేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటారు. ఇన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నిష్పాలనకు దుష్పాలనకు దశాబ్దాలకిందట ఉన్నంత వెనుకబడి ఉన్న పాతబస్తీయే ప్రత్యక్ష సాక్షి.

వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసే పెద్ద పథకాలు పెట్టడం, భారీ ఎత్తున వాటాలు లంచాలు పంచుకోవడమేనా తెలంగాణను అభివృధ్ధి చేయడమంటే. జలయజ్ఞం పూర్తిగా భూముల దందాగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లా భూములు ఆ విధంగా నాశనమై జనజీవనం అస్తవ్యస్తమైంది. భూములు వెల పెరిగి స్థానికులు బాగుపడ్డారనే మాట నిజమే అయినా మోసాలకు, దురాక్రమణలకు, దుర్మార్గాలకు ఈ పరిస్థితి దారి తీసినమాట అంతకన్నా వాస్తవం.

1956కు ముందు తెలంగాణను విడిగా ఉండనీయకుండా కలిపేందుకు గాను ప్రభావితం చేయగల ముగ్గురు నాయకులద్వారా 30 లక్షల రూపాయల లాబీయింగ్ జరిపారని విన్నట్టు ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు. తెలంగాణ ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ, ఢిల్లీపెద్దలకు జల్సాలు జరుపుకునేంత పెద్ద పండుగ. వారి తాబేదార్లకు, వారికోసం ఏమైనా చేసే అధికారులకు కూడా అంతే పండుగే. 1969, 2009, 2012 కూడా అంతే. వాల్‌మార్ట్ లాబీయింగ్ మీద దర్యాప్తు జరిపిస్తారట. తెలంగాణ వ్యతిరేక లాబీయింగ్ మీద, వారు ఢిల్లీలో ఇతరత్రా ఖర్చుచేసిన లాబీయింగ్‌పైన ఎవరి లాబీయింగ్‌కు లొంగని పెద్దమనుషులచేత దర్యాప్తు జరిపించే దమ్ముందా? తెలంగాణ ఇవ్వమంటారా వద్దంటారా?అనే ప్రశ్నకు డిసెంబర్ 28న ఒకే ముక్క సమాధానం చెప్పని పార్టీలు దివాళాకోరు పార్టీలని తెలంగాణ ప్రజలు తీర్మానించు కోవాలి. కాదన్న పార్టీలను పూర్తిగా తిరస్కరించాలి. అవునన్న పార్టీలను వెంటనే నమ్మకూడదు. తెలంగాణ అంటే మాకు ప్రేమ, తెలంగాణ బిడ్డలు బాగుండాలి, మేం ఎన్నడూ తెలంగాణ వ్యతిరేకులం కాదు అనివీరు చెప్పే మాటలన్నీ దారుణమైన అసత్యాలు. అవి తేనెపూసిన కత్తులు, చక్కెర చుట్టిన విష గుళికలు. అందరూ వీటినే తెలంగాణ మీద కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ ఇవ్వద్దని నమ్మితే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని వాదించే మోసం కూడా చేయవచ్చు. కాంగ్రెస్ ఇస్తుందని తలిస్తే వీరు ఇంకే ఎత్తుగడ వేస్తారో తెలియదు. నయవంచనకు గురైన తెలంగాణ కొత్త వంచనలను నమ్మకుండా జాగ్రత్త పడాలి.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *